పుతిన్ చేతిలో ట్రంప్ జుట్టు? | Russia might have dirty videos of donald trump, says media | Sakshi
Sakshi News home page

పుతిన్ చేతిలో ట్రంప్ జుట్టు?

Published Wed, Jan 11 2017 7:53 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

పుతిన్ చేతిలో ట్రంప్ జుట్టు? - Sakshi

పుతిన్ చేతిలో ట్రంప్ జుట్టు?

అమెరికా నిఘా సంస్థల ‘నివేదిక’ సంచలనం
- 2013లో మాస్కోలో వేశ్యలతో ట్రంప్ విపరీత లైంగిక చర్యలు 
- ఆ వీడియో దృశ్యాలతో ట్రంప్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్న రష్యా 
- గత ఏడాదే ‘నివేదిక’ అందించిన బ్రిటిష్ మాజీ నిఘా అధికారి
- అధ్యక్ష ఎన్నికలకు ముందు నుంచి ఈ వ్యవహారంపై లీకులు 
- ఒబామా, ట్రంప్‌లకు గతవారం ‘సారాంశం’ చెప్పిన నిఘా సంస్థలు
- అదంతా కట్టుకథ అంటూ ట్విట్టర్‌లో కొట్టేసిన డోనాల్డ్ ట్రంప్ 
 
అమెరికా కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను రష్యా కొన్నేళ్లుగా తన గుప్పిట్లో ఉంచుకుని బ్లాక్‌మెయిల్ చేసిందంటూ అమెరికా మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ట్రంప్‌కు సంబంధించిన అసభ్య, లైంగిక కార్యకలాపాల దృశ్యాలు రష్యా వద్ద ఉన్నాయని, రష్యా ప్రతినిధులు వాటిని అడ్డం పెట్టుకుని ట్రంప్‌ను తాము చెప్పినట్లు నడిపిస్తున్నారనే ఆరోపణలతో కూడిన ఒక నిఘా ‘నివేదిక’ను బజ్ఫీడ్ అనే వార్తా వెబ్‌సైట్ మంగళవారం పూర్తిగా ప్రచురించింది. నిజానికి.. నిర్ధారణ కాని ఆరోపణలతో కూడిన ఈ నివేదిక గత కొన్ని నెలలుగా అమెరికాలో అగ్రస్థాయి రాజకీయ నాయకులు, నిఘా సంస్థల అధిపతులు, మీడియా ప్రతినిధుల చేతుల్లో తిరుగుతోందని సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ సైతం బుధవారం కథనాలు ప్రచురించాయి. ఈ నివేదికలోని అంశాల సారాంశాన్ని రెండు పేజీలలో గత శుక్రవారం నాడు అధ్యక్షుడు బరాక్ ఒబామాకు, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా ఎఫ్బీఐ, సీఐఏ తదితర నిఘా సంస్థల అధిపతులు స్వయంగా నివేదించినట్లు కూడా ఆ కథనాలు చెబుతున్నాయి. అయితే అవన్నీ తప్పుడు ఆరోపణలని ట్రంప్ ట్విట్టర్‌లో కొట్టివేశారు. తనపై రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 
 
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
ఆదినుంచి రష్యా ఏజెంట్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న డోనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా మరో పది రోజుల్లో బాధ్యతలు చేపట్టనుండగా సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. డెమొక్రటిక్ పార్టీ ఈ-మెయిళ్లను హ్యాక్ చేయాలని తమ వారిని ఆదేశించడం ద్వారా.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు సాయం చేయడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నించారని ఎఫ్బీఐ ఇప్పటికే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. రష్యా చేతిలో ట్రంప్‌కు సంబంధించిన లైంగిక కార్యకలాపాల వీడియోలు, ఇతర ఆర్థిక సమాచారం ఉన్నాయని, వాటిని అడ్డం పెట్టుకుని ట్రంప్‌ను రష్యా బ్లాక్ మెయిల్ చేస్తోందని ఒక ‘నిఘా నివేదిక’  బట్టబయలయింది. అయితే.. ఇందులోని ఆరోపణలు నిర్ధారణ కాలేదంటూనే.. ఆయా మీడియా సంస్థలు దానిలోని అంశాలను బయటపెట్టాయి. రష్యా గూఢచార సంస్థకు చెందిన మాజీ ఉన్నతాధికారి, పలువురు అమెరికా నిఘా అధికారులు ఈ నివేదికలోని ఆరోపణలను బలపరచినట్లు కూడా కొన్ని సంస్థలు పేర్కొన్నాయి. 
 
ఆ నివేదికలో ఏముంది?
డొనాల్డ్ ట్రంప్ 2013లో మాస్కో (రష్యా రాజధాని)లోని ఒక లగ్జరీ హోటల్లో బస చేసినపుడు.. పలువురు వేశ్యలతో నెరపిన విపరీత ధోరణి లైంగిక కార్యకలాపాల వీడియా దృశ్యాలు రష్యా వద్ద ఉన్నాయని ఆ నివేదిక చెప్తోంది. ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ ద రష్యన్ ఫెడరేషన్ (ఎఫ్ఎస్బీ) ట్రంప్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి రష్యా అధికారులు ఆయనను ఊరించే ఆఫర్లతో ప్రలోభపెట్టిందని, ఆయనను బ్లాక్‌మెయిల్ చేయడానికి అవసరమైనంత రహస్య సమాచారం సేకరించిందని పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత ఐదేళ్లుగా ట్రంప్‌కు మద్దతిస్తూ, సాయం చేస్తూ తీర్చిదిద్దుతున్నారని కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచార సూత్రధారులు, రష్యా ప్రభుత్వ రహస్య ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, ట్రంప్‌కు సంబంధించిన చీకటి రహస్యాలు తమ ఉద్ద ఉన్న విషయాన్ని రష్యా గూఢచారులు ఆయనకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ.. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆద్యంతం ఆయన ఎలా వ్యవహరించాలో చెబుతూ నడిపించారు. 
 
ఈ నివేదిక ఎక్కడిది?
బ్రిటిష్ గూఢచార సంస్థ ఎంఐ-6కు చెందిన మాజీ ఉన్నతాధికారి ఒకరు ఈ నివేదికను రూపొందించారని, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన ఇతర అభ్యర్థులు.. ప్రత్యర్థి అభ్యర్థి ట్రంప్ మీద రాజకీయ పరిశోధన నిర్వహించేందుకు సదరు అధికారిని గత ఏడాది మధ్యలో నియోగించారని సీఎన్ఎన్ తాజా కథనం వివరించింది. సదరు అధికారి తన పరిశోధనలో వెల్లడైన అంశాలతో ఈ నివేదికను రూపొందించినట్లు చెబుతున్నారు. 
 
ఎప్పుడు బయటకొచ్చింది?
నిజానికి.. ట్రంప్‌కు సంబంధించిన అసభ్య సమాచారం రష్యా చేతుల్లో ఉందన్న వదంతలు ఎన్నికలకు ముందు నుంచే వినిపిస్తున్నాయి. ‘‘డోనాల్డ్ ట్రంప్, ఆయన ఉన్నతస్థాయి సలహాదారులకు – రష్యా ప్రభుత్వానికి మధ్య సన్నిహిత సంబంధాలు, సహకారానికి సంబంధించి మీ వద్ద విస్ఫోటకదాయక సమాచారం ఉందని స్పష్టమైంది. ఈ సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది’’ అంటూ.. సెనేట్లో డెమొక్రటిక్ నేత హారీ రీడ్ ఎన్నికలకు వారం రోజుల ముందు ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమేకి ఒక లేఖ రాశారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం.. అమెరికాలోని అగ్రస్థాయి నిఘా అధికారులు, మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకుల చేతుల్లో గత కొన్ని నెలలుగా ట్రంప్ – రష్యా వ్యవహారాలపై నివేదిక తిరుగుతోంది. సదరు నివేదిక గత ఏడాది అక్టోబర్ చివర్లోనే మీడియాకు లీకైనప్పటికీ.. బజ్ఫీడ్ అనే ఆన్‌లైన్ వార్తల వెబ్‌సైట్ మంగళవారం వీటిని బహిర్గతం చేసింది. ట్రంప్ పలువురు వేశ్యలతో కలిసి విపరీత లైంగిక కార్యకలాపాలు నెరపిన వీడియో ఒకటి రష్యా ప్రభుత్వం వద్ద ఉన్నట్లు చెబుతున్న 36 పేజీల నివేదికను ఆన్‌లైన్‌లో ప్రచురించింది. 
 
అమెరికా నిఘా సంస్థలు ఏమంటున్నాయి?
గత ఏడాది నవంబర్ 8వ తేదీ నాటి అధ్యక్ష ఎన్నికలకు రెండు నెలల కన్నా ముందే.. ఆగస్టులోనే ఎఫ్బీఐకి ఈ నివేదిక సమాచారం అందించినట్లు చెబుతున్నారు. అప్పటి నుంచీ అమెరికా నిఘా సంస్థలు మాజీ బ్రిటిష్ గూఢచార అధికారిని, అతడి సమాచార సంబంధాలను తనిఖీ చేశాయని, తమకు అందిన సమాచారంలో కొంత నిజం ఉందని కనుగొన్నాయని సమాచారం. దీంతో.. నివేదిక సారాంశాన్ని అమెరికా నిఘా సంస్థల అధిపతులు గత శుక్రవారం నాడు రెండు పేజీల్లో ఒబామాకు, ట్రంప్‌కు అందజేసినట్లు ఏఎఫ్పీ, న్యూయార్క్ టైమ్స్ తదితర మీడియా సంస్థలు బుదవారం కథనం ప్రచురించాయి. ఎఫ్బీఐ అధిపతి జేమ్స్ కోమేతో పాటు డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీల అధిపతులు ట్రంప్‌ను కలిసిన వారిలో ఉన్నారు. అలాగే.. అమెరికా నిఘా సంస్థలు ఈ సమాచారంపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఎన్ఎన్ పేర్కొంది. అయితే.. దీనిని నిర్ధారించడానికి లేదా తిరస్కరించడానికి ఎఫ్బీఐ అధిపతి కోమే మంగళవారం నిరాకరించారు. 
 
నివేదికపై ట్రంప్ ఏమన్నారు?
ట్రంప్ ఈ ఆరోపణలను నేరుగా ప్రస్తావించకుండా.. అదంతా బూటకపు వార్త అని, తనపై రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని బుధవారం ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలు, కథనం అంతా బూటకమని, కల్పితమని గేట్వేపండిట్.కామ్ వంటి మితవాద మీడియా సంస్థలు కొట్టేస్తున్నాయి. ‘‘ఇది దిగ్భ్రాంతికరం. ఏదీ నిర్థారణ కాలేదు. వారంతా పేరు లేని రహస్య వర్గాలు’’ అని ట్రంప్ సీనియర్ సహాయకురాలు కెల్లీయాన్నే కన్వే ఎన్బీసీ చానల్‌తో పేర్కొన్నారు. 
 
డెమొక్రాట్ల స్పందన ఏమిటి?
ఈ పరిణామాలతో డెమొక్రాట్ నేతలు సైతం ఖంగుతిన్నారు. ట్రంప్ స్వాతంత్ర్యం రష్యా దగ్గర తాకట్టు పెట్టిన ఆరోపణలు నిజమే అయితే అది దిగ్భ్రాంతికరమైన విషయమని డెమొక్రటిక్ సెనేటర్ క్రిస్ కూన్స్ సీఎన్ఎన్‌ వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు. ఆ ఆరోపణలు అవాస్తవమైతే వాటిని ఖండించాలని, ఒకవేళ అవే నిజమైతే ట్రంప్ అధ్యక్షుడు కారాదని డెమొక్రాట్ ప్రతినిధి జారెడ్ పోలిస్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement