Photo Credit: BCCI Twitter
క్రైస్ట్‌చర్చి వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్ ఆకాశ్ దీప్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియాను ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కించడమే గాక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రికార్డును కూడా బద్దలుకొట్టాడు.
మ్యాచ్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆకాశ్ దీప్ 52 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రైస్ట్‌చర్చి వేదికలో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్‌గా ఆకాశ్ నిలిచాడు.
గతంలో రవీంద్ర జడేజా (2020లో) ఇదే క్రైస్ట్‌చర్చి వేదికగా జరిగిన టెస్టులో 22 బంతుల్లో 16 పరుగులతో అజేయంగా నిలవడమే ఇప్పటివరకు అత్యుత్తమం. ఆ మ్యాచ్‌లో టీమిండియా 124 పరుగులకే కుప్పకూలింది.
ఆకాశ్ దీప్ క్రీజులోకి వచ్చే సమయానికి భారత్ 117-7 స్కోరుతో ఉంది. ఫాలోఆన్ ముప్పు తప్పించుకోవాలంటే మరో 40 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో ధ్రువ్ జురెల్‌తో కలిసి ఆకాశ్ దీప్ ఇన్నింగ్స్ నడిపించాడు. జురెల్ యాంకర్ రోల్ పోషించగా, ఆకాశ్ దీప్ యధేచ్చగా బ్యాట్‌ను ఝలిపించాడు.
ఈ ఇద్దరి మధ్య ఎనిమిదో వికెట్‌కు 46 పరుగులు జోడించి భారత్‌ను ఫాలోఆన్ గండం నుంచి బయటపడేశారు. ఆకాశ్ దీప్ ఔటైన తర్వాత వేగంగా ఆడిన ధ్రువ్ జురెల్.. గుర్నూర్ బ్రార్‌తో కలిసి 64 పరుగులు జోడించాడు. దీంతో భారత్ 200 పరుగుల మార్క్‌ను దాటింది.
ఇదీ చదవండి:


