సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని దుకాణాలను 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ జారీ చేసిన జీవో నెం:4 అన్ని రకాల దుకాణాలకు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ జీవో జారీ నేపథ్యంలో ఏయే రకాల దుకాణాలను 24 గంటలు తెరచి ఉంచవచ్చనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్పష్టతనిస్తూ రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ‘దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఇప్పటికే ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి.
ఈనెల 4వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులు తెలంగాణ రాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్–1988కు లోబడి అమలవుతాయి. కానీ, అన్ని షాపులకు వర్తించదు. 24 గంటల పాటు షాపులు తెరచి ఉంచాలనుకునే వ్యాపారులు ప్రత్యేక నిబంధనల మేరకు అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ ఉత్తర్వులు ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖకు వర్తించవు. ఎక్సైజ్ చట్టాలు, నిబంధనలు అనుసరించి మాత్రమే రాష్ట్రంలో టీఎస్‌బీసీఎల్, ఐఎంఎఫ్‌ఎల్ డిపోలు, డిస్టిలరీలు, బ్రూవరీలు, ఏ4 షాపులు (వైన్స్), బార్లు తెరచి ఉంటాయి.’ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment