మోదీ కేబినెట్‌కు కొత్తరక్తం | Union Cabinet reshuffle tomorrow | Sakshi
Sakshi News home page

మోదీ కేబినెట్‌కు కొత్తరక్తం

Published Sun, Sep 3 2017 8:10 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

మోదీ కేబినెట్‌కు కొత్తరక్తం - Sakshi

మోదీ కేబినెట్‌కు కొత్తరక్తం

కేంద్ర కేబినెట్‌లో తొమ్మిది కొత్త ముఖాలకు చోటు
► ఏపీ, తెలంగాణలకు మొండిచేయి!
► జేడీయూ, అన్నాడీఎంకేలకు దక్కని చోటు


సాక్షి, న్యూఢిల్లీ: చాన్నాళ్లుగా ఆసక్తి రేపుతున్న కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణపై సస్పెన్స్‌ వీడింది. నాలుగైదు రోజులుగా మంత్రి పదవులపై జరుగుతున్న చర్చకు తెరదించుతూ 9 మంది కొత్తవారికి అవకాశం ఇస్తూ ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

ప్రధాన మంత్రి నాలుగు ‘పీ’ (అభిరుచి (ప్యాషన్‌), సామర్థ్యం (ప్రొఫిషియన్సీ), నైపుణ్యత (ప్రొఫెషనలిజం), రాజకీయ చతురత (పొలిటికల్‌ అక్యుమెన్‌)) ఫార్ములా ఆధారంగానే ఈ జాబితాను రూపొందించినట్లు భావిస్తున్నారు. కాగా, ఎన్డీయేలో చేరిన జేడీయూతోపాటుగా అన్నాడీఎంకే పార్టీకీ కేబినెట్‌ విస్తరణలో చోటు దక్కలేదు. అటు, ఈ విస్తరణలో మరో బెర్తు దక్కుతుందని భావించిన శివసేన కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, తెలంగాణ, ఏపీలనుంచి కేబినెట్‌లో ఎవరికీ తాజా పునర్వ్యవస్థీకరణలో చోటు దక్కలేదు. కుటుంబంతో సహా రావాలంటూ ఏపీ బీజేపీ చీఫ్‌ హరిబాబుకు సమాచారం వచ్చినా.. తాజా జాబితాలో మాత్రం ఆయన పేరు ప్రస్తావించలేదు. అటు తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయ స్థానంలోనూ ఎవరికీ కేబినెట్‌ బెర్తు దక్కలేదు.

నలుగురు బ్యూరోక్రాట్లు
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో.. అశ్విని కుమార్‌ చౌబే (బిహార్‌), శివ్‌ ప్రతాప్‌ శుక్లా (యూపీ), రాజ్‌ కుమార్‌ సింగ్‌ (బిహార్‌), వీరేంద్ర కుమార్‌ (మధ్యప్రదేశ్‌), అనంత కుమార్‌ హెగ్డే (కర్ణాటక), హర్‌దీప్‌ సింగ్‌ పూరీ (పంజాబ్‌), గజేంద్ర సింగ్‌ షెకావత్‌ (రాజస్తాన్‌), సత్యపాల్‌ సింగ్‌ (యూపీ), అల్ఫోన్స్‌ కణ్ణాంథనం (కేరళ)లకు చోటు దక్కింది. ఇందులో ఆర్కే సింగ్, హర్‌దీప్‌ సింగ్‌పురీ, సత్యపాల్‌ సింగ్, అల్ఫోన్స్‌లు అఖిలభారత సర్వీసుల్లో బాధ్యతలు నిర్వహించారు. అల్ఫోన్స్, హర్‌దీప్‌ సింగ్‌లు ఎంపీలు కారు. రాజీనామా చేసిన స్థానాలతోపాటుగా మంత్రులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న శాఖల్లోనూ మార్పులు జరగనున్నాయి. పనితీరు సంతృప్తికరంగా ఉన్నవారికి ప్రమోషన్లతోపాటుగా.. అసంతృప్తులను అప్రాధాన్య శాఖల కేటాయింపు జరిగే అవకాశాలున్నాయి.

మార్పులు, చేర్పులపై సస్పెన్స్‌!
అయితే, సీనియర్‌ మంత్రుల శాఖల్లోనూ మార్పులుండొచ్చన్న నేపథ్యంలో పలువురు మంత్రులు నిర్వహిస్తున్న అదనపు బాధ్యతలను ఎవరికి కట్టబెడతారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.   సురేశ్‌ ప్రభు, నితిన్‌ గడ్కారీల్లో ఒకరికి కీలకమైన రక్షణ శాఖను కట్టబెట్టే యోచనలో మోదీ–షా ద్వయం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సురేశ్‌ ప్రభుకు రక్షణ శాఖను కేటాయిస్తే.. మరో కీలకమైన శాఖను గడ్కారీకి అదనంగా అప్పగించవచ్చని తెలుస్తోంది.

కేంద్ర విద్యుత్‌ మంత్రి పీయుష్‌ గోయల్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, టెలికాం మంత్రి మనోజ్‌ సిన్హాలకు ప్రమోషన్‌లు లభించనున్నాయని సమాచారం. అయితే అంచనాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకునే మోదీ–షాలు.. శాఖల మార్పు విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆదివారం ఉదయమే తెలుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, శనివారం రాత్రి బీజేపీ కీలక నేతలతో మోదీ, షాలు భేటీ అయ్యారు. సుష్మ, రాజ్‌నాథ్, గడ్కరీ, జైట్లీ తదితర ప్రముఖులు ఈ సమావేశంలో హాజరయ్యారు.  

రాజీనామా చేసిన మంత్రులు
కల్రాజ్‌ మిశ్రా, దత్తాత్రేయ, రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ, సంజీవ్‌ కుమార్‌ బల్యాన్, ఫగన్‌సింగ్‌ కులస్తే, మహేంద్రనాథ్‌ పాండేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పార్టీ సీనియర్‌ నేత కల్రాజ్‌ మిశ్రా వృద్ధాప్యం కారణంగా రెండు నెలల క్రితమే తప్పుకోనున్నట్లు ప్రకటించారు. కేంద్ర మంత్రి ఉమాభారతి రాజీనామా చేసినా తుది నిర్ణయం తీసుకోలేదు.

జేడీయూ, అన్నాడీఎంకేలకు దక్కని చోటు
జేడీయూ కేంద్ర కేబినెట్‌లో చేరటంపైనా స్పష్టత రాలేదు. దీనిపై ఇప్పటి వరకు బీజేపీ తమతో చర్చలు జరపలేదని బిహార్‌ సీఎం నితీశ్‌ చెప్పారు. ‘కేబినెట్‌లో జేడీయూ చేరిక గురించి చర్చలేమీ జరగలేదు. జేడీయూ కేంద్ర ప్రభుత్వంలో చేరుతోందనే వార్త మీడియా ద్వారానే నాకు తెలిసింది. దీని గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు’ అని నితీశ్‌ స్పష్టం చేశారు. అటు, అన్నాడీఎంకేలో అంతర్గత సమస్యలు పెరిగిపోవటంతో ఈ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరేందుకు ప్రధాన అవరోధంగా మారింది.  

రెండో జాబితా వస్తుందా?
కేంద్రం గరిష్టంగా 81 మంది మంత్రులను నియమించుకోవచ్చు.  ప్రస్తుతం ప్రధానితో సహా కేంద్ర మంత్రుల సంఖ్య 73. ఆరుగురు మంత్రులు రాజీనామా చేయటంతో ఈ సంఖ్య 67కు చేరింది. ఆదివారం 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే.. కేంద్ర కేబినెట్‌ సంఖ్య 76కు చేరుతుంది. అంటే కేంద్రం మరో ఐదుగురిని నియమించుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి జేడీయూ సహా ఎన్డీయే మిత్ర పక్షాలకు తాజా విస్తరణలో చోటు దక్కనందున.. అన్నీ సర్దుకున్నాక త్వరలోనే మరో ఐదుగురికి మోదీ అవకాశం ఇస్తారా? అనేదీ ప్రశ్నార్థకమే. కాగా, రాజీనామా చేసిన కేంద్ర మంత్రులు అవినీతిలో కూరుకుపోయినందునే వీరిని తప్పిస్తున్నారా? అని కాంగ్రెస్‌ అనుమానం వ్యక్తం చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement