చేనేత..ఏదీ చేయూత?
ప్రభుత్వం ఆదుకోవాలి..
● చతికిల పడిన చేనేత రంగం ● గిట్టుబాటు కాని మజూరీలు ● కార్మికులకు ప్రోత్సాహం కరువు ● ప్రత్యామ్నాయ వృత్తుల్లో చేనేత కుటుంబాలు
ఆమదాలవలస : జిల్లాలో వ్యవసాయం తర్వాత అంతటి ప్రాధాన్యమున్న చేనేత రంగంపై చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఏటా బడ్జెట్‌లో చేనేత రంగానికి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని పాలకులు ప్రగల్భాలు పలుకుతున్నా కార్మికులకు మాత్రం ఎటువంటి నిధులు అందడం లేదు. అరకొర మజూరిలు గిట్టుబాటు కాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస, పొందూరు మండలాల పరిధిలో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆమదాలవలస మండలంలోని అక్కులపేట, వేణమ్మపేట, ఎస్సార్సీపేట, చింతలపేట, బొబ్బిలిపేట, దూసి, ముద్దాడపేట తదితర గ్రామాల్లో సుమారు 260 కుటుంబాలు మగ్గాలపై ఆధారపడి బతుకుతున్నారు. పొందూరు మండలంలో పొందూరు, తోలాపి, తండ్యాం మెట్ట తదితర గ్రామాల్లో సుమారు 450 కుటుంబాలు చేనేతనే నమ్ముకున్నాయి. ప్రభుత్వం వీరికి మగ్గాలు నూలు కొనుగోలుకు లక్షలాది రూపాయలు ఆర్థిక సహాయం అందించినట్లు రికార్డులో చూపుతున్నారు. వాస్తవంగా ఆ నిధులన్ని బినామీ పేర్లతో కొంతమంది చేనేత సొసైటీల ప్రతినిధులు, అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు స్వాహా చేస్తున్నారని నేత కార్మికులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబమంతా శ్రమించినా..
పెరిగిన నూలు ధరలకు అనుగుణంగా కుటుంబమంతా శ్రమించి నేస్తున్నా రోజుకు రూ.150 నుంచి రూ.200కు మించి గిట్టుబాటు కావడం లేదని చేనేత కార్మికులు చెబుతున్నారు. మిల్లుల్లో తమారయ్యే దుస్తులకు గిరాకీ ఉండడం, చేనేత వస్త్రాల ధరలకు పాలిస్టర్‌తో పోల్చితే అధికంగా ఉండడం తదితర కారణాలతో ఆర్డర్లు తక్కువగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మజూరి(కూలీ) గిట్టుబాటు కాక ప్రత్యామ్నాయ పనులకు వెళ్లాల్సి వస్తోందని, పనికి వెళ్తే కూలి రూ.500 వస్తుందని చెబుతున్నారు.
పాలకుల నిర్లక్ష్యం..
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యం కారణంగా నేడు దయనీయ స్థితికి చేరుకుంది. చేనేత రంగం అభివృద్ధి కోసమంటూ ఏటా కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా అవేవీ కార్మికుల చెంతకు చేరడంలేదు. ఓవైపు ప్రభుత్వం ప్రోత్సాహం లేక, మరో వైపు మజూరి గిట్టుబాటు కాక నేతన్నలు ప్రత్యామ్నాయ పనులు, వృత్తులను ఆశ్రయిస్తున్నారు.
ఆదుకోని వర్క్‌షాప్‌లు..
మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పద్ధతుల్లో చేనేత వస్త్రాలు తయారు చేసే ఉద్దేశంతో కార్మికుల వృత్తి నైపుణ్యత పెంచేందుకు జిల్లాలో గతంలో రూ.10 కోట్లతో వర్కుషాపు నిర్వహించారు. ఈ శిక్షణ సొసైటీ పరిధిలో ఉన్న కొందరి కార్మికులకు మాత్రమే ఉపయోగపడిందని అంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ స్పందించి నేత కార్మికులను ఆదుకునే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
పాలకులు స్పందించి రుణాలు, పథకాలు అందించి చేనేత కార్మికులను ఆదుకోవాలి. ఎన్నికల హామీలు అమలు చేయాలి. ప్రోత్సాహకాలు అందించి, మజూరీలు పెంచి చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలి.
– బొట్ట సత్యనారాయణ,
వైఎస్సార్ సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు
చేనేత కార్మికులను ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకోవాలి. ఇదే వృత్తిని నమ్ముకొని ఉన్న చేనేత కార్మికులు బయట పనులు చేసుకోలేక, ఇప్పుడిస్తున్న మజూరీ చాలక అవస్థలు పడుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో చాలామంది ఉన్నాం.
– ఎ.పైడిరాజు చేనేత కార్మికుడు,
ఆమదాలవలస


