ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో డ్రాగన్ మరోసారి బుసలు కొట్టింది.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో డ్రాగన్ మరోసారి బుసలు కొట్టింది. భారత్ చైనా పట్ల అహంకారం ప్రదర్శించేందుకు అనువైన సమయం ఇది కాదని, అమెరికా భారత్‌కు ఇస్తున్న వ్యూహాత్మక మద్దతు వట్టి కల్పితమేనని చిందులు తొక్కింది. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణకు దిగే సాహసం భారత్ చేయకూడదని హెచ్చరించింది. ప్రధాని మోదీ తొలిసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక భేటీ జరిపిన నేపథ్యంలో ఈమేరకు విషం చిమ్ముతూ చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ వ్యాసాన్ని ప్రచురించింది.
‘సరిహద్దుల విషయంలో చైనాతో భారత్ ఘర్షణకు దిగజాలదు. జాతీయత శక్తి విషయంలో చైనా కన్నా భారత్ ఎంతో వెనుకబడి ఉంది. అమెరికా ఇస్తుందనుకున్న వ్యూహాత్మక మద్దతు వట్టి కల్పితమే. చైనాపై అహంకారం ప్రదర్శించేందుకు భారత్‌కు ఇది అనువైన సమయం కాదు’ అని ఈ వ్యాసం పేర్కొంది. భారత్‌తో ఘర్షణకు దిగాలన్న కోరిక చైనాకు లేదని చెప్పుకొచ్చింది.
ఇప్పటికే భారతీయులు పవిత్రంగా భావించే కైలాస్ మానస సరోవర్ యాత్ర మార్గాన్ని మూసివేసి చైనా తన వైఖరిని చెప్పకనే చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భారత దళాలు చైనా భూభాగంలోకి వచ్చాయని నిందిస్తూ నిరసన వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో తాజా ఘర్షణాత్మక వాతావరణానికి చూపే పరిష్కారంపైనే భవిష్యత్తులో భారతీయులను మానస సరోవర్ యాత్రకు అనుమతించాలా లేదా అనేది ఆధారపడి ఉంటుందని చైనా మంగళవారం తెలిపింది. అగ్రరాజ్యం అమెరికాతో భారత్ సన్నిహిత సంబంధాలు నెరుపుతుండటాన్ని తట్టుకోలేకనే చైనా ఈ విధంగా వ్యవహరిస్తున్నదని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.