ట్రంప్‌ను మార్చిన ఫొటో.. ఎందుకు?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసును మార్చడం కష్టం. ఆయన అనుకున్న దాన్ని సాధించే వరకూ విడిచిపెట్టరని పారిస్ ఒప్పందం(కాప్-22 వాతావరణ ఒప్పందం) రద్దు, ముస్లిం దేశాలపై విధించిన ఆంక్షలు రుజువు చేశాయి. అలాంటి ట్రంప్.. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా మనసు మార్చుకున్నారు.
మరి ట్రంప్ మనసు మార్చుకుంది అమెరికా కోసమా?. కాదు. పరాయి దేశమైన అప్ఘనిస్తాన్ కోసం. ఆ దేశంలోని ఒకప్పుడు వెల్లివిరిసిన ఆనందాలను తిరిగి నింపడం కోసం. మరి ట్రంప్ మనసు ఎలా మారింది?. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మెక్‌మస్టర్ ట్రంప్ మనసును మార్చారు. అది కూడా ఓ ఫొటో చూపించి.
ఆ ఫొటోకు ఓ ప్రత్యేకత ఉంది. అది కొందరు ఆడవాళ్లు తమకు నచ్చిన దుస్తులు ధరించిన నడుచుకుంటూ వెళ్తున్న ఫొటో. 1970ల్లో అప్ఘనిస్తాన్‌లోని పరిస్థితులకు ఆ చిత్రం ప్రతీక. 1930-1970ల మధ్య అప్ఘనిస్తాన్‌లో మహిళలు స్వేచ్చగా సంచరించేవారని అందుకు ఈ చిత్రమే ఉదాహరణ అని మెక్‌మస్టర్ అధ్యక్షుడు ట్రంప్‌తో చెప్పారు. 1990ల్లో అప్ఘనిస్తాన్‌ను తాలిబన్లు తమ చేతిలోకి తీసుకుని, మహిళల దుస్తులపై ఆంక్షలు విధించారని వివరించారు.
అప్ఘనిస్తాన్‌లో తిరిగి శాంతి సామరస్యాలు నెలకొల్పాలంటే ఆ దేశం నుంచి అమెరికా దళాలను ఉపసంహరించొద్దని కోరారు. మెక్‌మస్టర్ మాటలను నిశితంగా విని, ఫొటోను పరిశీలించిన ట్రంప్.. అప్ఘనిస్తాన్‌లో యుద్ధాన్ని ఆపొద్దని చెప్పారు. దళాలను ఉపసంహరించుకోవడం లేదని ప్రకటించారు. అవసరమైతే మరిన్ని దళాలను పంపడానికి కూడా సిద్ధమని పేర్కొన్నారు.