రజనీకి తమిళ సెగ.. ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత!
చెన్నై: తాను తమిళుడినేనంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ప్రకటన తమిళనాట ప్రకంపనలు రేపుతోంది. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానంటూ ఆయన బలమైన సంకేతాలు ఇవ్వడంతో తమిళ సంఘాలు భగ్గుమంటున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావొదని నినదిస్తూ ఆందోళనకు దిగాయి. తమిళ సంఘాలు, తమిళ భాషా, సాంస్కృతికవాదులు ప్రధానంగా రజనీకాంత్ స్థానికత అంశాన్ని లేవనెత్తుతున్నారు. మరాఠా మూలాలు ఉన్న రజనీ ప్రారంభంలో కొన్నాళ్లు కర్ణాటకలో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన తమిళుడు కాదని, ఆయనను తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టనివ్వబోమంటూ తమిళ సంఘాలు ఆందోళనబాట పట్టాయి. సోమవారం చెన్నైలోని రజనీకాంత్ ఇంటివద్ద పెద్దసంఖ్యలో తమిళ సంఘాల కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. తలైవా తమిళుడు కాదంటూ నినదించారు. దీంతో రజనీ ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రజనీ ఇంటికి నిరసన సెగలు తగులుతుండటంతో పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కూడా రజనీ రాజకీయ ఆగమానానికి వ్యతిరేకంగా నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. కోయంబత్తూరులో తమిళ సంఘాలు ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు.