మోదీ నివాసంలో రహస్యంగా!
నోట్ల రద్దుపై ఆరుగురు సభ్యుల బృందం కసరత్తు
► కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అధియా నేతృత్వంలో..
► కీర్తిప్రతిష్టలు, ప్రజాదరణను పణంగా పెట్టి నిర్ణయం తీసుకున్న మోదీ
► నోట్ల రద్దు వికటిస్తే నేను బాధ్యత తీసుకుంటా: కేబినెట్‌తో ప్రధాని
న్యూఢిల్లీ: నెల రోజులుగా దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నోట్ల రద్దుపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవటం, నవంబర్ 8న ప్రకటించటం వెనక చాలా పెద్ద అధ్యయనమే జరిగింది. మోదీ ఆదేశాలతో ఆరుగురు సభ్యుల బృందమొకటి అహోరాత్రులు శ్రమించింది. పీఎంవో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో భేటీ అయితే అనుమానాలొస్తాయని.. ఏకంగా ప్రధాని నివాసంలోని (7 లోక్‌కళ్యాణ్ మార్గ్) రెండు గదుల్లో సెటిలై అధ్యయనం చేసింది. మోదీకి విశ్వాసపాత్రుడైన ఐఏఎస్ అధికారి హస్ముఖ్ అధియా ఈ టీమ్‌కు నాయకత్వం వహించారు. మిగిలిన సభ్యులంతా డేటా, ఆర్థిక విశ్లేషణలో నిపుణులైన యువకులే. (కొందరు మోదీ సోషల్ మీడియా అకౌంట్లను, యాప్‌లను నిర్వహిస్తున్నారు). ఈ టీమ్ సారథి అధియా, ప్రధానికి నమ్మినబంటుగా పనిచేసిన అధికారి. బయటి ప్రపంచంలోనే చాలా తక్కువ మందికే ఈయనతో పరిచయం ఉంది. నల్లధనంపై ఎన్నికల్లో చేసిన వాగ్దానాలపై పనిచేసిన ఈ బృందం.. భారత ఆర్థిక వ్యవస్థకు సమస్యగా మారిన నల్లధనం, అవినీతిని పారద్రోలేందుకు సాధ్యమైనన్ని ప్రయత్నాలను పరిశీలించాక.. చివరికి ఈ నిర్ణయానికొచ్చింది.
ప్రతి అడుగూ రహస్యమే.. రూ. 500, వెయ్యి నోట్ల రద్దు విషయం తెలిస్తే.. ఎవరెవరు ముందుగా జాగ్రత్తపడతారో, డబ్బును బంగారం, ఇతర ఆస్తుల రూపంలోకి మార్చుకుని అక్రమ ఆస్తులు కూడబెట్టుకుంటారో ముందుగానే గుర్తించి.. వారికి అసలెంతమాత్రం సమాచారం తెలియకుండా అత్యంత రహస్యంగా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టారు. అంతా అనుకున్నట్లుగా జరిగాకే.. దీనిపై ప్రకటనకు మోదీ సిద్ధమయ్యారు. విధి విధానాల వెల్లడి, పథకం అమలుతోపాటు.. ప్రకటన తర్వాత తలెత్తే ఏ ఇబ్బందినైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు మోదీ సిద్ధమయ్యారు. తన ప్రజాదరణ, కీర్తిప్రతిష్టలను పణంగా పెట్టి ఈ నిర్ణయం తీసుకున్న మోదీ.. ఏమాత్రం తలకిందులైనా తనే బాధ్యతగా తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ‘నోట్లరద్దుపై పరిశోధనలన్నీ చేశాను. అంతా మంచే జరుగుతుంది. ఈ పథకం విఫలమైతే.. దానికి నేను బాధ్యత తీసుకుంటాను’ అని నవంబర్ 8 ప్రకటనకు ముందు జరిగిన కేబినెట్ భేటీలో ప్రధాని తెలిపారు. ఈ సంగతిని కొందరు మంత్రులు రాయిటర్స్ వార్తాసంస్థకు చెప్పారు.
మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2003–2006 మధ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అధియా తన పనితీరుతో మోదీని ఆకట్టుకున్నారు. విశ్వసనీయంగా, సమర్థవంతంగా పనిచేయటంతోపాటు నరేంద్రుడికి యోగాను పరిచయం చేశారు. ఈ బృందాన్ని ఇంటర్వూ్య చేసిన రాయిటర్స్ రిపోర్టర్స్ వెల్లడించిన ప్రకారం.. అధియాచతురత కలిగిన నిష్కపటమైన వ్యక్తి. 2015 సెప్టెంబర్‌లో అధియా కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈయన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి రిపోర్టు చేయాలి కానీ.. ప్రధానితో నేరుగా సంబంధాలుండడం గమనార్హం. లోతైన విషయాలపై చర్చ జరుగుతున్నప్పుడు మోదీ, అధియా గుజరాతీలో మాట్లాడుకుంటారు.
ముందుగా అనుకున్నదే కానీ..
నోట్ల రద్దు వ్యవహారం మోదీ సడన్ గా తీసుకున్నదేం కాదు. మొన్నటి ఏప్రిల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్లేషకులు ‘పెద్దనోట్ల రద్దు’ సాధ్యమేనని తెలిపారు. మేలో రిజర్వ్ బ్యాంకూ కొత్త సిరీస్ నోట్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాదు.. రూ. 2 వేల నోటు డిజైన్ కూడా పూర్తయిందని.. ఆగస్టులో ప్రకటించింది. నోట్ల ముద్రణ కేంద్రాలు పనిచేయటం ప్రారంభించకముందే అక్టోబర్ చివర్లో మీడియాలో కొత్తనోట్ల వార్తలొచ్చాయి. దీంతో మోదీ అండ్ టీమ్ అప్రమత్తమైంది. ‘ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం నవంబర్ 18న ఈ ప్రకటన చేయాల్సి ఉంది. కానీ ఈ విషయం లీకయ్యే ప్రమాదం ఉండటంతో ముందుగానే ప్రకటించాల్సి వచ్చింది’ అని ఈ విషయం బాగా తెలిసిన వ్యక్తి ఒకరు రాయిటర్స్‌కు వెల్లడించారు.
ప్రతీదీ పక్కాగా..
మోదీ నవంబర్ 8న నోట్ల రద్దును ప్రకటించగానే.. అధియా ఓ ట్వీట్ చేశారు. ‘నల్లధనాన్ని నిర్మూలించటంలో ప్రభుత్వం తీసుకున్న పెద్ద, ధైర్యమైన నిర్ణయం’ అన్నారు. నల్లధనం నిర్మూలిస్తామంటూ ఎన్నికల్లో ప్రకటించిన మోదీ.. అధికారంలోకి వచ్చినçప్పట్నుంచీ అదే పనిలో ఉన్నారని ఆయన సన్నిహితులంటారు. చాలాసార్లు ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక నిపుణులతో మోదీ చర్చలు జరుపుతూనే ఉన్నారు. ‘భారత్ కొత్త నోట్లను ఎంత త్వరగా ముద్రించగలదు? వాటినెలా పంపిణీ చేయాలి? ప్రభుత్వ బ్యాంకులకు డిపాజిట్లు పెరగటం వల్ల ఎలాంటి లాభం ఉంటుంది?, నోట్లరద్దువల్ల ఎవరు లాభపడతారు?’ అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలనే వారన్నారు. వీటి ద్వారా నోట్ల మార్పిడిపై∙కొంత సమాచారం మోదీకి వచ్చింది.
‘తప్పుచేసిన వారెవరూ పారిపోకుండా ఉండాలనుకున్నాం. ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తే.. చేసిందంతా అర్థరహితమే అని అనుకున్నాం’ అని అధ్యయనంలో పాలుపంచుకున్న అధికారి తెలిపారు. ప్రజలకు సమస్యల్లేకుండా.. కొత్త నోట్లతో 2లక్షల ఏటీఎంలను నింపేందుకు అవసరమైన 8 లక్షల కోట్ల రూపాయలను ఏటీఎంలలో నింపి ఆర్థిక వ్యవస్థను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావటం అంత సులభమేం కాదు. దేశంలోని నాలుగు నోట్ల ముద్రణ కేంద్రాలు అహోరాత్రులు శ్రమించి కొత్త 500, 2వేల రూపాయల నోట్లను ముద్రిస్తే.. అవి మార్కెట్లోకి వచ్చి ప్రజలకు అందేందుకు కనీసం 3 నెలలు పడుతుంది. ఈ విషయం మోదీకి తెలుసు. అందుకే డిజిటల్ పేమెంట్స్‌పై దృష్టి సారించారు. రహస్యంగా పనిచేయటమే ఈ ఆపరేషన్ కు చాలా కీలకం.