
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. తమిళిసై సౌందరరాజన్ 10 బిల్లులను ఆపడంతో తాడోపేడో తేల్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆమె వ్యవహరశైలిపై సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశించాలని చీఫ్ సెక్రెటరీ పటిషన్‌లో కోరారు. ప్రతివాదిగా గవర్నర్ పేరును చేర్చారు. ఇది సుప్రీంకోర్టులో రేపు( శుక్రవారం) విచారణకు వచ్చే అవకాశముంది.
'గవర్నర్ బిల్లులను ఆపడం రాజ్యాంగ విరుద్ధం. ఆలస్యం అవ్వడం వల్ల బిల్లుల ప్రయోజనాలు దెబ్బతింటాయి. పది బిల్లులుపై ఆమోదమ ? కాదా ? చెప్పడం లేదు. సహేతుక కారణాలు లేకుండా పెండింగ్ సరికాదు. సంబంధిత మంత్రులు గవర్నర్‌ను కలిసి వివరణలు కూడా ఇచ్చారు. త్వరలోనే ఆమోదిస్తామని గవర్నర్ చెప్పినా ఆచరణలో లేదు. ఆర్టికల్ 163 ప్రకారం మంత్రిమండలి సలహా మేరకే విధులు నిర్వర్తించాలి. స్వతంత్రంగా వ్యవహరించాలని భావించరాదు.' అని తెలంగాణ సీఎస్ పటిషన్లో పేర్కొన్నారు. నాటి రాజ్యాంగ సభ డిబేట్లను కూడా ప్రస్తావించారు. కాగా.. హైకోర్టు జోక్యంతో బడ్జెట్ -గవర్నర్ ప్రసంగం ఇష్యూ సమసి పోయిన విషయం తెలిసిందే.
చదవండి: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్తత.. ఎంపీ కోమటిరెడ్డి దీక్ష