Summer alert : నిప్పుతో జాగ్రత్త..!

కన్నెపెల్లి మండలం మెట్‌పెల్లిలో షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైన మోర్ల భీమయ్య ఇల్లు (ఫైల్‌) - Sakshi

ఎండా కాలం.. సులభంగా మండే కాలం

నిప్పుతో జాగ్రత్త, ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి

అప్రమత్తతతో అగ్ని ప్రమాదం నివారించే అవకాశం

చిన్న తప్పిదాలతోనే అగ్ని ప్రమాదాలు

మంచిర్యాల క్రైం: చిన్నచిన్న తప్పిదాలతోనే నిత్యం ఏదో ఒకచోట అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో ఆస్తి, ప్రాణనస్టం జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు. పట్టణాల్లో జరిగే 70 శాతం అగ్ని ప్రమాదాలు విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్లే జరుగుతున్నాయి. దీనికి కారణం నాసిరకం విద్యుత్‌ తీగలు వాడడమే. తక్కువ ధరకు కొనుగోలు చేసిన తీగలతో ఓవర్‌ లోడ్‌ విద్యుత్‌ సరఫరా జరిగినప్పుడు షార్ట్‌సర్క్యూట్‌ ఏర్పడుతోంది. తీగలు తెగినప్పుడు అతుకులు వేయడంతో ఓవర్‌లోడ్‌ విద్యుత్‌ సరఫర అయినప్పుడు ఆప్రాంతంలో వేడికి కరిగిపోయి షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి మంటలు చెలరేగే అవకాశం ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఇలా....

వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లమధ్యలో గడ్డివాములు, పత్తి కట్టెలు వేయడం వలన అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇవి ఇళ్ల మధ్యనే వేయడం ప్రమాదకరమన్న విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదు. ఎండల తీవ్రతకు గడ్డివాములకు తొందరగా నిప్పంటుకునే అవకాశం ఉంది. పల్లెల్లో ఇంటి ఆవరణలోనే కట్టెల పొయ్యి వెలిగిస్తుంటారు. దీంతో నిప్పురవ్వలు ఎగిసి గడ్డివాములపై పడి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఎవరైనా బీడీలు, సిగరెట్లు తాగి అక్కడే పడేసినా ప్రమాదమే. అందుకే గడ్డివాములు ఊరికి దూరంగా ఏర్పాటు చేసుకుంటే మంచిది.

పత్తి నిల్వలు పదిలం...

పత్తి కట్టెలకు, నిలువ ఉన్న పత్తికి మంటలు తేలికగా అంటుకునే స్వభావం ఉంటుంది. పత్తి నిల్వచేసిన ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా లేకుండా చూడాలి. జిన్నింగ్‌ పరిశ్రమల్లో పత్తి కుప్పలు(గంజి) మధ్య రెండు నుంచి మూడు మీటర్ల మధ్య దూరం ఉంచాలి. ఒకవేళ ప్రమాదం జరిగినా ఒకే కుప్ప కాలిపోతుంది. దీంతో నష్టం తక్కువ వస్తుంది. కానీ ఈ నిబంధనలు ఎవరు పాటించడం లేదు.

అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు

పరిశ్రమలు, అపార్టుమెంటు, వాణిజ్యపరమైన స్థలాలు, హోటళ్లు, బార్లు, సినిమా థియేటర్లు, కల్యాణ మండపాలు, తదితర ప్రదేశాల్లో అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉంచుకోవాలి.

ఇంట్లో ఇసుక బకెట్లు ఉంచితే గ్యాస్‌ లికేజీ ఏర్పడినప్పుడు మంటలు ఆర్పేందుకు నీళ్లతో పాటు ఇసుక కూడా వాడొచ్చు.

పెట్రోల్‌, డీజిల్‌, ఆయిల్‌, గ్రీజ్‌ తదితర చమురు పదార్థాలు కాలుతున్నప్పుడు నీళ్లు పోయకూడదు. అల్యూమినియం, సల్ఫేట్‌, సోడియం బైకార్బోనైట్‌ మిశ్రమం గల నురుగు గల పరికరాన్ని ఉపయోగించాలి.

విద్యుత్‌తో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కార్బన్‌ డయాకై ్సడ్‌ గ్యాస్‌ పరికరాన్ని వాడాలి. నీళ్లు ఉపయోగిస్తే షాక్‌ వస్తుంది.

వంటగదికి కిటికీలు, వెంటిలేటర్లు ఉంటే గా ్యస్‌ లీకేజీ ఏర్పడినా బయటకు వెళ్లిపోతుంది. వంటగదిలో దేవుళ్ల ఫొటోలు ఉంచకూడదు.

జిల్లాలో ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదాలు

సీసీసీ నస్పూర్‌లో ఈ నెల 2న రాజా ఎలక్ట్రానిక్స్‌ షాపులో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగింది.

గతేడాది డిసెంబర్‌ 22న కన్నెపెల్లి మండలం మెట్‌పల్లిలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మోర్ల భీమయ్య పూరిగుడిసె దగ్ధమైంది. పత్తి, వరి పంట విక్రయించగా వచ్చిన రూ.8 లక్షల 80వేల నగదు, 11తులాల బంగారం, 78 తులాల వెండి కాలి పోయింది.

నిర్లక్ష్యం వల్లే..

చిన్నపాటి నిర్లక్ష్యంవల్లే అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతీ శుక్రవారం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు.

– అజయ్‌బాబు, జిల్లా ఫైర్‌ అధికారి, మంచిర్యాల

Election 2024

Read latest Mancherial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top