KCR
-
మౌనం వీడి రేవంత్ సర్కార్ పై నిప్పు లు చెరిగిన కేసీఆర్
-
నాకు వట్టిగ కొట్టుడు అలవాటు లేదు, నాలుగు రోజులు కానీయ్ అని చూస్తున్నా... తెలంగాణ ప్రభుత్వంపై కేసీఆర్ ఆగ్రహం
-
దమ్ముంటే అసెంబ్లీకి రా.. తేల్చుకుందాం
సాక్షి,రంగారెడ్డి జిల్లా: ‘‘కేసీఆర్(KCR) గత 14 నెలలుగా ఫౌమ్‌హౌస్‌లో పడుకొని గంభీరంగా చూస్తున్నానని అంటున్నారు. ఎవరిని చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నావు? బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించేందుకు ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నాం. ఫామ్‌హౌస్‌లో పడుకుని పొంకనాలు కొట్టడం కాదు. దమ్ముంటే అసెంబ్లీకి రా.. అన్ని లెక్కలు తేల్చుకుందాం.’’ అని మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సవాల్ విసిరారు.రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫౌమ్‌హౌస్‌లో పడుకొని కొడుకు, అల్లుడిని ఊర్లపైకి ఉసిగొల్పుతున్నడు. జహంగీర్‌పీర్ దర్గా, వేములవాడ రాజన్నలను మోసం చేసిన చరిత్ర నీది. నీ రాక కోసం తెలంగాణ ప్రజలెవరూ ఎదురు చూడటం లేదు. సరిగ్గా నిలబడటం నేర్చుకో.. నువ్వో చెల్లని వెయ్యి రూపాయల నోటువు. ఆ నోటును ఎవరైనా జేబులో పెట్టుకునిపోతే.. జైలుకు వెళ్లడం ఖాయం. కొడితే బలంగా కొడతానని అంటున్నారు. కొట్టడం కాదు ముందు సరిగ్గా నిలబడటం నేర్చుకో. సోషల్ మీడియా టిక్‌టాక్‌లో తనకు ఎక్కువ మార్కులు వచ్చాయని గొప్పలు చెప్పుకొంటున్నారు. సల్మాన్‌ఖాన్‌కు రాఖీ సావంత్‌కు మధ్య పోటీపెడితే ఎక్కువ లైకులు రాఖీ సావంత్‌కే వచ్చాయి. అంత మాత్రన సల్మాన్‌ఖాన్ గొప్పవాడు కాకుండా పోతాడా? ఆయన ఆరోగ్య పరిస్థితి బాగులేదు కేసీఆర్ మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. ఆయన కుటుంబ సభ్యులు యమకింకరులై తిరుగుతున్నారు. ఫామ్‌హౌస్‌లో పడుకుని సోది చెప్పుకోవడం కాదు. అసెంబ్లీకి రా.. అన్ని లెక్కలు వివరిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి పనులను, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను అభినంచడానికి మనసు రాకపోతే ఫామ్‌హౌస్‌లోనే పడుకో. పాలమూరు, జూరాల ఎత్తిపోతల, కోయల్‌సాగర్ కడతానని హామీ ఇచ్చి.. ప్రజలను మోసం చేశావు. నువ్వు ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. ఏడాదిలో ఎన్నో చేశాం.. మా ఏడాది పాలనలో రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. సన్నాలకు రూ.500 బోనస్ ఇచ్చాం. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే గృహాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు భర్తీ చేశాం. రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేలు ఇస్తున్నాం. భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నగదు అందజేస్తున్నాం, రైతును రాజును చేస్తున్నాం. ప్రభుత్వ విద్యకు బడ్జెట్ 15 శాతానికి పెంచుతాం దివంగత వైఎస్సార్ పాలనలో జిల్లాకో యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. అనేక ప్రభుత్వ పాఠశాలలను నెలకొల్పాం. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పించాం. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా నిర్విర్యమైంది. ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు పునరావాస కేంద్రాలుగా మారాయి. అవి ప్రతిష్టను కోల్పోయే పరిస్థితికి దిగజార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. బడ్జెట్లో ఏడు శాతం నిధులు కేటాయించాం. తండాలు, మారుమూల గ్రామాల్లో మూసివేసిన అనేక పాఠశాలలను పునఃప్రారంభించాం. 11 వేల కొత్త ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. భవిష్యత్తులో విద్యకు బడ్జెట్‌ను 15 శాతానికి పెంచాలని నిర్ణయించాం. స్టాన్‌ఫర్డ్ వర్సిటీతో ఎంఓయూకు యత్నం మహాత్మాగాంధీ నడిపిన యంగ్ ఇండియా పత్రిక స్ఫూర్తితో విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలను అందించేందుకు ‘యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్’ను ఏర్పాటు చేస్తున్నాం. రూ.2,400 కోట్లతో 75 ఐటీఐలను ఆధునీకరించాం. టాటా కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. సింగపూర్ నుంచి నిపుణులను ఇక్కడికి రప్పించి, నిరుద్యోగులకు ఆయా అంశాల్లో శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ వర్సిటీతో ఎంఓయూ కోసం ప్రయత్నిస్తున్నాం. కేవలం చదువుకున్నవారికే కాదు ఆటల్లో రాణిస్తున్నవారికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగంతోపాటు రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించాం. పెద్దగా చదువు లేని సిరాజుద్దీన్ సహా దీప్తికి గ్రూప్–2 ఉద్యోగం, ఆర్థిక సాయం, ఇంటి స్థలం ఇచ్చి ప్రోత్సహించాం..’’ అని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వ టీచర్లు ఆత్మ విమర్శ చేసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమై ఉంది. రాష్ట్రంలో 12వేల ప్రైవేటు పాఠశాలల్లో 31లక్షల విద్యార్థులు చదువుతుంటే.. 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది చదువుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. ప్రభుత్వ విద్య ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మట్టిలో మాణిక్యాలను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు స్థానికంగా నివాసం ఉండాలి. విద్యార్థులను ప్రోత్సహించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో డిగ్రీలు, పట్టాలు ఉంటే సరిపోదు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే మార్కులు, డిగ్రీలేకాదు.. సాంకేతిక నైపుణ్యం కూడా తోడవాలి. అప్పుడే కోరిన ఉద్యోగం దొరుకుతుంది. మొగిలిగిద్దకు రూ.16 కోట్లు మొగిలిగిద్ద పాఠశాల తెలంగాణకే వన్నె తెచ్చిందని, ఇక్కడ చదువుకున్న వారిలో ఇద్దరు సీఎంలు, గవర్నర్, మాజీ మంత్రి, ప్రొఫెసర్ సహా అనేక మంది ఉన్నారని సీఎం గుర్తు చేశారు. ఇలాంటి చారిత్రక స్కూలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. మొగిలిగిద్దలో పాఠశాల భవనం, గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్ల కోసం రూ.16 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక్కడి విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ‘అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్’ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ బహిరంగ సభలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
నేను కొడితే.. వట్టిగ ఉండదు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను నేను గంభీరంగా, మౌనంగా చూస్తున్నా.. నాకు కొడితే వట్టిగా కొట్టుడు అలవాటు లేదు కదా. నాలుగు రోజులు కానీయ్ అన్నట్లు చూస్తున్నా. కాంగ్రెస్(congress party) అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. సంగమేశ్వర, బసవేశ్వర, పాలమూరు ఎత్తిపోతల పథకాలు నిలిచిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) ను ఎండబెడుతున్నరు. ఈ అన్యాయాలపై ఫిబ్రవరి నెలాఖరులో బహిరంగ సభ పెట్టి వీళ్ల సంగతి చూడాలి. పెద్ద ఎత్తున సభకు తరలివచ్చి తెలంగాణ శక్తిని మరోమారు చాటాలి. కాంగ్రెస్ మెడలు వంచి భవిష్యత్తు కోసం కొట్లాడాలి’ అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(Kcr) పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామం నుంచి వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసి శుక్రవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘మన పార్టీకి కులం, మతం, జాతి అనే భేదభావం లేదు. తెలంగాణ సరిహద్దు లోపల ఉన్న వారందరికీ న్యాయం జరిగి బాగుపడాలి. తెలంగాణకు అన్యాయం జరిగితే కొట్లాడేందుకు ఎవరూ ముందుకు రారు. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులం మనమే. తెలంగాణ హక్కుల కోసం తెగించి కొట్లాడాల్సింది బీఆర్ఎస్ అనే విషయంలో రెండో మాటే లేదు. ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే ప్రాజెక్టులు, నీళ్లు సాధించుకోవాలి. అవసరమైన సందర్భంలో నేను, జిల్లా నాయకులు ఇచ్చే పిలుపునకు స్పందించి ప్రజలకు జరిగే అన్యాయాలపై ఎదురు తిరిగి కొట్లాడాలి. తెలంగాణ కోసమే బయలుదేరిన గులాబీ జెండా తెలంగాణను సాధించి దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టింది. కాంగ్రెస్ మోసాలకు బలయ్యారు.. ఇన్నాళ్లూ కోటి రూపాయలు పలికిన భూమిని ఇప్పుడు రూ.50లక్షలకు కొనే పరిస్థితి లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మార్చి వరకు రూ.15వేల కోట్ల ఆదాయం తగ్గుతోందని కాగ్ రిపోర్టు చెబుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ఆదాయంలో రూ.15 వేల కోట్ల వృద్ధిని సాధించింది. ఇప్పుడు మరో నాలుగైదు నెలల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమనే పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించారు.మనం ప్రాజెక్టులు, చెరువుల కింద నీటి తీరువా రద్దు చేసి రైతులకు ఎన్నో సదుపాయాలు కల్పించాం. కానీ కొన్ని నియోజకవర్గాల్లో అత్యాశకు పోయి ఓట్లేసి బావిలో పడ్డారు. మంది మాటలు పట్టుకుని మార్వాణం పోతే మళ్లీ వచ్చేసరికి ఇల్లు ఆగమైందన్నట్టు పరిస్థితి తయారైంది. తులం బంగారం ఇస్తామంటే నమ్మి ఓటేస్తే ఏమవుతుందో తెలంగాణలో మంచి గుణపాఠం అయింది. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు కాంగ్రెస్ మోసాలకు బలయ్యారు. ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నరు.. రైతుబంధుతో వ్యవసాయం మెరుగై అప్పులు తీర్చుకుని, చిట్టీలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడా సంతోషం మంటగలిసింది. వాళ్లు ఎన్నికల సమయంలో ఇస్తరో ఎప్పుడు ఇస్తరో దేవుడికే ఎరుక. కరోనా సమయంలో మేం రైతుబంధు ఇచ్చి రైతులను కాపాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్లు వేయించుకుని వారి బాగోగులను పట్టించుకోవడంలేదు. మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల ద్వారా పేద విద్యార్థులకు కాన్వెంట్ విద్య అందిస్తే.. ఇప్పుడు పిల్లలు విషాహారం, పురుగుల అన్నం, కడుపునొప్పితో ఇంటి బాట పడుతున్నరు. కాంగ్రెస్ పాలన లోపాలను ప్రశ్నిస్తే పోలీసు స్టేషన్లకు పట్టిస్తున్నారు. ఏడాది పాలనతోనే కాంగ్రెస్ వాళ్లు దొరికితే కొడతం అన్నట్లుగా జనం ఉన్నరు. ఫామ్‌హౌజ్‌కు వస్తే పార పట్టొచ్చు వాళ్ల పార్టీ నిన్న ఒక పోలింగ్ పెట్టింది. అందులో 70శాతం మనకు, 30శాతం వాళ్లకు వచ్చింది. ఫామ్ హౌజ్ అంటే ఇక్కడ వరి, మక్కలు, అల్లం తప్ప ఏముంటది. కాంగ్రెస్ వాళ్లు వస్తే తలాకొంత సేపు పారపట్టి పనిచేయచ్చు. ఫామ్‌హౌజ్ అని బదనాం చేసి అధికారంలోకి వచ్చారు. ఏడాదిలోనే కాంగ్రెస్ పాలనకు విసిగి మళ్లీ మనమే రావాలని ప్రజలు వందశాతం కోరుకుంటున్నరు. కచ్చితంగా రాబోయే ప్రభుత్వం మనదే..’’ అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రైతులను సమీకరించి ఉద్యమం జహీరాబాద్ నియోజకవర్గంలో సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసినా.. ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులు నిలిపివేసి రైతులను ఇబ్బందులు పెడుతోందని కేసీఆర్ మండిపడ్డారు. రైతులకు నష్టం జరుగుతుంటే ఆ జిల్లా మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. దీనిపై రైతులను భారీ స్థాయిలో సమీకరించి ఉద్యమం చేపట్టాలని మాజీ మంత్రి హరీశ్‌రావుకు కేసీఆర్ సూచించారు.పాదయాత్రగా ఎర్రవల్లికి వచ్చిన మాజీ సర్పంచులు పరమేశ్వర్ పాటిల్, బోయిని చంద్రయ్య, పార్టీ నేతలు సంగమేశ్వర్, ప్రశాంత్, బోయిని శ్రీనివాస్, ప్రదీప్ తదితరులు కేసీఆర్‌ను సత్కరించి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ ప్రసాదం అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాణిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ తడాఖా అప్పుడే తెలిసింది: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి,నల్లగొండజిల్లా:కేసీఆర్ ఇప్పటికైనా బయటకు వచ్చినందుకు సంతోషమని,రేపటి నుంచి ఆయనను ఎండ కట్టడాన్ని తెలంగాణ ప్రజలు చూస్తారని మంత్రి కోమటిరెడ్డివెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం(జనవరి31) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘దళితులకు మూడెకరాల భూమి,డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఎన్ని ఇల్లు ఇచ్చావు.రేపటి నుంచి తడాఖా చూపిస్తా అని కేసీఆర్ అంటున్నారు.కేసీఆర్ తడాఖా ఏంటో పార్లమెంటు ఎన్నికల్లో చూశాం.పదహారు లోక్‌సభ స్థానాల్లో ప్రచారం చేస్తే తొమ్మిదింటిలో డిపాజిట్ కూడా రాలేదు.నువ్వేదో నాయకుడివి అనుకుంటున్నావు.తెలంగాణ సాధనలో నీ పాత్ర అసలే లేదు. నాలాంటి వాళ్లు మంత్రి పదవికి రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ దొంగ దీక్షలు చేశాడు.మాటలతో పదేళ్లు కేసీఆర్ రాజకీయాలు చేశాడు.ముందు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు.బయటికి వస్తా అంటున్నావ్ కదా ఏ జిల్లాకు పోదాం చెప్పు. పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు.ఏడు లక్షల కోట్ల అప్పు చేశావు’ -
కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్
సాక్షి,హైదరాబాద్: ‘ఆయన కొడితే బలంగా కొడతా అంటున్నారు. బలంగా కొట్టుడు కాదు. సరిగ్గా నిలబడమనండి’’ అంటూ మాజీ సీఎం కేసీఆర్ (kcr) వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. ఫామ్ హౌస్ (Farm House)లో కూర్చొని మాటలు చెప్పుడు కాదు. అసెంబ్లీకి రావాలంటూ సవాల్ విసిరారు. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘‘కేసీఆర్ కోసం ఎవరు ఎదురు చూడడం లేదు. జహంగీర్ పీర్కి రూ.100 కోట్లు, రాజరాజేశ్వరస్వామికి రూ.100 కోట్లు ఇస్తామని మోసం చేశారు. పాలమూరును ఎండబెట్టిన ఘనలు మీరు. ఆయన కొడితే బలంగా కొడతా అంటున్నారు. బలంగా కొట్టుడు కాదు. సరిగ్గా నిలబడు. 14 నెలల ఫామ్ హౌస్‌లో పడుకుని గంభీరంగా చూస్తున్నాం అని అంటున్నావ్. ఏం చేస్తున్నావ్...హరీష్‌ను, కేటీఆర్‌ను ఊరిమీదకు వదిలావ్. నీను మీలాగా మాటలు చెప్పి ఎగ్గొట్టను. అబద్ధాలు చెప్పడం వల్లే ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు గాడిగుడ్డు చేతికి ఇచ్చారు. అసెంబ్లీకి వస్తే ఏ ఊరికి ఎంత రుణ మాఫీ చేశామో చెబుతాం. నాకు, కేసీఆర్‌కు పోలింగ్ పెడితే కేసీఆర్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయంటా. సల్మాన్‌ఖాన్‌కు.. రాఖీ సావంత్‌కు ఓటింగ్ పెడితే .. రాఖీ సావంత్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంత మాత్రానా సల్మాన్ ఖాన్ హీరో కాకుండా పోరుగా. ప్రజలు తిరస్కరించినా బుద్ధిరాలేదు’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.👉చదవండి : నేను కొడితే మామూలుగా ఉండదు -
కేసీఆర్ ఫాంహౌజ్ కలలు మానాలి: టీపీసీసీ చీఫ్
సాక్షి,హైదరాబాద్:కేసీఆర్ ఫాంహౌస్ కలలు మానుకోవాలని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం(జనవరి31) మహేష్‌కుమార్ స్పందించారు.‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్‌లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్ అభ్యర్థుల కోసం ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రజలు ఫాం హౌస్ పాలన,గడీల పాలన కోరుకోవడం లేదు. ప్రజా పాలన,ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించలేని ప్రగతిని కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించడంతో ఆయన దిక్కుతోచక మాట్లాడుతున్నారు. కుమార్తె కవితపై ఇప్పుడు మరో లిక్కర్ స్కాం ఆరోపణలు రావడంతో ఆయన ఆ అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారు.అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా విఫలమైన కేసీఆర్,కాంగ్రెస్ అధికారంలో విఫలమైందని వ్యాఖ్యానించడం హాస్వాస్పదం. కాంగ్రెస్ ఏడాది పాలనలో 50 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయడం ఆయనకు కనిపించడం లేదా? అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గద్దెదింపినా, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కకపోయినా గుణపాఠం నేర్వని కేసీఆర్ ఫాంహౌస్‌లో పగటి కలలు కంటున్నారు.రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులే కరువైన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌పై అవాకులు చెవాకులు పలుకుతున్నారు.ప్రజలు చీ కొట్టినా కేసీఆర్ వ్యవహార శైలి,మాటతీరులో మార్పు రాలేదు. ఇలాగే ఉంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదు’అని మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. -
తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్లకు చూపిస్తా: కేసీఆర్
-
కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నాం. ఫామ్ హౌస్‌లోనే ఉండి మాట్లాడతారా.. లేదా అసెంబ్లీకి వస్తారా?’’ అంటూ ఎద్దేవా చేశారు.కేసీఆర్ ఇన్నాళ్లు అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: మల్లు రవికేసీఆర్ ఇన్నాళ్లు అసెంబ్లీకి ఎందుకు రాలేదంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కుంభకర్ణుడిలా ఏడాదిగా నిద్రపోతున్నారు. సోషల్ మీడియాలో మాతరమే బీఆర్ఎస్ పని చేస్తుంది. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఓటింగ్ చేసి.. జిమ్మిక్కులు చేసింది. మేము ప్రజల్లో పనిచేస్తున్నాం. రెండు లక్షల రుణమాఫీ ఏడాది లోపలే చేశాం. మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశాం. కవిత వల్ల కేజ్రీవాల్ లాంటి వారే జైలుకు పోయారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
నేను కొడితే మాములుగా ఉండదు : కేసీఆర్
సాక్షి,హైదరాబాద్ : సుదీర్ఘ కాలం తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ( kcr) మౌనం వీడారు. ‘నేను కొడితే మాములుగా ఉండదు’ అంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ (congress party) పాలనపై నిప్పులు చెరిగారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో జహీరాబాద్ బీఆర్ఎస్ (brs) కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ నెల 27న జహీరాబాద్ నుంచి పాదయాత్రగా ఇవాళ ఎర్రవల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులుగా నేను మౌనంగా ఉన్నా.. గంభీరంగా చూస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలు వంచుతా. కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారు. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కు ఓటేశారు. 👉చదవండి : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్నిన్న కాంగ్రెస్ వాళ్లు ఓటింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చింది. నేను చెప్పినా వినలేదు. అత్యాసకు పోయి కాంగ్రెస్‌కు ఓటేశారు. మన విజయం తెలంగాణ విజయం కావాలి. భూముల ధరలు అమాంతం పడిపోయాయి. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి. ఫిబ్రవరి నెలాఖరును భారీ బహిరంగ సభ పెడుతున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. ఓట్ల కోట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంటుంది. సంగమేశ్వ, బసవేశ్వర టెండర్లను ఎందుకు పిలవలేదు. కాంగ్రెస్‌పై అంతటా అసంతృప్తే. అన్ని వర్గాలను కాంగ్రెస్ ముంచేసింది. పాలన వైఫల్యాలను ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారు.రైతుబంధుకి రాంరాం, దళితబంధుకు జైభీం చెబుతారని ఆనాడే చెప్పా. అన్నీ మబ్బులు తొలగి పోయి అన్నీ బయటకు వస్తున్నాయి. మంచేదో చెడేదో ప్రజలకు తెలుస్తోంది. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కు ఓటేశారు. రాబోయే రోజుల్లో విజయం మనదే. మనం విజయం తెలంగాణ విజయం కావాలి. కైలాసం ఆడితే పాము మింగినట్లుగా ఉంది పరిస్థితి. మాట్లాడితే ఫామ్ హౌస్.. ఫామ్ హౌస్ అని బద్నం చేస్తున్నారు. ఫామ్ హౌస్‌లో పంటలే ఉంటాయి కదా’ అని వ్యాఖ్యానించారు. -
2028లో కేసీఆరే ముఖ్యమంత్రి
తెలంగాణ భవన్: మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ ఆత్మీయ సత్కారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆరే’అని అన్నారు. శుక్రవారం కేటీఆర్ పదవీకాలం ముగిసిన మున్సిపల్ ఛైర్మన్ , వైస్ చైర్మన్ ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2028లో ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. కేసీఆరే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోని అన్నీ రాష్ట్రాల కంటే మన రాష్ట్ర మున్సిపాలిటీలను అభివృద్ది చేసుకున్నాం. బీఆర్ఎస్ హయంలో 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చాం. రూ. 700 కోట్లతో నల్లగొండను అభివృద్ది చేసుకున్నాం.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతుంది, 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గంలో మున్సిపల్ ఉద్యోగులకు 4 నెలలగా జీతాలు రావడం లేదు.సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్ జనరల్ స్థానంలో దళిత బిడ్డకు అవకాశం ఇచ్చాం. టకీ టకీమని డిల్లీలో పైసలు పడుతున్నాయి తప్పా..రైతుల అకౌంట్లలో మాత్రం పడడం లేదు. పదవి కాలం ముగిసిన మున్సిపల్ ఛైర్మన్ , వైస్ చైర్మన్లు ప్రజల్లోనే ఉంటే తిరిగి ప్రజలే గెలిపిస్తారు’ అని కేటీఆర్ దిశానిర్ధేశం చేశారు. -
రేవంత్.. నీళ్ల మీద నీచ రాజకీయాలు ఎందుకు?: కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని సూచనలు చేశారు. కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘నీళ్లు-నిజాలు’పై నేడు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నీటి రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..‘నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోంది. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని మేడిగడ్డ బ్యారేజీ నిలబడింది. కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం పూర్తి చేయాలి. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి.వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీని కేసీఆర్ కొనసాగించారు. కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కొనసాగిస్తోంది. అదే తరహాలో కేసీఆర్ ప్రారంభించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలి. రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్లా పనిచేస్తున్నారు. కేసీఆర్ శత్రువు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఆంధ్ర కేడర్‌లో పనిచేసిన ఆదిత్యా నాథ్ దాస్‌ను బాధ్యతల నుంచి తొలగించాలి. కృష్ణ ట్రిబ్యునల్‌లో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలి.కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారు. కోటి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను పూర్తి చేశాం. మిషన్ కాకతీయ ద్వారా నీటిని అందించడం జరిగింది. కేవలం చెరువులను బాగు చేసుకోవడం వల్ల 9.6 టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకున్నాం. తెలంగాణ ఏర్పడే సమయానికి 68 లక్షల టన్నుల వరి పండితే.. 2022-23 నాటికి కోటి 68 లక్షల టన్నుల ధాన్యం పండింది. గోదావరి, కృష్ణా జలాలను వినియోగంలోకి తెచ్చుకోడానికి కేసీఆర్ కష్టపడ్డారు. కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదీ. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు పనికిరావని దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలో పంటను ఎండగొట్టారు. బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా ఆ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు కూడా ఇవ్వలేదు’ అంటూ మండిపడ్డారు. -
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-
‘మండలి’ పోటీపై నేడోరేపో బీఆర్ఎస్ స్పష్టత
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో మూడు స్థానాల ఎన్నికలకు సంబంధించి షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో గురువారం భేటీ అయ్యారు. ఎర్రవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మండలి ఎన్నికల్లో పోటీ, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నా.. జ్వరం కారణంగా హాజరు కాలేదని తెలిసింది. మెదక్– కరీంనగర్– నిజామాబాద్– ఆదిలాబాద్, వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై పార్టీ పరంగా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎవరికైనా అధికారికంగా మద్దతు ఇవ్వాలా? లేక తటస్థంగా ఉండాలా? అనే అంశంపై ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. పట్టభద్రుల కోటాలో ‘మెదక్– కరీంనగర్– నిజామాబాద్– ఆదిలాబాద్’స్థానం నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్న విషయం ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ఆశావహులు కూడా పార్టీ వైఖరిపై స్పష్టత ఇవ్వాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో కేటీఆర్ దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ.. స్థానిక ఎన్నికలు ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలుచేయాలన్న డిమాండ్‌తో ఫిబ్రవరి 7న ఎంఆర్పీఎస్ నిర్వహించనున్న బహిరంగ సభపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తీర్మానానికి అనుగుణంగా ముందుకు సాగాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నివాసంలో జరిగిన పార్టీ మాదిగ సామాజికవర్గం నేతల భేటీలో చర్చించిన అంశాలను కేసీఆర్‌కు కేటీఆర్ వివరించారు. ఉద్యోగాలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వం ముందు పెట్టాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ పరంగా సన్నద్ధతను వేగవంతం చేయాలని కేసీఆర్ సూచించారు. నేడు మున్సిపల్ మాజీ చైర్మన్ల ఆత్మీయ సమావేశం ఇటీవల పదవీకాలం ముగిసిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు శుక్రవారం తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆత్మీయ భేటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీమంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథులుగా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్
-
మాజీ సీఎం KCR ఇంట్లో విషాదం
-
మన్మనితోని మొక్క నాటిచ్చిన కేసీఆర్
-
మరిన్ని పిచ్చి కేసులతో వేధిస్తారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పసలేని కేసులు నమోదు చేసి, పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేసినా ప్రజా సమస్యలను ఎత్తి చూపడంపైనే దృష్టి కేంద్రీకరించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలను ఆదేశించారు. ‘ఫార్ములా ఈ– రేస్’కేసులో ఏసీబీ విచారణకు హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. గురువారం ఏసీబీ విచారణ అనంతరం నందినగర్ నివాసానికి వెళ్లిన కేటీఆర్, శుక్రవారం తన భార్యతో కలసి ఎర్రవల్లి నివాసానికి వెళ్లారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మరో నేత కార్తీక్‌రెడ్డి కూడా కేసీఆర్‌తో జరిగిన ఈ భేటీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏసీబీ విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలు, తాను ఇచ్చిన సమాధానాలు, సమర్పించిన పత్రాలు.. తదితర అంశాలను ఈ సమావేశంలో కేటీఆర్ వివరించారు. ఇదిలా ఉండగా, ‘రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని పిచ్చి కేసులతో పార్టీ నేతలను ప్రభుత్వం వేధిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని రేవంత్ పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక గందరగోళం సృష్టించి స్థానిక సంస్థల గండం నుంచి బయట పడేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా జనంతో ఉంటే వారే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు’అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.ఏడాదిలోనే కాంగ్రెస్ తేలిపోయింది‘అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే కాంగ్రెస్ ప్రభుత్వం తేలిపోయింది. ఉన్న పథకాలు అమలు చేయలేక, కొత్త పథకాలు తెచ్చే తెలివిలేక ప్రభుత్వం చేతులెత్తేసింది’అని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. ఎన్నికల హామీలేవీ అమలు చేసే పరిస్థితి లేదని ప్రజలకు అర్థమైందని, గతంలో మనం చేసిన మంచితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చెడును కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీఆర్ఎస్పై ఉందని ఆయన అన్నట్లు్ల సమాచారం. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన రీతిలో పనిచేస్తే ఫలితాలు మనకే అనుకూలంగా ఉంటాయి. పండుగ తర్వాత దృష్టి అంతా పార్టీ నిర్మాణం, బలోపేతంపైనే ఉంటుంది’అని కేసీఆర్ పేర్కొన్నారు. -
కేసీఆర్ .. మీకు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు?
సాక్షి,హైదరాబాద్ : రైతు భరోసా చెల్లింపుల కోసం భూముల్ని తాకట్టుపెట్టి వేలకోట్లు అప్పుగా తెచ్చారు. మరి వచ్చే దఫా రైతు భరోసా సొమ్ము కోసం మీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఇంకేం మిగిలిందని కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నలు సంధించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.‘ఇంకెన్నాళ్లీ డైవర్షన్ పోలిటిక్స్. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ గురువు కేసీఆర్ (kcr).ఆయన బాటలోనే రేవంత్ (revanth reddy) ప్రభుత్వం నడుస్తోంది.ఒక్కో రైతుకు ఏడాది బకాయితో కలిసి ఎకరాకు రూ.18 వేల బకాయి చెల్లిస్తారా?.70 లక్షల మంది రైతులకు రూ.12 వేల 600 కోట్లు జనవరి 26న చెల్లిస్తారా? లేదా?.రైతు భరోసా (rythu bharosa) సొమ్ము చెల్లించేందుకు టీఎస్ఐఐసీ భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చారు? మరి వచ్చే దఫా రైతు భరోసా సొమ్ము కోసం మీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఇంకేం మిగిలింది?లోకల్ బాడీ ఎలక్షన్లలో ఓట్లేయించుకునేందుకే అప్పు తెచ్చి రైతు భరోసా చెల్లిస్తున్నారు. ఎన్నికల తర్వాత రైతు భరోసా ఆపేయడం ఖాయం.తెలంగాణ ప్రజాలారా..కాంగ్రెస్ మోసాలను తెలుసుకోండి.ఫాంహౌజ్‌లో పడుకునే కేసీఆర్..మీకు ప్రతిపక్ష నేత పదవి ఎందుకు?.ప్రజా సమస్యలపై స్పందించని మీరే ప్రతిపక్ష నేత? చేతనైతే ఆ పదవిని హరీష్, గంగుల, తలసాని, జగదీష్ రెడ్డిలలో ఎవరికైనా ఇచ్చే దమ్ముందా?.ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, పేదలు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి అంతు లేకుండా పోయింది’అని బండి సంజయ్ ఆరోపించారు. 👉ఇదీ చదవండి : ‘రేవంత్‌ను వదిలిపెట్టం’ -
ప్రమాణ పత్రాలు అడగడం సిగ్గుమాలిన చర్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రైతుబంధు పథకం అమలు చేయడం చేతకాకపోతే రైతుల కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు డిమాండ్ చేశారు. గతంలో వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనకు తలొగ్గి ఏడాది తర్వాత వెనక్కి తగ్గి ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారని ఆయన గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రైతులను రాజులుగా శాసించే స్థితికి తీసుకెళ్తే.. రేవంత్ ప్రభుత్వం మాత్రం వారిని యాచించే స్థాయికి దిగజారుస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరి పేయడమే లక్ష్యంగా రైతుబంధు పథకాన్ని బొందపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నేతలతో కలిసి కేటీఆర్ విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. ‘రైతు భరోసా కోరు కొనే రైతులు ప్రమాణ పత్రాలు ఇవ్వాలని చెప్పడం సిగ్గు మాలిన చర్య. ప్రభుత్వానికి దమ్ముంటే రైతు రుణమాఫీ, వరికి బోనస్, ధాన్యం కొనుగోలుకు డబ్బు చెల్లింపు, రైతు బంధు పథకంపై ఊరూరా ‘ఇమాన పత్రాలు’ ఇవ్వాలి. ఏడాది నుంచి గ్రామాలవారీగా ఎందరు కౌలు రైతులు, రైతు కూలీలకు లబ్ధి జరిగిందో జాబితాలు ప్రదర్శించాలి. రైతు బంధులో రూ. 22 వేల కోట్లు పక్కదారి పట్టినట్లు ఆరోప ణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఆ వివరాలు కూడా గ్రామాల వారీగా బయట పెట్టాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.దరఖాస్తులపై ప్రభుత్వాన్ని నిలదీయండి‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు తదితరాల కోసం అభయ హస్తం పేరిట 1.06 కోట్ల దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఇటీవల కులగణన పేరిట నిర్వహించిన ఇంటింటి సర్వేలోనూ రైతుల పూర్తి వివరాలు సేకరించింది. అలాంటప్పుడు రైతుల నుంచి మళ్లీ ప్రమాణ పత్రాలు కోరాలనే అలోచన దుర్మార్గం. గతంలో ఇచ్చిన దరఖాస్తులపై అధికారులను రైతులు నిలదీయాలి. పత్తి, కంది, చెరుకు, పసుపు, మిర్చితోపాటు ఇతర ఉద్యాన పంటలకు రైతుబంధు ఎగ్గొట్టే ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రమా ణ పత్రాలను తెరపైకి తెచ్చింది. క్రషర్లు, రియల్ ఎస్టేట్, వెంచర్లు, గుట్టలు, రాళ్లు రప్పలకు రైతుబంధు ఇచ్చారని ఆరోప ణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఊరూరా ఆ వివరాలు బయట పెట్టాలి. ఏడాది కాలంగా రైతుబంధు ఇవ్వకుండా ఎగవేసిన ప్రభుత్వం ఒక్కో రైతుకు ఎకరాకు రూ. 17 వేలు చొప్పున బకాయి పడింది. ఒక ఎకరా మొదలుకొని ఏడు ఎకరాల వరకు లెక్కతీసి రైతుబంధు రూపంలో రైతులకు రావాల్సిన బకాయిలపై గ్రామ గ్రామాన పోస్టర్లు వేస్తాం. రైతుభరోసాలో కోతలు విధిస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా రైతులతో కలిసి ఉద్యమిస్తాం’అని కేటీఆర్ హెచ్చరించారు. తమ హయాంలో రైతుల నుంచి ఎలాంటి దరఖాస్తులు తీసుకోకుండా, ఆఫీసుల చుట్టూ వారు తిరిగే అవసరం లేకుండా 11 సీజన్లలో రూ. 73 వేల కోట్లను రైతుల ఖాతాలో వేశామన్నారు. -
కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాది 2025 వేళ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రతీ ఒక్కరి జీవితంలోనూ శుభ సంతోషాలు నింపాలని, మంచి జరగాలని కోరుకుంటున్నట్టు కోరుకుంటున్నట్టు నాయకులు తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా.. నవ వసంతంలో…విశ్వ వేదిక పై…విజయ గీతికగా…తెలంగాణ…స్థానం… ప్రస్థానం ఉండాలని…ప్రతి ఒక్కరి జీవితంలో…ఈ నూతన సంవత్సరం…శుభ సంతోషాలను నింపాలని…మనసారా కోరుకుంటూ…అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నవ వసంతంలో…విశ్వ వేదిక పై…విజయ గీతికగా…తెలంగాణ…స్థానం… ప్రస్థానం ఉండాలని…ప్రతి ఒక్కరి జీవితంలో…ఈ నూతన సంవత్సరం…శుభ సంతోషాలను నింపాలని…మనసారా కోరుకుంటూ…అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. #HappyNewYear2025 #HappyNewYear— Revanth Reddy (@revanth_anumula) January 1, 2025నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కేసీఆర్..‘2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులను, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావహ దృక్పథంతో తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని అన్నారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కేసీఆర్ సూచించారు. -
KTR: కేసులకు భయపడేదే లేదు
సాక్షి, తెలంగాణ భవన్: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో విచారణకు రావాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ తరుణంలో కేసులకు భయపడేది లేదంటూ ఫార్ములా ఈ-కారు రేసింగ్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ క్యాడర్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కనిపిస్తోంది. కేసులకు భయపడేది లేదు. ఏసీబీ కేసులో బలం లేదని రేవంత్‌కు కూడా తెలుసు. నేను మాట మార్చలేదు.. చెప్పినదానికే కట్టుబడి ఉన్నా.ఈ కార్ రేసుకు మంత్రి హోదాలో నేనే డబ్బులు కట్టమన్నా. ప్రొసీజర్ ప్రకారం జరగకపోతే .. ఈసీ,ఆర్బీఐ దగ్గరకు ప్రభుత్వం ఎందుకు పోలేదు?.డబ్బులు ముట్టిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు?’అని ప్రశ్నించారు. ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్‌కు తెలుసుఎప్పుడు బయటకు రావాలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలుసు. 24ఏళ్ళు కేసీఆర్ కష్టపడ్డారు. కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు. తెలంగాణ బిడ్డ పీవీపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుంది. ఢిల్లీలో పీవీకి మెమోరియల్ కట్టాలని అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయరు? మరణంలో కూడా పీవీని కాంగ్రెస్ గౌరవించలేదు. పీవీకి గౌరవం దక్కేవరకు రాజ్యసభలో బీఆర్ఎస్ కొట్లాడుతుంది. రేవంత్‌కు బీజేపీ ఎంపీలు రక్షణ కవచంగా మారారు. అమృత్, సివిల్ సప్లై స్కాంలో కేంద్రం ఎందుకు విచారణ జరపదు. రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలకు కేంద్రం సహకరిస్తుంది. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగత కమిటీ వేస్తాం. లోకల్ బాడీస్‌లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తాం’అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కీలక పరిణామంతెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-కారు రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్‌కు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో జనవరి ఏడో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈడీ.. కేటీఆర్ సహా అరవింద్ కుమార్‌కు సైతం నోటీసులు ఇచ్చింది.వివరాల ప్రకారం.. ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి తాజాగా కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ సందర్భంగా వచ్చే నెల ఏడో తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసును ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ జరుపుతోంది. ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. FEOకు 55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కారు రేస్ కేటీఆర్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న కేటీఆర్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్‌ను ఈనెల 30 వరకు ఆరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌లకు నోటీసులు జారీ చేసింది. -
ఓటీటీకి కేసీఆర్ సినిమా.. ట్రైలర్ చూశారా?
కమెడియన్‌గా రాకింగ్ రాకేశ్(Rocking Rakesh) హీరోగా నటించి నిర్మించిన సినిమా కేసీఆర్ (KCR Movie). గతనెల 22న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కేసీఆర్ అలియాస్ 'కేశవ చంద్ర రమావత్' సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన పరిణామాలకు ఓ లంబాడీ యువకుడి జీవిత ప్రయాణాన్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. నటి సత్య కృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ (Ananya Krishnan) ఈ చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ తేదీని ప్రకటించిన మేకర్స్.. తాజాగా ఓటీటీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.అసలు కథేంటంటే..'కేసీఆర్' కథ విషయానికొస్తే.. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న రోజుల్లో కేసీఆర్ ప్రసంగాలు విని అతడికి అభిమాని అవుతాడు కేశవ చంద్ర రమావత్ (రాకింగ్ రాకేష్). ఊరివాళ్లంతా కేశవ చంద్రరమావత్‌ను కేసీఆర్ అని పిలుస్తుంటారు. కేశవను అతడి మరదలు మంజు (అనన్య కృష్ణన్) ఇష్టపడుతుంది. బావనే పెళ్లిచేసుకోవాలని కలలు కంటుంది. మరదల్ని కాదని కేశవ చంద్ర రమావత్ బాగా డబ్బున్న అమ్మాయితో పెళ్లికి సిద్ధపడతాడు.తన పెళ్లి అభిమాన నాయకుడు కేసీఆర్ చేతుల మీదుగా జరగాలని కేశవ చంద్ర కలలు కంటాడు. కేసీఆర్‌ను కలవడం కోసం హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత ఏమైంది? కేశవ చంద్ర రమావత్.. కేసీఆర్‌ను కలిశాడా? తమ ఊరికి ఎదురైన రింగ్ రోడ్ సమస్యని ఇతడు ఎలా పరిష్కరించాడు? మరదలి ప్రేమను అర్థం చేసుకున్నాడా అనేదే మూవీ స్టోరీ. -
ఓటీటీలోకి 'కేసీఆర్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'జబర్దస్త్' షోతో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేశ్ (Jabardasth Rakesh).. హీరోగా నటించిన నిర్మించిన సినిమా కేసీఆర్ (KCR Movie). గతనెల 22న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది గానీ అదే టైంలో మరికొన్ని మూవీస్ రిలీజ్ కావడంతో ఇది పెద్దగా జనాలకు రీచ్ కాలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అధికారిక పోస్టర్ కూడా విడుదల చేశారు.కేసీఆర్ అలియాస్ 'కేశవ చంద్ర రమావత్' సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన పరిణామాలకు ఓ లంబాడీ యువకుడి జీవిత ప్రయాణాన్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. నటి సత్య కృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ (Ananya Krishnan).. ఈ చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)నవంబర్ 22న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. డిసెంబర్ 28 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 'కేసీఆర్' విషయానికొస్తే.. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న రోజుల్లో కేసీఆర్ ప్రసంగాలు విని అతడికి అభిమాని అవుతాడు కేశవ చంద్ర రమావత్ (రాకింగ్ రాకేష్). ఊరివాళ్లంతా కేశవ చంద్రరమావత్‌ను కేసీఆర్ అని పిలుస్తుంటారు. కేశవను అతడి మరదలు మంజు (అనన్య కృష్ణన్) ఇష్టపడుతుంది. బావనే పెళ్లిచేసుకోవాలని కలలు కంటుంది. మరదల్ని కాదని కేశవ చంద్ర రమావత్ బాగా డబ్బున్న అమ్మాయితో పెళ్లికి సిద్ధపడతాడు.తన పెళ్లి అభిమాన నాయకుడు కేసీఆర్ చేతుల మీదుగా జరగాలని కేశవ చంద్ర కలలు కంటాడు. కేసీఆర్‌ను కలవడం కోసం హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత ఏమైంది? కేశవ చంద్ర రమావత్.. కేసీఆర్‌ను కలిశాడా? తమ ఊరికి ఎదురైన రింగ్ రోడ్ సమస్యని ఇతడు ఎలా పరిష్కరించాడు? మరదలి ప్రేమను అర్థం చేసుకున్నాడా అనేదే మూవీ స్టోరీ.(ఇదీ చదవండి: ఎదురుపడ్డ మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య.. అక్కడే ఉన్నా గానీ!) -
కేసీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్(kcr), మాజీ మంత్రి హరీశ్‌రావు(HarishRao)కు తెలంగాణ హైకోర్టులో మంగళవారం(డిసెంబర్24) ఊరట లభించింది. మేడిగడ్డ ప్రాజెక్టు పై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ అంశంలో తదుపరి విచారణను జనవరి ఏడో తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, మేడిగడ్డ(Medigadda) బ్యారేజీలో పగుళ్లకు కేసీఆర్,హరీశ్‌రావే కారణమని భూపాలపల్లి కోర్టు(Bhupalapalli Court)లో స్థానిక న్యాయవాది ఒకరు గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన భూపాలపల్లి సివిల్ కోర్టు కేసీఆర్,హరీశ్‌రావులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను క్వాష్ చేయాల్సిందిగా కేసీఆర్,హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు భూపాలపల్లి కోర్టు నోటీసులపై కేసీఆర్,హరీశ్‌రావులకు ఊరటనిచ్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారునికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.