● అనుమతి లేకుండానే ఏర్పాటు ● అర్హత లేనివారితో వైద్యం ● వైద్యులు లేకున్నా.. ఉన్నట్లు చూపుతున్న వైనం.. ● టీఎస్‌ఎంసీ తనిఖీల్లో వెలుగులోకి.. | Sakshi
Sakshi News home page

● అనుమతి లేకుండానే ఏర్పాటు ● అర్హత లేనివారితో వైద్యం ● వైద్యులు లేకున్నా.. ఉన్నట్లు చూపుతున్న వైనం.. ● టీఎస్‌ఎంసీ తనిఖీల్లో వెలుగులోకి..

Published Mon, Apr 8 2024 1:10 AM

- - Sakshi

పట్టింపులేని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ

ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణపై వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ 2022లో జిల్లా వ్యాప్తంగా ఉన్న 228 ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేసి, అనుమతులు లేని 19 ఆస్పత్రులు, నర్సింగ్‌ హోంలు, క్లినిక్‌, ల్యాబ్‌లను సీజ్‌ చేసింది. వారంతా తర్వాత అనుమతులు పొంది తిరిగి తెరిచారు. ఆ తరువాత తనిఖీలకు బ్రేక్‌ పడింది. 2023 ఫిబ్రవరి నెలలో జిల్లాలో ఎథిక్స్‌ కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) ముగ్గురు వైద్యులను సభ్యులుగా ఎంపిక చేసింది. ఈ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం ఇష్టారాజ్యంగా మారింది. తాజాగా టీఎస్‌ఎంసీ సభ్యుల తనిఖీలతో వాటి బాగోతం బయటపడుతోంది.

మంచిర్యాలటౌన్‌: వైద్యో నారాయణో హరి.. అంటే వైద్యుడు దేవుడితో సమానం అని అర్థం. దేవుడు ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని నిలబెట్టే ప్రత్యక్ష దైవంగా వైద్యుడిని భావిస్తుంటారు. ఇక డాక్టర్‌ అనేది డ్యూటీ కాదు. అది ఒక వృత్తి. డబ్బుతో ముడిపెట్టకుండా సేవా భావంతో నిర్వహించే విధి. కానీ నేటి పరిస్థితులు అలా లేవు. డబ్బు సంపాదన కోసమే డాక్టర్‌ చదువుతున్నారు. వైద్య విద్య పూర్తి కాగానే పెట్టుబడిదారులతో కలిసి ఆస్పత్రి నెలకొల్పుతున్నారు. అనుమతి లేకపోయినా, అర్హులైన వైద్యులు అందుబాటులో లేకున్నా.. ఉన్నట్లుగా ఏమారుస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వైద్య వృత్తికే కలంకం తెస్తున్నారు. అనుమతి, అర్హత లేని వైద్యులు రోగులకు చికిత్స చేస్తున్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మొద్దు నిద్రలో ఉండడం గమనార్హం. తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌(టీఎస్‌ఎంసీ) సభ్యుల తనిఖీలతో జిల్లా కేంద్రంలో ఇలాంటి ఆస్పత్రులు వెలుగులోకి వచ్చాయి. వాటిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వరుస తనిఖీలతో బెంబేలు...

తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌(టీఎస్‌ఎంసీ) నూతన కార్యవర్గం ఇటీవల ఎన్నిక కాగా, ఉమ్మడి జిల్లా నుంచి మెంబర్‌గా, లీగల్‌ అండ్‌ యాంటీ క్వాకరీ మెంబర్‌గా ఎన్నికై న ఎగ్గన శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సభ్యులు నెల రోజులుగా జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేస్తున్నారు. ఆర్‌ఎంపీలుగా చలామణి అవుతూ ఆస్పత్రులను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్న లక్సెట్టిపేటకు చెందిన ఇద్దరిని గుర్తించారు. వారిపై టీఎస్‌ఎంసీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్‌ఎంపీలు కేవలం ప్రథమ చికిత్సను మాత్రమే అందించాల్సి ఉండగా ఇష్టారీతిన యాంటిబయాటిక్స్‌ వాడడం, సైలెన్‌ ఎక్కిస్తూ, అవసరాన్ని బట్టి చిన్నపాటి ఆపరేషన్లు సైతం చేస్తున్నట్లుగా గుర్తించారు.

కరోనా సమయంలో పుట్టగొడుగుల్లా..

కరోనా సమయంలో జిల్లాలో పుట్టగొడుగుల్లా ఆస్పత్రులు వెలిశాయి. డబ్బు సంపాదనే లక్ష్యంగా వ్యాపారులు, వైద్యులు కలిసి కార్పొరేట్‌ను తలదన్నేలా ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. మల్టీ స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ బోర్డులు తగిలించుకుని వైద్యం చేస్తున్నారు. వైద్యులు ఆస్పత్రుల్లో లేకపోయినా విజిటింగ్‌పై రప్పిస్తూ రోగులకు చికిత్స చేయించి డబ్బులు దండుకుంటున్నారు. ఇటీవలి తనిఖీల్లో ఇలాంటి ఆస్పత్రులను కూడా గుర్తించారు. గతంలో పనిచేసి వెళ్లిన వైద్యుల పేర్లు వాడుకుంటూ, ఇతర వైద్యులను రప్పించి, రోగులకు అవసరం లేకపోయినా టెస్టుల పేరిట దోచుకుంటున్నట్లు గుర్తించారు. టీఎస్‌ఎంసీ తనిఖీల్లో బోగస్‌ ఆస్పత్రుల బాగోతం బయటపడుతోంది. దీంతో లక్షల రూపాయల పెట్టుబడితో నెలకొల్పిన ఆస్పత్రులను కాపాడుకునేందుకు ఆయా ఆస్పత్రుల యజమానులు ప్రయత్నాలు చేస్తున్నారు.

టీఎస్‌ఎంసీ నుంచే తనిఖీలు

ఆర్‌ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే అందించాలి. కానీ నేరుగా వైద్యం చేస్తున్నారు. అనుమతులు, అర్హతలు లేకుండా పలువురు ఆస్పత్రుల్లో వైద్యం అందించి రోగుల ప్రాణంతో చెలగాటం ఆడుతున్నారు. దీనిపై ఫిర్యాదులు అందుతున్నాయి. కేవలం కమీషన్ల కోసం కొందరు ఆర్‌ఎంపీలు, వైద్యులు కూడా లేని ఆస్పత్రులకు రోగులను పంపిస్తున్నారు. వైద్యులు లేకున్నా, వారి పేర్లను వాడుకుంటూ, ఇతరులతో వైద్యం చేయిస్తున్నారు. అందుకే టీఎస్‌ఎంసీ తనిఖీలు నిర్వహిస్తోంది.

– డాక్టర్‌ ఎగ్గన శ్రీనివాస్‌,

టీఎస్‌ఎంసీ సభ్యుడు

Advertisement
Advertisement