ఆడియో వేడుకకే కళ్లు చెదిరే ఖర్చు
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా 2.0. ఇదే కాంబినేషన్లో ఘనవిజయం సాధించిన రోబో సినిమాకు సీక్వల్గా 2.0ను రూపొందిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యథిక బడ్జెట్తో ఏకంగా 400 కోట్లకు పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఆరు నెలల సమయం తీసుకుంటున్నారు.
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న 2.0 ఆడియో వేడుకను కళ్లు చెదిరే ఖర్చు అంగరంగవైభవంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. గతంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఐ సినిమా ఆడియో వేడుకను కూడా ఇదే స్థాయిలో నిర్వహించారు. ఇప్పుడు 2.0 కోసం అంతమించి ఖర్చు చేస్తున్నారట. దుబాయ్లో జరగనున్న ఈ వేడుకకు 25 కోట్ల బడ్జెట్ను నిర్ణయించారు చిత్ర నిర్మాతలు.
పలువురు హాలీవుడ్ స్టార్స్ కూడా 2.0 ఆడియో వేడుకలో సందడి చేసే అవకాశం ఉంది. రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. బ్రిటీష్ బ్యూటీ అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్తో రూపొందుతున్న రోబో సీక్వల్ 2.0ను వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.