బెంగళూరు: మోయలేని రుణ భారం దెబ్బకు పలు వర్ధమాన దేశాల ఆర్థిక పరిస్థితి తలకిందులవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వెలిబుచ్చారు. ఇది ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి కూడా ఇది ప్రమాద సంకేతమేనన్నారు. శుక్రవారం బెంగళూరులో మొదలైన జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల రెండు రోజుల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన వీడియో సందేశమిచ్చారు. మితిమీరిన అప్పులకు కరోనా కల్లోలం వంటివి శ్రీలంక దివాలా తీయడం, పాకిస్తాన్ కూడా అదే బాటన ఉండటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరిగి స్థిరత్వంతో కూడిన వృద్ధి బాట పట్టించడం, దానిపై విశ్వాసం పాదుగొల్పడం సంపన్న దేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల బాధ్యతేనని ఆయన హితవు పలికారు. ‘‘ఇదంత సులభం కాదు. కానీ నిర్మాణాత్మక ప్రయత్నం జరిగి తీరాలి. అయితే కాలానుగుణంగా సంస్కరించుకుని మారడంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు వెనకబడటంతో వాటిపై విశ్వాసం సన్నగిల్లుతోంది. దీనిపైనా దృష్టి పెట్టాలి’’ అని అభిప్రాయపడ్డారు.
వాతావరణ మార్పుల విపత్తునూ సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచంలో పలుచోట్ల భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ప్రపంచంలోని పలు దేశాల్లో కనీస సౌకర్యాలకూ నోచుకోక అలమటిస్తున్న దుర్బల ప్రజానీకాన్ని ఆదుకోవడంపై మరింత దృష్టి పెట్టాలన్నారు.
ఆశాదీపంగా భారత్: కరోనా కల్లోలం దెబ్బ నుంచి కోలుకోవడానికి వర్ధమాన దేశాలు ఇంకా పోరాడుతూనే ఉన్న నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుత పనితీరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. డిజిటల్ కరెన్సీలు, పేమెంట్లు, ప్రపంచ బ్యాంకు వంటి ఆర్థిక సంస్థల్లో సంస్కరణల ఆవశ్యకతతో పాటు కీలకమైన పర్యావరణ మార్పుల సమస్యను ఎదుర్కోవడంపై కూడా సదస్సులో చర్చించే అవకాశముంది.
వ్యవసాయ కేటాయింపులు ఐదింతలు
న్యూఢిల్లీ: దేశ వ్యవసాయ రంగ వార్షిక బడ్జెట్ కేటాయింపులు 2014తో పోలిస్తే ఐదింతలు పెరిగి రూ.1.25 లక్షల కోట్లకు చేరుకున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వం సాగు రంగం పురోగతిపై దృష్టి సారించి, వంటనూనెలు వంటి ఆహార వస్తువుల దిగుమతులను తగ్గించేందుకు కృషి చేస్తోందన్నారు. ‘వ్యవసాయం–సహకారరంగం’పై పోస్ట్–బడ్జెట్ వెబినార్‌లో ఆయన మాట్లాడారు. బడ్జెట్‌లో నిర్ణయాల సమర్థ అమలుకు సలహాల నిమిత్తం కేంద్రం ఈ వెబినార్‌లను నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment