వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి

Alla nani Xomments On Covid Vaccination - Sakshi

మంత్రి ఆళ్ల నాని సమీక్ష

 సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. కోవిడ్‌ నిబంధనలు పాటించాలని, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. టీకా ప్రక్రియను వేగవంతం చేయడానికి గ్రామ సచివాలయాలను యూనిట్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్నవారికి సత్వరమే వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలన్నారు. 

45 ఏళ్లు దాటిన వారికి వెంటనే టీకా 
45 ఏళ్ల వయసు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వెంటనే టీకా వేయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. పూర్తి స్థాయిలో నూటికి నూరు శాతం ఆరీ్టపీసీఆర్‌ టెస్టులు చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఈ నెల 18 వరకు 13,80,537 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల భర్తీపై దృష్టి సారించాలని సూచించారు. అన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం మెరుగ్గా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో.. ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌కుమార్‌ సింఘాల్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ (కోవిడ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవో డాక్టర్‌ మల్లికార్జున, ప్రజారోగ్య శాఖ సంచాలకురాలు డాక్టర్‌ గీతా ప్రసాదిని, ఏపీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ రామకృష్ణారావు, డీఎంఈ డా.రాఘవేంద్రరావు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top