చివరి వన్డే : సెంచరీతో రాహుల్‌ రికార్డుల మోత..!

India Vs New Zealand 3rd ODI Lokesh Rahul Clinch Century And Records - Sakshi

మౌంట్‌ మాంగనీ: న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మూడో వన్డేలో వికెట్‌ కీపర్‌ లోకేష్‌ రాహుల్‌ సెంచరీ (113 బంతుల్లో 112; ఫోర్లు 9, సిక్స్‌ 2)తో మెరిశాడు. ఈక్రమంలో 21 ఏళ్ల తర్వాత ఆసియా బయట వన్డేల్లో సెంచరీ చేసిన భారత వికెట్‌ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. 1999లో ఇంగ్లండ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ది గ్రేట్‌ వాల్‌ రాహుల్‌ ద్రావిడ్‌ సెంచరీ సాధించాడు. దీంతోపాటు లోకేష్‌ రాహుల్‌ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐదు లేక ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌ చేసి సెంచరీ సాధించిన వికెట్‌ కీపర్‌గా ధోని పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. 2017లో  కటక్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌​ ధోని 134 పరుగులు చేశాడు.
 
ధావన్‌ తర్వాత రాహులే..
భారత్‌ తరపున తక్కువ ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలు చేసిన రికార్డునూ రాహుల్‌ నమోదు చేశాడు.శిఖర్‌ ధావన్‌ 24 ఇన్నింగ్స్‌లలో ఆ ఘనత సాధించగా.. వరుసగా లోకేశ్‌ రాహుల్‌ 31, విరాట్‌ కోహ్లి 36, గౌతం గంభీర్‌ 44, వీరేంద్ర సెహ్వాగ్‌ 50 ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలు సాధించారు. మంచి ఫామ్‌లో ఉన్న రాహుల్‌ తాజా టీ20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో సైతం 88 పరుగులతో రాణించాడు.

రాహుల్‌పై వీవీఎస్‌ ప్రశంసలు..
అద్భుత ఫామ్‌తో అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు వికెట్‌ కీపింగ్‌లోనూ రాణిస్తున్న లోకేష్‌ రాహుల్‌పై టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసలు కురిపించారు. తన క్లాస్‌ ఇన్నింగ్స్‌తో మరో గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడని కొనియాడారు. రాహుల్‌ గత 11 వన్డే ఇన్నింగ్స్‌లలో 6 హాఫ్‌ సెంచరీలు చేశాడని, న్యూజిలాండ్‌తో చివరి వన్డేలో దానిని సెంచరీగా మలిచాడని ట్విటర్‌లో పేర్కొన్నారు. శ్రేయాస్‌ అయ్యర్‌, పృథ్వీ షా, మనీష్‌ పాండే చక్కని సమన్వయంతో జట్టుకు మంచి స్కోరు అందించారని తెలిపారు. ఇక ఆఖరి వన్డేలో టీమిండియా భవితవ్యం బౌలర్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top