ప్రతీ మ్యాచ్ లో వద్దు..!
న్యూఢిల్లీ: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య గురువారం పల్లెకెలె వేదికగా రెండో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ కు ముందు ఇరు జట్లు జాతీయ గీతాలాపన చేయకుండానే పోరుకు సిద్ధమయ్యాయి. సాధారణంగా ప్రతీ మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరు దేశాల క్రికెట్ జట్లు జాతీయ గీతాలాపన చేసిన తరువాతే ఫీల్డ్ లోకి దిగుతాయి. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) తీసుకొచ్చిన కొత్త రూల్ తో అది ఒక సిరీస్ లో మ్యాచ్ కు మాత్రమే పరిమితమైంది. కేవలం సిరీస్ ఆరంభపు మ్యాచ్ కు మాత్రమే జాతీయ గీతాలాపన ఉండాలంటూ ఎస్ఎల్సీ కొత్త నిబంధన తీసుకురావడమే ఇందుకు కారణం.
ఇక నుంచి స్వదేశంలో మ్యాచ్ లు జరిగేటప్పుడు ఓపెనింగ్ గేమ్ లో మాత్రమే జాతీయ గీతాలాపన ఉంటుందని ఆ దేశ క్రికెట్ మీడియా మేనేజర్ దినేశ్ రత్నసింఘం తెలిపారు. ఈ క్రమంలోనే తొలి వన్డేకు మాత్రమే పరిమితమైన జాతీయ గీతాలాపన ఇక మిగిలిన నాలుగు వన్డేలకు ఉండదన్నారు. మళ్లీ ఏకైక ట్వంటీ 20 జరిగే ప్రేమదాస స్టేడియంలో మాత్రమే ఇరు జట్లు జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొంటాయని రత్నసింఘం పేర్కొన్నారు.