మేము అమలు చేస్తున్నవి కేవలం ఉచిత పథకాలు కాదు. ఇదంతా మానవ వనరుల మీద పెడుతున్న పెట్టుబడిగా మేం భావిస్తున్నాం. మానవ వనరుల నైపుణ్యాభివృద్ధిగానే చూస్తున్నాం. ప్రభుత్వం అలా ఆలోచించకపోతే ప్రగతి సాధించలేం. మా విద్యార్థులు సొంత కాళ్ల మీద నిలబడి, ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవసరమైన వనరులను సమకూరుస్తున్నాం. అందుకోసం విద్యా ప్రమాణాలు పెంపొందిస్తున్నాం. అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేస్తున్నాం.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘పరిశ్రమలు నెలకొల్పడానికి అన్ని విధాలా అనువైన వాతావరణం, వనరులు మన రాష్ట్రంలో ఉన్నాయి. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం, నిరంతరాయమైన విద్యుత్ సరఫరా, కొత్తగా ఏర్పాటవుతున్న 4 పోర్టులు, నాణ్యమైన వనరులు.. ఇవన్నీ పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన అంశాలు. పోర్టు ఆధారిత పరిశ్రమలకు రాష్ట్రం అత్యంత ఆకర్షణీయం. ఇక్కడ గ్రీన్ ఎనర్జీ రంగంలో అపార అవకాశాలున్నాయి. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్‌లు రాబోతుంటే... అందులో మూడు మన రాష్ట్రంలోనే వస్తున్నాయి.
మూడు పారిశ్రామిక కారిడార్‌లున్న ఏకైక రాష్ట్రం కూడా మనదే’ అని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే ‘గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్’ నేపథ్యంలో బుధవారం ఆయన కొందరు జాతీయ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
► పెట్టుబడికి ఉన్న అవకాశాలను, పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలను పారిశ్రామికవేత్తలకు వివరించడం ద్వారా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం సదస్సు లక్ష్యం. పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత సానుకూల వాతావరణం రాష్ట్రంలో ఉంది. ప్రభుత్వం తొలి నుంచీ స్నేహపూర్వక పారిశ్రామిక విధానంతో ముందుకు వెళుతోంది. ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమలు నెలకొల్పాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు, ప్రోత్సహకాలు ఇవ్వటం సహజం. ప్రభుత్వం నుంచి అందే సహకారం, రాయితీలు, ప్రోత్సహకాలు, రాష్ట్రంలో ఉన్న అనువైన వాతావరణం, వనరులను పారిశ్రామివేత్తలు చూస్తారు. రాష్ట్రంలో ఇవన్నీ ఉన్నాయి. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరం పరిశ్రమలకు అనుకూలం.
► రాష్ట్రంలో 48 రకాల ఖనిజాలు లభ్యమవుతాయి. ఇది ఖనిజాధారిత పరిశ్రమలకు ఎంతో అనుకూలం. సిమెంట్, లైమ్‌స్టోన్ పరిశ్రమలు నెలకొల్పడానికి మన వద్ద ఎంతో అనుకూల పరిస్థితులున్నాయి.
( ఫైల్ ఫోటో )
► 6 పోర్టులున్నాయి. కొత్తగా 4 పోర్టులు నిర్మిస్తున్నాం. అందులో 3 పోర్టులను ప్రభుత్వమే సొంత నిధులతో నిర్మిస్తోంది. పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అత్యంత అనుకూలం. పోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. పోర్టు రవాణా కారణంగా రాష్ట్రంలో తయారయ్యే వస్తువుల ఎగుమతికి తక్కువ ఖర్చవుతుంది.
► కర్భన ఉద్గారాలను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు మేలు చేసే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, పంప్డ్ స్టోరేజ్... గ్రీన్ ఎనర్జీదే భవిష్యత్ అంతా. ఈ రంగంలో పెట్టుబడులకు రాష్ట్రంలో మంచి అవకాశాలున్నాయి. వీటివల్ల చౌకగా విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. రెన్యువబుల్, గ్రీన్ ఎనర్జీకి ఏపీలో పుష్కలమైన వనరులున్నాయి. విండ్, హైడ్రోజన్, సోలార్ విద్యుదుత్పత్తికి ఇక్కడ అపార అవకాశాలున్నాయి. 82 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ, 34 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లకు అవకాశం ఉంది. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది.
► పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలు తీసుకుని, వాటి ప్రకారం ప్రో యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నాం. అందుకే ఈ రాష్ట్రంవైపు ఎప్పుడూ చూడని అంబానీ, బిర్లా, అదానీ, బంగూర్, బజాంకా, దాల్మియా.. వంటి వారు ఇప్పుడు రాష్టంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. గతంలో ఇంతమంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చింది లేదు.
► 2021–22లో 11.43 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. పలురంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ... సులభతర వాణిజ్య విధానాల్లో (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) వరుసగా మూడేళ్లు నెంబర్ వన్‌గా నిలిచింది.
( ఫైల్ ఫోటో )
మూడు రంగాల్లో విప్లవాత్మకమైనమార్పులు
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వ తప్పులను కొన్నింటిని సరిచేస్తుంది, కొన్ని కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, వ్యవసాయం.. ఈ రంగాల్లో పూర్తి స్థాయిలో విప్లవాత్మక చర్యలు చేపట్టాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ‘నాడు–నేడు’ పేరిట ప్రభుత్వాసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నాం. ప్రాథమిక విద్యా రంగంలో ‘అమ్మ ఒడి’ పథకం ఓ విప్లవం. మేము అధికారంలోకి వచ్చేనాటికి ప్రాథమిక విద్య ప్రమాణాల్లో ఆంధ్ర ప్రదేశ్ దేశంలో చివరి రెండు, మూడు స్థానాల్లో ఉండేది.
ఈ పరిస్థితి మార్చాలనుకున్నాం. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు మేం అమలు చేస్తున్న పథకాలు చెబుతా. అమ్మ ఒడి పథకం కింద పిల్లల్ని బడికి పంపే తల్లుల ఖాతాలో రూ.15వేలు వేస్తున్నాం. దీనికి కనీసం 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన పెట్టాం. ఇంటర్మీడియట్ వరకు అమ్మ ఒడి పథకం ఇస్తున్నాం. తరవాత జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు అందిస్తున్నాం. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుండటంతో పిల్లల చదువు ఎందుకు ఆపాలని తల్లిదండ్రులు భావిస్తారు కదా?. ఇక ఏటా స్కూళ్లు తెరవటానికి ముందే జగనన్న విద్యా కానుక పేరిట సమగ్ర కిట్‌ను ఇస్తున్నాం.
తెలుగు, ఇంగ్లీష్ బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, స్కూల్ బ్యాగ్, షూ, సాక్సులు, యూనిఫామ్ ఇస్తూ యూనిఫామ్‌కు కుట్టేందుకు మజూరీ చార్జీలూ ఇస్తున్నాం. దీనికి ఏటా రూ.వేయి కోట్లకుపైగా నిధులు వెచ్చిస్తున్నాం. ఇక మధ్యాహ్న భోజన పథకాన్ని పూర్తిగా మార్చాం. టీడీపీ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకానికి రూ.600 కోట్ల బడ్జెట్ ఉండేది. దాన్ని రూ.1,908కోట్లకు పెంచాం. జగనన్న గోరుముద్ద పేరుతో భోజనం నాణ్యత పెంచాం. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం.
ఆరో తరగతి నుంచి డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. నాడు–నేడు మొదటి దశ కింద 15,275 పాఠశాలలను ఎంపిక చేసి వాటి రూపు రేఖలను సమూలంగా మార్చాం. రాష్ట్రంలో 30,230 తరగతుల డిజిటలైజేషన్‌ను ఈ జూన్ నాటికి పూర్తి చేస్తున్నాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. ఇప్పటివరకు 60వేల మంది ఉపాధ్యాయులకు, 4.70 లక్షల మంది విద్యార్థులకు మొత్తం 5.30 లక్షల ట్యాబ్‌లు పంపిణీ చేశాం.
అంతేకాదు! అంగన్‌వాడీ కేంద్రాలకు నిధులు పెంచాం. గతంలో అంగన్‌వాడీ కేంద్రాలకు ఏడాదికి రూ.800కోట్లు కేటాయించేవారు. దీన్ని రూ.1,800 కోట్లకు పెంచాం. జగనన్న సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ్ ప్లస్ పేరిట అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహర నాణ్యతను మెరుగుపరిచాం. ఎందుకంటే ఆరేళ్ల వరకే పిల్లలు శారీరకంగా, మానసికంగా వేగంగా ఎదుగుతారు.
ఆ సమయంలో వారికి సరైన పోషకాహారం అందించాలి. అదే చేస్తున్నాం. ఆడపిల్లల పెళ్లికి సహకరిస్తూ... వారు చదువు కొనసాగించేలా నిబంధనలు పెట్టాం. 10వ తరగతి పాస్ అవ్వాలని, 18 ఏళ్లు నిండాలని నిబంధన పెట్టడం వల్ల వారు పది తరవాత ఇంటర్ చదువుతారు. డిగ్రీలోనూ చేరతారు. చేరారు కనక పూర్తి చేస్తారు. ఈ ఉద్దేశంతోనే వివాహానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నాం.
చదువుల్లో రాణిస్తూ విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ‘విదేశీ దీవెన’ పథకాన్ని అందిస్తున్నాం. నిర్దేశిత 21 ఫ్యాకల్టీల్లో ప్రపంచంలోని టాప్–50 యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించే మన విద్యార్థులకు గరిష్ఠంగా రూ.1.25 కోట్ల వరకూ ఫీజును చెల్లిస్తున్నాం. గత ఏడాది 200మందికి స్పాన్సర్‌షిప్ అందించాం. ఇలాంటి వర్సిటీల్లో చదివిన వాళ్లంతా వచ్చే పదేళ్లలో అత్యున్నత స్థాయికి చేరుకుని, మన రాష్ట్రానికి ఆస్తిగా మారతారన్న విశ్వాసం నాకుంది.
► ప్రభుత్వాసుపత్రులకు కాయకల్ప చికిత్స చేస్తున్నాం. ఎవ్వరూ ఊహించని విధంగా వైద్య రంగంలో ఖాళీగా ఉన్న 48,000 పోస్టులను భర్తీ చేశాం. ప్రతి హాస్పిటల్‌లో డాక్టర్, నర్సులు ఉండేలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. జాతీయస్థాయి ప్రమాణాలు ఉండేలా హాస్పిటల్స్‌ను ఆధునీకరించాం. 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే చికిత్సల సంఖ్యను 1,059 నుంచి ఏకంగా 3,255కు పెంచాం. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ హెల్త్ క్లినిక్, హెల్త్‌కార్డుల డిజిటలైజేషన్ ఇలా అనేక సంస్కరణలు తెచ్చాం.
వ్యవసాయ రంగానికి వస్తే... రైతు భరోసా కేంద్రంపేరిట రైతులకు సంబంధించిన సేవలన్నీ ఒకేచోట అందిస్తున్నాం. ప్రతి గ్రామానికీ వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ పొందిన అధికారిని నియమించడమే కాకుండా ప్రతి రైతు తాలూకు పంట వివరాలను ‘ఈ క్రాప్’లో నమోదు చేస్తున్నాం. రైతులకు విత్తనం దగ్గర నుంచి పంట అమ్ముకోవడం వరకూ ఆర్‌బీకే ద్వారా చేయూత అందిస్తున్నాం.
పాలన సంస్కరణల్లో భాగంగా.... ప్రతి 2000 జనాభాకు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి 50 మంది జనాభాకూ ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేశాం. ఎటువంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. దేశంలో డీబీటీ ద్వారా నేరుగా నగదు అందుకుంటున్న లబ్ధిదారులు రాష్ట్రంలోనే అధికం. మాకు ఓటు వేశారా లేదా, ఏ పార్టీ అనేది చూడకుండా పథకాలు అందిస్తున్నాం.
ఎస్‌డీజీ లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు
ఉచిత పథకాలు అంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి చేయకుండా కేవలం సంక్షేమ పథకాలే ఇస్తున్నామనుకుంటే దేశంలోనే అత్యధికంగా 11.43 శాతం వృద్ధిని ఎలా సాధిస్తాం? అన్ని రంగాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నాం. ప్రతి పథకాన్నీ ఎస్‌డీజీ లక్ష్యాలకు అనుగుణంగా డీబీటీ రూపంలో నేరుగా లబ్ధిదారులకే అందిస్తున్నాం. ఉదాహరణకు జీఈఆర్ గణాంకాలు చూస్తే కాలేజీల్లో చేరే వారి సంఖ్య రాష్ట్రంలో ఎక్కువ. 18 నుంచి 23 ఏళ్ల వయస్సులో ఉన్నవారు చదువు మానకుండా కాలేజీలో చేరేలా పర్యవేక్షిస్తున్నాం.
విద్యార్థి డిగ్రీ పూర్తి చేస్తే అతని హోదా మారుతుంది. అందుకే తల్లిదండ్రులకు విద్య భారం కాకుండా ఉండేలా 100 శాతం ఫీజు రీఇంబర్స్‌మెంట్ ఇస్తూ విద్యాదీవెన, వసతిదీవెన, ప్రాధమిక విద్యలో అమ్మఒడి వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఈ మొత్తం నేరుగా కళాశాలలకు ఇవ్వకుండా తల్లుల ఖాతాల్లో వేస్తున్నాం. దీనివల్ల ఆ విద్యార్థి చదువు మధ్యలో ఆగదు. పట్టభద్రుడై ఆదాయాన్ని ఆర్జించడం ద్వారా పేదరికం నుంచి మధ్యతరగతి హోదాలోకి ఆ కుటుంబం మారుతుంది. దేశాభివృద్ధిలో ఇది ఎంతో కీలకమైన అంశం.
బడ్జెట్ పరిమితుల్లోనే... పారదర్శకంగా...
ఈ పథకాలన్నీ కూడా బడ్జెట్ పరిమితుల్లోనే అమలు చేస్తున్నాం. సాధారణంగా రాజకీయ నేతలు సామాన్యులకు అర్థం కాని రీతిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. గతంలో కూడా ఇదే బడ్జెట్ ఉండేది. ఆ నిధులు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ అర్థమయ్యేది కాదు. లబ్ధిదారులెవరో ఆ దేవుడికే తెలియాలి అనే పరిస్థితి ఉండేది. కానీ రాష్ట్రంలో తొలిసారిగా మేము అందరికీ సరళంగా అర్థమయ్యేలా పారదర్శకంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం. ప్రతి పథకాన్నీ బడ్జెట్‌లో కచ్చితంగా నిర్దేశించాం. ప్రతి పథకాన్ని లబ్ధిదారుల ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానించాం. నేరుగా నగదు బదిలీ విధానంలో పథకాన్ని అమలు చేస్తున్నాం.
– ఏ రాష్ట్రానికైనా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అందుకే కేంద్రంలోని బీజేపీతో మేము స్నేహ పూర్వక వాతావరణమే కోరుకుంటున్నాం. మాకు రాజకీయాల కంటే మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ప్రజలకు ఏం కావాలో అది చేయాలనేది మా ప్రభుత్వ విధానం. అందుకే మా ప్రభుత్వం రియాలిటీలో పేదలకు ఏం కావాలో అదే చేస్తోంది. అందుకే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో వేగంగా ముందుకెళ్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment