ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!
అమెరికాలోకి ముస్లింల రాకను నిషేధిస్తూ తాను జారీచేసిన ఆదేశాలపై దేశమంతటా ఆందోళనలు వెల్లువెత్తడంతో.. తన స్వరాన్ని కాస్తా మారుస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. 'స్పష్టంగా చెప్పాలంటే.. ఇది ముస్లింలపై నిషేధం కాదు. మీడియా అసత్యాలను ప్రచారం చేస్తోంది. ఇది మతానికి సంబంధించిన అంశం కాదు. ఇది ఉగ్రవాదం, దేశ భద్రతకు సంబంధించిన అంశం' అని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. సిరియా నుంచి శరణార్థుల రాకను నిలిపేస్తూ, ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి ప్రజల రాక నిషేధిస్తూ ట్రంప్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ట్రంప్ తాజా ప్రకటనలో ఉన్న ప్రతి పదం, పంక్తి కూడా పచ్చి అబద్ధమేనని అమెరికా మీడియా తెగేసి చెప్పింది. ట్రంప్ ప్రకటనను ఏకీపారేస్తూ సీఎన్‌ఎన్ ఓ కథనం ప్రచురించింది.
ఇది ముస్లింలపై నిషేధమే..: ఈ విషయాన్ని ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ రూడీ గిలియానీ అంగీకరించారు కూడా. 'మీకు నేను పూర్తి కథను చెప్తాను. ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించేటప్పుడు ఇది ముస్లింలపై నిషేధమని చెప్పారు. ఆయన నాకు ఫోన్ చేసి.. కమిషన్‌ను ఏర్పాటుచేయండి. దీనిని చట్టబద్ధంగా అమలు చేసేందుకు నాకు మార్గాన్ని చూపండి అని కోరారు' అని రూడీ వెల్లడించారు.
ఇది మతానికి సంబంధించిన అంశమే: క్రిష్టియన్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ ట్రంప్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. నిషేధించిన దేశాల నుంచి అమెరికాలోకి క్రైస్తవుల రాకను అనుమతిస్తామని, కానీ ముస్లింలను రానివ్వబోమని ఆయన తేల్చిచెప్పారు. ప్రస్తుతమున్న అమెరికా శరణార్థి పథకం ప్రకారం 'ముస్లింలను మాత్రమే రానిస్తున్నారు. క్తైస్తవులకు అసాధ్యంగా మారింది' అని ట్రంప్ అన్నారు. కానీ ఇది కూడా అబద్ధమే. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం 2016లో అమెరికాకు 37,521 మంది క్రైస్తవులు రాగా, 38,901 మంది ముస్లింలు వచ్చారు.
ఇది ఉగ్రవాదానికి సంబంధించినది కాదు: ఇది ఉగ్రవాదానికి సంబంధించిన అంశమని ట్రంప్ చెప్తున్నారు. కానీ గడిచిన 15 ఏళ్లలో 7 లక్షల 84 వేలమంది శరణార్థులు అమెరికాలో స్థిరపడగా.. అందులో ముగ్గురు మాత్రమే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి అరెస్టు అయ్యారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 1975 నుంచి 2016 వరకు 32,52,493 మంది శరణార్థులు అమెరికాలో ఆశ్రయం పొందగా.. అందులో 20మంది మాత్రమే ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగం పంచుకున్నారు. ఆ 20 మందిలో ముగ్గురు మాత్రమే విజయవంతమై.. జరిపిన ఉగ్రవాద దాడిలో ముగ్గురు చనిపోయారు.
ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం కాదు: 1975 నుంచి 2016 వరకు అమెరికా గడ్డపై నిషేధానికి గురైన ఈ ఏడు దేశాల పౌరుల చేతిలో ఒక్క అమెరికన్ కూడా చనిపోలేదు. కానీ, ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థపై పోరాటంలో అమెరికాకు అత్యంత కీలక మిత్రదేశంగా ఉన్న ఇరాక్‌పై కూడా నిషేధం విధించారు. దీంతో ఆ దేశం ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికన్లను ఇరాక్‌లో అడుగుపెట్టనివ్వబోమని తెగేసి చెప్పింది. దీంతో ఇస్లామిక్ స్టేట్ పై అమెరికా తలపెట్టిన యుద్ధం గొప్ప ప్రమాదంలో పడింది. ఐఎస్‌ఐఎస్‌కు వ్యతిరేకంగా బలంగా పోరాడుతున్న ఇరాకీలను ఇలా ఏకాకులను చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని అమెరికా కౌంటర్ టెర్రరిజం మాజీ అధికారి డానియెల్ బెంజమిన్ విస్మయం వ్యక్తం చేశారు. స్పష్టంగా చెప్పాలంటే.. ఇది ముస్లింలపై నిషేధమే. మతానికి సంబంధించిన అంశమే. ఇది ఉగ్రవాదానికి, దేశ భద్రతకు సంబంధించిన అంశం కానేకాదని సీఎన్‌ఎన్ పేర్కొంది.