శరీరాలు రిసార్టులో.. మనస్సు సెల్వంపై!
చెన్నై: ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకుసాగుతున్న ఆపద్ధర్మ సీఎం ఓ. పన్నీర్‌సెల్వంకు ప్రజామద్దతు పోటెత్తుతున్నది. ఆయనకు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తుండటం గమనార్హం. జయలలిత మృతి తర్వాత శశికళపై కొంత వ్యతిరేకత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జయలలిత మృతిపై అనుమానాలు రావడం కూడా జనాల్లో శశిపై వ్యతిరేకత పెంచిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఏకంగా ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధమవుతుండటం పలు వర్గాలు వ్యతిరేకిస్తున్నారు.
ఆమెను వ్యతిరేకిస్తున్నవారు నేరుగా ముందుకొచ్చి పన్నీర్ సెల్వానికి అండగా నిలబడుతున్నారు. తాజాగా పెద్ద ఎత్తున లాయర్లు పన్నీర్ సెల్వం మద్దతుగా ముందుకొచ్చారు. ఆయన ఇంటిముందు గుమిగూడి.. ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వమే కొనసాగాలని డిమాండ్ చేశారు. శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను శశికళ వర్గం బలవంతంగా నిర్బంధించిందని, మెజారిటీ ఎమ్మెల్యేలు సెల్వానికి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నా.. అందుకు ఆమె అంగీకరించడం లేదని లాయర్లు తెలిపారు. శశికళ బలవంతంగా నిర్బంధించిన రిసార్టులో ఎమ్మెల్యేలు ఉన్నా .. వారి ఆత్మలు పన్నీర్ సెల్వం వద్దే ఉన్నాయని, వారికి స్వేచ్ఛనిస్తే చాలామంది సెల్వానికి అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నారని లాయర్లు తెలిపారు.