టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్‌ | CM Jagan Aggressive Comments At Kalyanadurgam | Sakshi
Sakshi News home page

టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్‌

Published Thu, May 9 2024 3:14 PM | Last Updated on Thu, May 9 2024 7:39 PM

CM Jagan Aggressive Comments At Kalyanadurgam

సాక్షి, అనంతపురం: చంద్రబాబుది ఊసరవెళ్లి రాజకీయమని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జతకడతారని ప్రశ్నించారు. మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం బాబు దొంగ ప్రేమ కురిపిస్తున్నాడని మండిపడ్డారు. ఆరునూరైనా ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. 

కల్యాణదుర్గంలో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కళ్యాణదుర్గం సిద్ధమేనా.. టైము రెండు కావస్తోంది. ఎండలు చూస్తే తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా ఏ ఒక్కరూ కూడా ఎండను ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్యే ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలను పంచి పెడుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ,ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి సోదరుడికీ, నా ప్రతి స్నేహితుడికీ ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు.


నాలుగు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం.
కేవలం మరో నాలుగు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతున్న ఎన్నికలు కానేకావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడం. ఇదే చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్ధం.  పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే? పొరపాటున చంద్రబాబు నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతిఒక్కరినీ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను.

 

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్దం చెప్పిన మీ జగన్‌.
దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలలో మీ బిడ్డ ఈ 59 నెలల్లో గత చరిత్రలో ఎప్పుడూ కూడా చూడనివిధంగా ఈరోజు రూ.2.70 లక్షల కోట్లు, మళ్లీ చెబుతున్నాను రూ.2.70 లక్షల కోట్లను నేరుగా బటన్ నొక్కడం, వివిధ పథకాలకు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకే, వారి చేతికే ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా పంపించాడు అని ఈ సందర్భంగా సగర్వంగా చెబుతున్నాను. 

నేను అడుగుతున్నాను.. ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఏం అన్నా గతంలో జరిగిందా? అక్కా ఈ మాదిరిగా జరిగిందా? ఈమాదిరిగా బటన్లు నొక్కడం నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే నేరుగా వెళ్లిపోవడం.. గతంలో ఎప్పుడైనా చూశామా? అని మీబిడ్డ అడుగుతున్నాడు. ఏకంగా 2 లక్షల 31 వేల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు,  గతంలో ఎప్పుడూ జరగనివిధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన వ్యక్తి మీ జగన్‌. ఇలా అర్థం చెప్పిన పాలన కేవలం ఈ 59 నెలలకాలంలోనే జరిగిన మాట వాస్తవం కాదా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 

గతంలో మేనిఫెస్టోలను ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో రిలీజ్ చేసి రంగురంగుల అబద్ధాలు చెప్పి ఆ తర్వాత చెత్తబుట్టలో వేసే సాంప్రదాయాన్ని మొట్టమొదటిసారిగా మార్చింది ఈ 59 నెలలకాలంలోనే కాదా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా.. నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా ప్రతీదీ ఆలోచన చేయమని అడుగుతున్నాను. 

గతంలో జరగనివిధంగా నాడు-నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్లు, గవర్నమెంట్ బడులల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూములో కూడా డిజిటల్ బోధన, 8వ తరగతి నుంచి ప్రతి పిల్లాడి చేతిలోనూ ఈరోజు ట్యాబ్‌లు కనిపిస్తున్నాయి, ఇంగ్లీష్ మీడియంతో మొదలు 3 తరగతి నుంచే పిల్లలకు టోఫెల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, ఇంగ్లీష్ మీడియంతో మొదలుపెడితే ఐబీ దాకా ఈరోజు ప్రయాణం జరుగుతోంది. ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతంలో ఎప్పుడూ జరగనివిధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ అంటే పిల్లల టెక్స్ట్ బుక్కుల్లో ఒక పేజీ ఇంగ్లీష్ మరో పేజీ తెలుగుతో పిల్లల చేతుల్లో కనిపిస్తున్నాయి. 

బడులు తెరిచే టైమ్‌కే పిల్లలకు విద్యాకానుక అందుతోంది, బడులు మొదలయ్యేసరికే పిల్లలకు గోరుముద్ద అనే కార్యక్రమంతో పిల్లలను చూసుకుంటున్నాం, ఈరోజు నేను అడుగుతున్నాను.. మొట్టమొదటిసారిగా తల్లులను ప్రోత్సహిస్తూ తమ పిల్లలను బడికి పంపండి చాలు బడికి పంపించినందుకు తల్లులకు ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి అనే కార్యక్రమం,పెద్ద చదువులకు ఏ తల్లి, తండ్రి కూడా తమ పిల్లలను చదివించేందుకు ఇబ్బంది పడకూడదని, అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని పెద్ద చదువులకు పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతిదీవెన అనే కార్యక్రమం, ఇంటర్నేషనల్ యూనివర్శిటీస్‌తో ఆన్‌లైన్ సర్టిఫైడ్ కోర్సులను మన డిగ్రీలతో అనుసంధానం, డిగ్రీలో ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేయడం ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగిందా? పిల్లల చదువుల మీద ప్రభుత్వం ఇంత ధ్యాస పెట్టడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఏం అన్నా గతంలో జరిగిందా? అక్కా గతంలో జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా తమ్ముడూ?.


అక్కచెల్లెమ్మలు ఆర్దిక స్వావలంబన దిశగా...
మొట్టమొదటిసారిగా  అక్కచెల్లెమ్మలను తమ కాళ్ల మీద తాము నిలబడేట్టుగా ఆ అక్కచెల్లెమ్మలకు ఓ ఆసరా, ఓ సున్నావడ్డీ,చేయూత,  కాపునేస్తం,ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, అందులో చేపట్టిన  ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇక్కడున్న ఇన్ని వేలమంది నా అన్నదమ్ములను, నా అక్కచెల్లెమ్మలను అడుగుతున్నాను.. గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు అందాయా? అన్నా జరిగాయా? జరిగాయా అక్కా? జరిగాయా తమ్ముడూ?.


తంలో లేని విధంగా రైతన్నను చేయిపట్టుకుని నడిపించాం.
అవ్వాతాతలకు గతంలో ఎప్పుడూ జరగనివిధంగా అవ్వాతాతలకు నేరుగా ఇంటికే వచ్చే రూ.3 వేల పెన్షన్, ఇంటివద్దకే పౌర సేవలు, ఇంటివద్దకే రేషన్, ఇంటివద్దకే పథకాలు.. నేను అడుగుతున్నాను ఇప్పుడిలా జరుగుతున్న కార్యక్రమాలు ఇంటికే పెన్షన్, ఇంటివద్దకే రేషన్, ఇంటికే పౌర సేవలు, ఇంటికే పథకాలు ఇలా మీ ఇంటికే వచ్చే కార్యక్రమం.. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? అని అడుగుతున్నాడు మీబిడ్డ. అన్నా జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడూ? జరిగిందా అక్కా? మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా రైతన్నలకు ఈరోజు పెట్టుబడికి సహాయంగా ఓ రైతుభరోసా, రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగానే ఇన్‌పుట్ సబ్సిడీ, పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్, రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ.. నేను అడుగుతున్నాను ఇంతగా రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తున్న పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని అడుగుతున్నాడు మీబిడ్డ. జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడూ? జరిగిందా అక్కా.


స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ.. 
స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనివిధంగా ఆటోలు, ట్యాక్సీలు తోలుకునే నా అన్నదమ్ములకు ఈరోజు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్ననేస్తం, మత్స్యకారులకు మత్స్యకారభరోసా,చిరువ్యాపారులకు, శ్రమజీవులకు అండగా ఓ తోడు, చేదోడు, లాయర్లకు కూడా లా నేస్తం.. ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ ఇన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఇచ్చారా? అని మీబిడ్డ అడుగుతున్నాడు .

పేదవాడు ఆరోగ్యం పరంగా అప్పులపాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని, పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఏకంగా రూ.25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, ఆపరేషన్ తర్వాత కూడా రెస్ట్ పీరియడ్ లో కూడా ఓ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ఈరోజు ప్రతి ఇంటి తలుపు తడుతూ కూడా ఈరోజు ఇంటికే ఓ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం.. నేను అడుగుతున్నాను పేదవాడికి ఆరోగ్యంపట్ల ఇంత శ్రద్ధ చూపిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? అని  మీ బిడ్డ అడుగుతున్నాడు.  

వీటన్నింటికీ తోడు ఏకంగా 600 రకాల సేవలు అందిస్తూ ప్రతి గ్రామంలోనూ ఈరోజు గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు, అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ, నాలుగు అడుగులు అక్కడి నుంచి వేస్తే అదే గ్రామంలో ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది, మరో నాలుగు అడుగులు ముందుకుపోతే అదే గ్రామంలో నాడు-నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి అక్కడే కనిపిస్తుంది, గ్రామానికే ఈరోజు ఫైబర్ గ్రిడ్ వచ్చింది, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మొట్టమొదటిసారిగా నా అక్కచెల్లెమ్మలకు రక్షణగా గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, నా అక్కచెల్లెమ్మలకు రక్షణగా ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లోనే ఓ దిశ యాప్ కనిపిస్తోంది.  నేడు అడుగుతున్నాను.. ఇటువంటివి అనేకం ఇప్పుడు మన కళ్లెదుటే ఈరోజు కనిపిస్తున్నాయి. ఈ విప్లవాలు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా కూడా చూశారా? అని కూడా మీ బిడ్డ  అడుగుతున్నాడు. ఈ మాదిరిగా ఇంటికే వచ్చే పాలన, లంచాలు వివక్ష లేని పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని మీబిడ్డ అడుగుతున్నాడు .    


మరోవంక చూడండి.. చంద్రబాబు 14 ఏళ్లు, ౩ సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానంటాడు. ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. మీలో ఏఒక్కరికైనా కూడా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్న ఈ చంద్రబాబు మీలో ఒక్కరికైనా కూడా ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా మీకు గుర్తుకొస్తుందా అని అడుగుతున్నాడు మీబిడ్డ. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు మరి అలాంటి వ్యక్తి పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా? ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.


ఒక్క హామీని అమలు చేయని బాబు.
అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు చెబుతాడు, మోసాలు చేస్తాడు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి 2014లో ఆయన ముఖ్యమైన హామీలు అనంటూ ఆయన మీ ప్రతిఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ ఒక్కసారి చూశారా? (టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) అని అడుగుతున్నాను. గుర్తుందా అన్నా ఈ పాంప్లెట్? ఈ పాంప్లెట్ గుర్తుందా తమ్ముడూ? అక్కా ఈ పాంప్లెట్ గుర్తుందా? కింద చంద్రబాబు సంతకం కనిపిస్తోందా? 2014లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ ఈ పాంప్లెట్ పంపించాడు. పంపించిన తర్వాత 2014లో చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలంతా ఓట్లు వేశారు. వేసిన తర్వాత చంద్రబాబు 2014 నుంచి 2019 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. నేను అడుగుతున్నా. 2014లో చంద్రబాబు ముఖ్యమైన హామీలంటూ సంతకం పెట్టి ఇదే కూటమిగా మారి ఇదే కూటమిగా తాను ఈ ఫొటోలు పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్‌లో చెప్పిన హామీలు ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాడా? అని అడుగుతున్నాడు మీబిడ్డ.


చంద్రబాబు విఫల హామీలు.
ఇందులో చెప్పిన హామీలు.. మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతున్నా రూ.87,612 కోట్ల మేర రైతుల రుణమాఫీ జరిగిందా? అని అడుగుతున్నాడు మీబిడ్డ. రెండో హామీ చంద్రబాబు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్‌లో రెండో హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ అన్నాడు. అక్కా పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు మరి పొదుపు సంఘాల రుణాలు ఏకంగా రూ.14,205 కోట్ల డ్వాక్రా సంఘాల రుణాలు ఇందులో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.  

మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ ఇన్నివేల మంది ఉన్నారు నేను అడుగుతున్నారు మీ ఇళ్లల్లో ఏ ఒక్కరికైనా కూడా రూ.25 వేల కథ దేవుడెరుగు,  ఒక్క రూపాయి అయినా బ్యాంకుల్లో వేశాడా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.

ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి నెలనెలా అన్నాడు. ఐదేళ్లు ఆయన పరిపాలన చేశాడు 60 నెలలు, అంటే రూ.1.20 లక్షలు ఇక్కడున్నవాళ్లల్లో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? అర్హులందరికీ మూడు సెంట్ల ఇంటి స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. నేను అడుగుతున్నాను ఇక్కడ ఇన్ని వేలమంది ఉన్నారు. అన్నా నేను అడుగుతున్నా?, అక్కా నేను అడుగుతున్నా ? మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా?.

రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. జరిగిందా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా ? సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తామన్నారు చేసిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు, నిర్మించాడా? కళ్యాణదుర్గంలో కనిపిస్తోందా ? మరి ఆలోచన చేయమని అడుగుతున్నాను. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ ఈ పాంప్లెట్ పంపించి... 2014 నుంచి 2019 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా? అనిమీబిడ్డ అడుగుతున్నాడు. ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా?  


మళ్లీ కొత్త మేనిఫెస్టోతో వస్తున్న బాబు.
మరి ఇప్పుడు ఏమంటున్నాడు ఇదే వ్యక్తి, ఇప్పుడు ఏమంటున్నాడు ఇదే చంద్రబాబు.. మళ్లీ కొత్త మేనిఫెస్టో అంటున్నాడు. సూపర్ సిక్స్ అంటున్నారు నమ్ముతారా? అన్నా నమ్ముతారా? తమ్ముడూ నమ్ముతారా? అక్కా నమ్ముతారా? నమ్ముతారా అమ్మా? సూపర్ సెవెన్ అంటున్నారు నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు నమ్ముతారా? అక్కా నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారమంట నమ్ముతారా? ఇంటింటికీ బెంజి కార్ కొనిస్తారట నమ్ముతారా? అన్నా నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతున్నా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క పేదవాడికి కూడా ఏ ఒక్క మంచి చేయలేదు. 14 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఏ ఒక్కపేదవాడికి ఏ రోజూ కూడా ఏ స్కీమూ తీసుకొచ్చి ఏ పేదవాడికి మంచి చేసిన పుణ్యం కట్టుకోలేదు చంద్రబాబు. ఆయన జీవితమంతా కూడా మోసాలు, ఆయన జీవితమంతా కూడా అబద్ధాలు. ఆయనకు అధికారం వచ్చిన ప్రతీసారి కూడా పేదవాడు బాగు పడింది లేదు. అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేస్తూ ఆయన చేసిందేమిటంటే దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే చంద్రబాబు చేశాడు.


మంచి కొనసాగాలంటే ఫ్యానుకే ఓటేయండి.
కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండి ఉన్నాయి. మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బుల్లేవు. కానీ చంద్రబాబు ఆ బటన్లు నొక్కలేదు పేదవాడికి డబ్బులు ఇచ్చింది లేదు పేదవాడికి స్కీములు ఇచ్చింది లేదు. చంద్రబాబు చేసిందల్లా అదే డబ్బు మీకు ఇవ్వాల్సిన డబ్బును తాను దోచుకున్నాడు, దోచుకున్నది పంచుకున్నాడు. కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి ఆ దోచుకున్న డబ్బులోనుంచి ఓటుకు రూ.2వేలు, 3వేలు ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో ఓటుకు రూ.4వేలు కూడా ఇస్తాడు. చంద్రబాబు ఆ డబ్బులు మీకు ఇస్తే ఏ ఒక్కరూ ఆ డబ్బులు వద్దు అని చెప్పొద్దు. ఎందుకంటే ఆ డబ్బు అంతా మనదే. 

మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే అదంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీలో ప్రతిఒక్కరూ కూడా ఆలోచన చేయండి. మీ ఇంటికి వెళ్లండి. మీ భార్యలతో కూర్చొండి, మీ ఇంట్లో ఉన్న అవ్వాతాతలతో మాట్లాడండి. మీ ఇంట్లో ఉన్న మీ చిన్నపిల్లలతో కూడా మాట్లాడండి. ఓటు లేదు కదా అని పిల్లలను పెట్టొద్దు. వాళ్లతో కూడా మాట్లాడండి. మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో మాట్లాడండి. మీ ఆడపడుచులతో మాట్లాడండి. అందరితో కూడా మాట్లాడి ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి. ఎవరు ఉంటే మీకు మంచి జరిగింది? ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరిగింది? మీకు మంచి జరిగింది? ఆ మంచి కొనసాగాలంటే ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మిమ్మల్ని ఓటు వేసే విషయంలో ఈ ఆలోచన చేసిన తర్వాతనే ఓటు వేయండి అని మాత్రం మీఅందరితో కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను.

ఇది విన్నవించుకుంటూ వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్‌ రూ.3వేలు మళ్లీ ఇంటికే రావాలన్నా, నొక్కిన బటన్‌ల డబ్బులు మళ్లీ మీకు రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, వారి చదువులు, వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు.. రెండు బటన్లు ఫ్యాన్‌ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వీలే లేదు... సిద్ధమేనా?

మన గుర్తు ఫ్యాను. ఇక్కడో, అక్కడో, ఎక్కడో మన గుర్తు తెలియని వారు ఎవరైనా ఉంటే..మన గుర్తు ఫ్యాను. ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ తమ్ముడూ, అక్కా మన గుర్తు ఫ్యాన్, చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అవ్వా మన గుర్తు ఫ్యాన్, తాత మన గుర్తు ఫ్యాన్.. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింకులోనే ఉండాలి.

మన అభ్యర్ధులను ఆశీర్వదించండి.
మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగయ్యను మీకు పరిచయం చేస్తున్నాను. మీలో ఒకడు, వెనుకబడిన కులాలకు సంబంధించిన వాడు, మంచివాడు, సౌమ్యుడు.. నేను ఇంతకు ముందే చెప్పా.. చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. బాబు ఇచ్చే రూ.2 వేలకో, రూ.3 వేలకో పొరపాటున మోసపోకండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. జగన్ మళ్లీ ఉంటేనే ప్రతినెల కేలెండర్‌ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందో ముందే చెప్పి ప్రతి నెలా ఇదుగో ఈనెల రైతు భరోసా, ఇదిగో ఈనెల అమ్మఒడి, ఇదిగో ఈనెల చేయూత అంటూ ప్రతి సంవత్సరమూ..ఐదు సంవత్సరాలూ ప్రతి పథకమూ కూడా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే రూ.2వేలకు, రూ.3వేలకు మోసపోవద్దండీ. జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే..ప్రతి నెలా ప్రతి ఇంట్లో పండుగే అని గుర్తుపెట్టుకోండి. ఈ పథకాలన్నీ కొనసాగాలి అంటే...మళ్లీ జగనే రావాలి..జగనే కావాలి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. 
ఎంపీ అభ్యర్థిగా శంకరన్న నిలబడుతున్నాడు. తాను కూడా మీలో ఒకడు. వెనుకబడిన కులాలకు సంబంధించిన వాడు. మంచివాడు సౌమ్యుడు, మంచి చేస్తాడు. మీరు ఇక్కడ నొక్కే బటన్ ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి. మీ బిడ్డ పెన్షన్లు ఇంటికి నేరుగా పంపుతా ఉంటే అడ్డుకున్న ఢిల్లీదాకా సౌండ్‌ వినిపించాలి. మీ బిడ్డ బటన్లు నొక్కితే అడ్డుకున్న ఢిల్లీదాకా సౌండ్ వినిపించాలి. అంత గట్టిగా ఖచ్చితంగా సౌండ్ వినిపించేట్లుగా మీ మెజారిటీతో ఇద్దరినీ గెలిపించాలని సవినయంగా మీఅందర్నీ రెండు చేతులు జోడించి పేరుపేరునా  మీబిడ్డ  ప్రార్థిస్తున్నాడు అంటూ ముఖ్యమంత్రి శ్రీ.వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement