ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌లు ప్రారంభించాలి? థియేటర్లు మళ్లీ ఎలా ఓపెన్ చేయాలి? అనే విషయాల గురించి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పలువురు సినీ ప్రముఖులు చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి గురువారం నటుడు బాలకృష్ణ వద్ద మీడియా ప్రస్తావించగా, ‘‘ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి అంట. వార్తల ద్వారా, పత్రికల ద్వారా విషయం తెలుస్తోంది. అంచలంచెలుగా షూటింగ్స్‌కి అనుమతి ఇస్తారని తెలిసింది’’ అన్నారు. అనంతరం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో ‘‘చాలా మీటింగులు జరిగాయి. నన్ను ఎవ్వరూ పిలవలేదు. ఎవరు పిలిచారు నన్ను? వీళ్లందరూ ఏమైనా భూములు పంచుకుంటున్నారా... శ్రీనివాస్ యాదవ్‌తో కూర్చుని. నన్ను ఒక్కడూ పిలవలేదు’’ అన్నారు బాలకృష్ణ.
నోరు అదుపులో పెట్టుకోండి : నాగబాబు
ఈ విషయంపై నటుడు నాగబాబు తన యూట్యూబ్ చానల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. నాగబాబు మాట్లాడుతూ – ‘‘షూటింగ్స్ ఎలా ప్రారంభించాలని తలసాని శ్రీనివాస యాదవ్‌తో కలసి చిరంజీవిగారింట్లో
నాగార్జునగారు, రాజమౌళిగారు, అరవింద్‌గారు, సురేశ్‌బాబుగారు, ఇంకా ఇండస్ట్రీకి సంబంధించిన నటులు, నిర్మాతలందరూ చిన్న మీటింగ్ పెట్టుకున్నారు. చాలా తక్కువ మందినే పిలిచారు. ఆ మీటింగ్ నేపథ్యం ఏంటో సరిగ్గా తెలియదు. ఇవాళ బాలకృష్ణగారి కామెంట్స్ చూశాను. ఆయన్ను మీటింగ్‌కి పిలవకపోవడం తప్పా? ఒప్పా నాకు తెలియదు. పిలిచారా పిలవలేదా? అని ఈ మీటింగ్స్‌ని నిర్వహించినవాళ్లను అడగాల్సిన బాధ్యత బాలకృష్ణ మీద ఉంది. పిలవలేదని కోప్పడ్డారు. సరే.. కోప్పడ్డానికి రీజన్ ఉంది. కానీ ‘భూములు పంచుకుంటున్నారు’ అని నోరు జారారు.
మిమ్మల్ని పిలవకపోవడం కరెక్ట్ అని నేను అనను. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అయ్యుంటుంది. వేరే కారణం అయ్యుండొచ్చు. ఆ కారణం తెలుసుకొని అడిగినా తప్పు లేదు. కానీ భూములు పంచుకుంటున్నారన్న మాట నిర్మాతగా, నటుడిగా నాకు బాధ కలిగించింది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతానంటే కరెక్ట్ కాదు. మీకంటే పదిరెట్లు ఎక్కువ మాట్లాడటానికి చాలా మంది ఉన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి బాలకృష్ణగారూ. ఇండస్ట్రీ బాగు కోసం పని చేస్తున్నారు తప్ప, భూములు పంచుకోవడానికి ఎవ్వరూ వెళ్లలేదు. మమ్మల్ని కూడా చాలామంది పిలవలేదు. ఆ మాటలేంటి? ఇండస్ట్రీ మీద మీకున్న గౌరవం ఇదా? మీరు కేవలం ఇండస్ట్రీనే కాదు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అవమానించారు. ఇండస్ట్రీకి, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పడం మీ బాధ్యత. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేశారో ఆంధ్రప్రదేశ్‌కి వెళ్తే మీకు తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఆంధ్రప్రదేశ్‌ని ఎలా నాశనం చేశారో, సామాన్యుల జీవితాలు ఎలా నాశనం అయ్యాయో మీ తెలుగు దేశం పార్టీని నమ్మినవాళ్లను అడిగితే తెలుస్తుంది. ఇండస్ట్రీకి మీరు కింగ్ కాదు. ఒక హీరో మాత్రమే. కంట్రోల్‌గా మాట్లాడటం నేర్చుకోండి’’ అన్నారు.
మాలో విభేదాలు లేవు – నిర్మాత సి. కల్యాణ్
నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ – ‘‘మీటింగ్స్ అన్నీ నిర్మాతల తరఫునుంచి, స్టూడియోల సైడ్ నుంచి జరుగుతున్నాయి తప్పితే ఆర్టిస్టుల నుంచి కాదు. ఆర్టిస్టుల ఇబ్బందులు చెప్పడానికి ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఉంది. దాని నుంచి నరేశ్‌గారు, జీవితగారు హాజరయ్యారు.
ఎవరితో ఏది చర్చించాలంటే ఇండస్ట్రీ వాళ్లను పిలుస్తుంది. ఇండస్ట్రీలో ఉండే ఎవరైనా ఇండస్ట్రీని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాం అని ముందుకు వస్తే వాళ్ల వెనక ఉండటానికి మేం సిద్ధంగా ఉన్నాం. మధ్యాహ్నమే (గురువారం) బాలకృష్ణగారికి అన్నీ వివరించాను. ఆయన సంతృప్తిగానే ఉన్నారు. ఈ విషయం మీద ఇక చర్చలు ఉండవనుకుంటున్నాను. ఇక మీటింగ్స్ ఉండకపోవచ్చు. బాలకృష్ణగారు మా హీరో. ఆయన మనిషిగా నేను ఇందులో పాల్గొంటున్నట్టే లెక్క. మాకు ఇద్దరు ముఖ్యమంత్రులూ ముఖ్యం. అందరం ఒకటే. ఇక్కడ గ్రూపులు లేవు. దాసరిగారు ఉన్నప్పుడు అన్నీ ఆయన భుజాన వేసుకున్నారు. ఇప్పుడు చిరంజీవిగారిని మేమే అడిగాం. నాగార్జునగారూ వచ్చారు. బాలకృష్ణగారు కూడా రెడీగా ఉన్నారు. ఎక్కడ ఎవరు అవసరమైతే వాళ్లను పిలుచుకుని వెళ్లడానికి మేం రెడీ. పని జరగడం ముఖ్యం. మేం ఏ పార్టీలకు సంబంధించిన వాళ్లం కాదు. బాలయ్యగారు వస్తానంటే ఎవరైనా వద్దంటారా? మాలో విభేదాలు లేవు. బాలయ్యను సొంత బ్రదర్‌లా భావిస్తాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment