సింపుల్ యాదవ్
మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన పెద్దమనిషికి కోడలు.
ఒక ముఖ్యమంత్రికి భార్య... ఒక నియోజకవర్గానికి ఎం.పి.
ముగ్గురు పిల్లలకు తల్లి... ఇద్దరు అత్తలకు కోడలు.
పొలిటికల్ యాంబిషన్ ఉన్న ఒక డైనమిక్ వ్యక్తికి తోడికోడలు.
ఇక సింపుల్ ఏముందీ?! అంతా కాంప్లెక్స్!
ఈ అమ్మాయికి రాజకీయాలు వద్దన్నవాళ్లు ఉన్నారు.
ఈ అమ్మాయి భర్త చేస్తున్నది తప్పన్నవాళ్లూ ఉన్నారు.
ఈమెకూ రాజకీయాలు ఇష్టం లేదు! అబ్బో చాలా కాంప్లెక్స్.
అయినా... ‘బహూ’ డింపుల్... బహుత్ సింపుల్.
కోడలు డింపుల్... చాలా సింపుల్.
‘‘డింపుల్‌ని పెళ్లి చేసుకున్నాక నాకు అదృష్టం కలసొచ్చింది!’’
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చాలా సందర్భాలలో చెప్పిన మాట ఇది. అఖిలేశ్‌ను ఆయన భార్య డింపుల్ ముద్దుగా ఎ.డి. అని పిలుస్తారు. అంటే.. అఖిలేశ్ దాదా! అయితే డింపుల్, అఖిలేశ్ భార్యాభర్తలు కావడం, ఆమె రూపంలో అతడి అదృష్టం కలసి రావడం అంత తేలిగ్గా ఏమీ జరగలేదు. వారి కులాలు వేరు. ఆమె డింపుల్ రావత్. అతడు అఖిలేశ్ యాదవ్.
కళ్లు కళ్లు కలుసుకున్నాయి
1995. అఖిలేశ్ మైసూరులో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు. అప్పుడు అతడి వయసు 23. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మెరైన్ ఇంజనీరింగ్ చదవాలన్న తలంపుతో ఉన్నాడు. అప్పుడే మిత్రులు లక్నోలో ఇచ్చిన ఒక విందుకు హాజరయ్యాడు. అక్కడ తొలిసారి డింపుల్‌ని చూశాడు. అప్పటికి ఆమె వయసు 17. అందంగా ఉంది. సైన్యంలో పదవీ విరమణ చేసిన కల్నల్ ఆర్‌సీఎస్ రావత్ కూతురామె. ఆ విందులో అఖిలేశ్, డింపుల్‌ల మనసులు కలవలేదు కానీ, మాటలు బాగా కలిశాయి. మనసులు దగ్గరయ్యాక మాత్రం వాళ్లిద్దరూ పెద్దలకి భయపడ్డారు. అందుకు నిదర్శనం ఇంట్లో వాళ్లకి తెలియకుండా లేఖలు రాసుకోవడమే. ఇద్దరి దగ్గరా సెల్‌ఫోన్లు లేవు. ల్యాండ్‌లైన్‌కి చేస్తే కొంపలు మునుగుతాయి. అందుకే ఉత్తరాలని ఆశ్రయించాడు అఖిలేశ్. అతడు లక్నోలోని ఒక మిత్రుడి చిరునామాకు రాసేవాడు. వాటిని డింపుల్ వచ్చి పట్టుకెళ్లేది.
ములాయం ‘నో’ చెప్పేశారు!
అఖిలేశ్ ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చాడు. డింపుల్ లక్నో విశ్వవిద్యాలయంలో కామర్స్ డిగ్రీ చేస్తోంది. పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి. అంటే తమ ప్రేమని బహిర్గతం చేసే పని. అఖిలేశ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ పరిచయం అక్కరలేదు. రావత్ పరిచయానికి ప్రాధాన్యం లేదు. ములాయం మూడుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్రంలో రక్షణ శాఖను నిర్వహించారు. అంటే కల్నల్ రావత్‌కి పరోక్షంగా బాస్. ఈ పెళ్లి గురించి చెప్పగానే ములాయం మరోమాట లేకుండా కుదరదని చెప్పేశారు. ములాయం పెద్ద రాజకీయవేత్త. అతడికో వారసుడు అవసరం. ‘ఎంవై’ అనే సామాజిక సమీకరణే ములాయం బలమని దేశమంతటికీ తెలుసు. ‘ఎం’ అంటే ముస్లిం, ‘వై’ అంటే యాదవ్. అలాంటిది ములాయం ఒక యాదవేతర కులం నుంచి కోడల్ని తెచ్చుకుంటే? అది పార్టీకే నష్టం. అందుకే ‘నో’ అన్నారు.
అమర్‌సింగ్ ఒప్పించాడు!
ములాయం సింగ్ మాత్రమే కాదు, డింపుల్ కుటుంబం కూడా ఈ పెళ్లికి ససేమిరా అంది. అప్పుడు రంగంలోకి దిగాడు అమర్‌సింగ్. ములాయంకి అత్యంత ఆప్తుడు. ఆ రెండు కుటుంబాలను ఒప్పించి అఖిలేశ్, డింపుల్‌ల వివాహం సాధ్యమయ్యేలా చేసింది అమర్‌సింగే. 1999 నవంబర్ 24న అఖిలేశ్ డింపుల్ పెళ్లి జరిగింది. అమితాబ్ బచ్చన్, రాజేశ్‌ఖన్నాలతో పాటు ఎందరో రాజకీయ నాయకులు హాజరైన ఆ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. మొదట రాజకీయాలలోకి వెళ్లకూడదనే అనుకున్నా తండ్రి నుంచి సంక్రమించిన రాజకీయాలు, లోహియా భావాలు అఖిలేశ్‌ను మొదట ఎంపీగా, తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాయి. భర్త వెంట డింపుల్ కూడా నడవకతప్పలేదు. ‘‘ఆయన అర్థం చేసుకునే మనిషి. నేను సర్దుపోయే మనస్తత్వం ఉన్నదానిని’’ అని చెప్పారు డింపుల్.. యంగ్ ఫిక్కీ లేడీస్ సంస్థ ఏర్పాటు చేసిన ఒక సభ (2012)లో. అప్పటికే ఆమె కనౌజ్ ఎంపీ.
మౌనం.. మహిళాశక్తికి ఒక రూపం!
డింపుల్ చాలా తక్కువగా మాట్లాడతారు. నిజానికి ఆమె అంతర్ముఖి. బొమ్మలేయడం, గుర్రపుస్వారీ ఆమె అభిరుచులు. ఇంతకీ ఆ రోజు సభలో ఆమె చెప్పిన మాట, డింపుల్‌కి కూడా రాజకీయాలు అబ్బుతున్న సంగతిని రూఢీ చేస్తాయి. ‘ఏ మహిళ మౌనాన్నయినా, అదొక బలహీనతగా తీసుకోవద్దు. హుందాతనానికీ, శక్తికీ ఆ మౌనం ఒక ప్రతీక మాత్రమే. మేం తల్లులం. ఇల్లూ చక్కబెట్టగలం. దేశాన్నీ తీర్చిదిద్దగలం’ అన్నది ఆ సర్దుకుపోవడం అన్న మాట లోని పరమార్థం. ఆమె ఎం.పి., భర్త ముఖ్యమంత్రి. అత్తగారు, తోటికోడలు రాజకీయంగా పెద్ద ఆశలతో ఉన్నారు. ఆ ఆశలు నెరవేడమనేది సాక్షాత్తు తన భర్త పదవీచ్యుతి మీద ఆధారపడి ఉంది ఇప్పుడు. వీటన్నిటితో పాటు పిల్లల ఆలనాపాలనా చూడాలి. అదితి (10), అర్జున్ (6), టీనా (6).. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ఇందులో అర్జున్, టీనా కవలలు.
ఈమె చిరుజల్లు... ఆమె జడివాన!
ముభావంగా ఉండే డింపుల్‌కు తోటికోడలుగా వచ్చిన యువతి అపర్ణ. చాలా కలుపుగోలుతనం ఉన్న అమ్మాయి. అపర్ణ తండ్రి అరవింద్ సింగ్ బిస్త్. టైమ్స్ ఆఫ్ ఇండియా లక్నో ఎడిషన్ ఎడిటర్. రాష్ట్ర సమాచార కమిషనర్‌గా కూడా పనిచేశారు. కాబట్టే రాజకీయ నాయకులు, సమాజంలో పెద్ద వ్యక్తులతో మంచి పరిచయాలు ఉన్నాయి. అపర్ణ చొరవ ఎంతవరకు వెళ్లిందంటే, తన మామగారు ములాయం సింగ్ రాజకీయంగా తీవ్రంగా వ్యతిరేకించే నరేంద్ర మోదీతో కలసి ఆమె ఫొటో తీయించుకుంది. అపర్ణ మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో (ఇంగ్లండ్) అంతర్జాతీయ సంబంధాల కోర్సులో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసింది. అక్కడే లీడ్స్ విశ్వవిద్యాలయంలో మేనేజ్‌మెంట్ కోర్సు చదివేవాడు ములాయం రెండో కొడుకు ప్రతీక్. ఇద్దరూ ప్రేమించుకున్నారు.
మరిది పెళ్లికి సంప్రదాయ నృత్యం
ప్రతీక్, అపర్ణల పెళ్లికి మాత్రం ములాయం ఎలాంటి అడ్డంకి చెప్పలేదు. డింపుల్ కూడా అన్నీ తానై చూసుకుంది. ఉత్తరాది సంప్రదాయం ప్రకారం మరిది పెళ్లిలో అందరితో కలసి నృత్యం కూడా చేసింది. 2012లో అఖిలేశ్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక ఇంటెలిజెన్స్ అధికారి ములాయం అంతఃపుర రాజకీయాల గురించి ఒక మాట బయటపెట్టాడు. అది డింపుల్ దాకా రాకుండా ఉంటుందా? నిజానికి ఇంట్లో ఏదో కుట్ర జరుగుతోందంటూ మొదట అఖిలేశ్‌ను హెచ్చరించినది డింపులే కావడం విశేషం. వేరే చోట ఉంటున్న తండ్రిని రోజూ ఒక్కసారైన అఖిలేశ్ పలకరించేవాడు. ఇది సరిపోదని భావించిన డింపుల్ ఏకంగా తమ బసనే ములాయం ఇంటి పక్కకు మార్పించారు. కానీ తండ్రీకొడుకుల మధ్య ఘర్షణను ఆమె నివారించలేకపోయారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ చీలిపోయినా ఆ నింద డింపుల్ మీద పడలేదంటేనే ఆమె సాత్విక సామర్థ్యం ఎంతో అర్థమవుతోంది.
ఇద్దరి అత్తల ముద్దుల కోడలు
ఆ ఇంటికి డింపుల్ పెద్ద కోడలు. అసలు అత్తగారు మాలతీదేవి. అంటే ములాయం మొదటి భార్య. మాలతీదేవి అచ్చమైన గృహిణి. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలతో ములాయం తలమునకలై ఉనప్పుడు కొడుకు బాధ్యత మొత్తం ఆమే తీసుకున్నారు. ములాయం జీవితంలోకి 1980లో మరో స్త్రీ ప్రవేశించింది. ఆమే సాధనా గుప్తా. సమాజ్‌వాదీ పార్టీలో చిన్న పదవిలో ఉండేవారామె. అందమైన స్త్రీ.. దీనితో ములాయం ఆమెకు దగ్గరయ్యాడు. సాధన ద్వారా ములాయం ప్రతీక్‌సింగ్ యాదవ్‌కు తండ్రయ్యాడు. కానీ కొడుకు పుట్టిన రెండు సంవత్సరాలకు గాని ములాయం సాధనతో తన వివాహం గురించి బయటపెట్టలేదు. అసలు ఆ పెళ్లి ఎప్పుడైందో కూడా ఎవరికీ తెలియదు. ప్రతీక్ 1988లో పుట్టాడు కాబట్టి, అంతకు ముందుటేడాదే పెళ్లి జరిగి ఉండవచ్చునని అంటారు. సాధన ప్రవేశంతో మాలతీదేవి భర్తకు పూర్తిగా దూరమైంది. దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లింది. 2003లో మరణించింది. డింపుల్ ప్రాణ స్నేహితురాలు సాక్షి ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ్య ప్రకారం పెద్దత్తతో ఉన్నంతగానే, చిన్నత్త సాధనాగుప్తాతో కూడా డింపుల్ చాలా సన్నిహితంగా ఉంటారు.
అఖిలేశ్... డింపుల్... కనౌజ్
కనౌజ్.. గులాబీ అత్తరుకు ప్రసిద్ధి. ఆ లోక్‌సభ నియోజకవర్గానికి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు డింపుల్. అదొక చరిత్ర. నిజానికి డింపుల్, అఖిలేశ్, ములాయంల మధ్య జరిగిన ఘర్షణకీ, కనౌజ్ మధుర గాధలకీ సన్నిహిత సంబంధం కనిపిస్తుంది. డింపుల్‌ను అక్కడ నుంచి పోటీ చేయించి తండ్రికి దీటైన సమాధానం చెప్పాడా అఖిలేశ్ అనిపిస్తుంది. లక్నోకు 115 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కనౌజ్. అక్కడి జనాభాలో 83 శాతం రైతులే. వారిలో ఎక్కువ మంది పూల సాగు చేసేవారే. మొగలాయిల కాలంలో అత్తరుకు ప్రసిద్ధికెక్కితే, అంతకు ఎంతో ముందే గొప్ప చరిత్రాత్మక ప్రేమఘట్టానికి వేదికగా కనిపిస్తుంది. కనౌజ్ పాలకుడు జయచంద్రుడు. ఆయన కుమార్తె రాణీ సంయుక్త. తను వలచిన పృథ్వీరాజ్‌తో ఆ సౌందర్యరాశి ఢిల్లీ వెళ్లిపోతుంది.
‘‘జహంగీర్ నా తండ్రి’’ అని రాశాడు జహంగీర్. ఇక్కడ జహంగీర్ అంటే ఒక రకం అత్తరు. అతడి భార్య నూర్జహాన్ ప్రోద్బలంతో అక్కడి నిపుణులు ఆనాడు తయారుచేసిన ఒక అత్తరుకు పాదుషా జహంగీర్ పేరే పెట్టారు. అది గులాబీల నుంచి తీస్తారు. ఆ అత్తరు ఆదమరచిన ఆత్మలకు సైతం కొత్త జీవాన్ని ఇస్తుంది.. అని కూడా రాశాడట జహంగీర్. కానీ తన ప్రేమ పరిమళాన్ని తండ్రి నషాళానికి అంటేటట్టు చేశాడు అఖిలేశ్. ములాయం తమ వివాహానికి అంగీకరించకపోతే, అఖిలేశ్ తన మామ్మను ఆశ్రయించాడు. మొదట ఆమె ములాయంను కొంత లొంగదీసింది. తరువాత అమర్‌సింగ్ వచ్చాడు.
మామకు ఇష్టం లేకుండా రాజకీయాల్లోకి!
కోడలు రాజకీయాలలోకి రావడం కూడా ములాయంకు మొదట ఇష్టం లేదు. 2009లో ఫిరోజాబాద్, కనౌజ్ లోక్‌సభ స్థానాలకు పోటీ చేసిన అఖిలేశ్ కనౌజ్ స్థానానికి ప్రాతినిధ్యం వహించి, ఫిరోజాబాద్ స్థానానికి రాజీనామా చేశారు. ఈ స్థానం నుంచి డింపుల్‌ను పోటీ చేయించాలని అఖిలేశ్ కోరిక. అన్య మనస్కంగానే ములాయం అభ్యర్థిత్వం ఇచ్చాడు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రఖ్యాత సినీనటుడు రాజ్ బబ్బర్ పోటీ చేశారు. గెలిచారు. తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి 2012లో అఖిలేశ్ కనౌజ్ స్థానానికి రాజీనామా చేశారు. ఈసారి తన అదృష్టాన్ని కనౌజ్ నుంచి పరీక్షించుకునే అవకాశం డింపుల్‌కు వచ్చింది. మిగిలిన పార్టీల వారు వివిధ కారణాల నామినేషన్లు వేయలేదు. దాంతో ఆమె ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మళ్లీ 2014లో మోదీ హవా మధ్య కూడా ఆమె అక్కడ నుంచే ఎన్నికయ్యారు.
తాజ్ మహల్... డింపుల్ కపుల్
ఉత్తరప్రదేశ్‌లోనే ఆగ్రా ఉంది. అక్కడే ఉంది గొప్ప ప్రేమ చిహ్నం తాజ్ మహల్. 2015లో అక్కడ లవర్స్ బెంచ్‌ని ఏర్పాటు చేశారు. దీనిని ప్రారంభించిన వారు ఎవరో కాదు అఖిలేశ్, డింపుల్ దంపతులే. ఆ సంవత్సరం వాలెంటైన్స్ డే సందర్భంగా ఆ ఇద్దరు అక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరు ఎంతెంత రాజకీయం చేసినా, ఎన్నెన్ని ఎత్తులు వేసినా, ఎంత ఉద్రిక్తత తలెత్తినా.. వీటి మధ్య కూడా డింపుల్, అఖిలేశ్ ప్రేమానుబంధాన్ని సడలనీయకుండా కాపాడుకుంటున్నారు.
– గోపరాజు నారాయణరావు