ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!
- 10వేల మంది శరణార్థులను నియమించుకుంటాం
-
స్టార్‌బక్స్ సీఈవో ప్రకటన
ముస్లిం మెజారిటీ దేశాల నుంచి శరణార్థుల రాకను నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన ఉత్తర్వులను ఆ దేశ కార్పొరేట్ దిగ్గజాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో రానున్న ఐదేళ్లలో 75 దేశాల్లో 10వేలమంది శరణార్థులను తమ ఉద్యోగులుగా నియమించుకోవాలనుకుంటున్నామని స్టార్‌బక్స్ కంపెనీ సీఈవో హోవర్డ్ షుల్ట్జ్ ప్రకటించారు. అమెరికాకు రాకుండా శరణార్థులపై ట్రంప్ నాలుగు నెలల తాత్కాలిక నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. అలాగే సిరియాతోసహా ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి పర్యాటకుల రాకను ఆయన పూర్తిగా నిషేధించారు. ఉగ్రవాద దాడుల నుంచి అమెరికాను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయంపై ఇంటా, బయటా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
ట్రంప్ నిర్ణయం వల్ల ప్రభావం పడే కార్మికులకు అండగా ఉండేందుకు పూర్తిగా కృషి చేస్తామని షుల్ట్జ్ ఆదివారం తన కంపెనీ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. వివిధ దేశాల్లో అమెరికా ఆర్మీ అభ్యర్థన మేరకు భద్రతా దళాలకు దుబాసీలుగా, సహాయక సిబ్బందిగా సేవలు అందించిన వ్యక్తులకు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమిస్తానని ఆయన తెలిపారు. ఒబామా హెల్త్ కేర్ ప్రజాబీమా పథకాన్ని ట్రంప్ ఎత్తివేసిన నేపథ్యంలో కంపెనీ ఉద్యోగులకు తామే ఆరోగ్యబీమా అందిస్తామని షూల్ట్జ్ స్పష్టం చేశారు. షూల్ట్జ్ గతంలోనూ పలు అంశాలపై గట్టిగా గళమెత్తి పతాక శీర్షికలకు ఎక్కారు. దుకాణాలకు తుపాకులు తీసుకొని రావొద్దని, జాతుల మధ్య సంఘర్షణ గురించి చర్చించాలని ఆయన గతంలో పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి
(ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్)
(ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు)
(ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!)
(అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి)
ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?
ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!
వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా
'ట్రంప్‌తో భయమొద్దు.. మేమున్నాం'