ఇంగ్లిష్ పాఠకులకు తెలిసిన తెలుగు రచయిత ఎవరు? | Telugu author, who is known to English readers? | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్ పాఠకులకు తెలిసిన తెలుగు రచయిత ఎవరు?

Published Fri, Sep 12 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

ఇంగ్లిష్ పాఠకులకు తెలిసిన తెలుగు రచయిత ఎవరు?

ఇంగ్లిష్ పాఠకులకు తెలిసిన తెలుగు రచయిత ఎవరు?

అనంతమూర్తి సంస్మరణ సభలో ఒక ప్రశ్న!
 
ఉడిపి రాజగోపాలాచార్య అనంతమూర్తి (యుఆర్) సంస్మరణ సభ సందర్భంగా ఆయనపై ప్రఖ్యాత దర్శకుడు గిరీష్ కాసరవెల్లి ఫిలింస్ డివిజన్ కోసం రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని లామకాన్‌లో ఇటీవల ప్రదర్శించారు.  తీర్ధహళ్లిలో తన ఇంటి వసారా- ఇంటి పెరడు మధ్య వర్ధిల్లిన రెండు ప్రపంచాలను రెండిటి సమన్వయంతో ‘మధ్యే’మార్గంగా తన ఎదుగుదలను అనంతమూర్తి ఈ చిత్రంలో ఆసక్తికరంగా వివరించారు. ఫ్రంట్ యార్డ్ (వసారా)లో గతంలో సంస్కృతం, ఇప్పుడు ఇంగ్లిష్ చర్చనీయాంశం. బ్యాక్‌యార్డ్ (మహిళల నెలవు)లో గతంలో దేశీ రామాయణ, భాగవతాలు, ప్రస్తుతం కన్నడ యక్షగానాలూ! ఈ రెండూ తన ఇంట్లోనే కాదు భారతీయ సాహిత్యంలోనూ సమాంతరంగా ప్రవహిస్తున్నాయని అనంతమూర్తి వివరించారు.

డాక్యుమెంటరీ అనంతరం ఇఫ్లూ ప్రొఫెసర్ తారకేశ్వర్, ప్రముఖ సాహితీవేత్త వాడ్రేవు చినవీరభద్రుడు అనంతమూర్తి రచనలను, మేధోజీవితాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘సంస్కార’ నవలాకారునిగా కంటే మేధోజీవిగా అనంతమూర్తి గొప్పవాడని వాడ్రేవు వ్యాఖ్యానించారు. కన్నడిగులు ఎక్కువమంది హాజరైన సమావేశంలో ఈ వ్యాఖ్య చిన్న కదలికను సృష్టించింది. తన ఉద్దేశంలో ‘సంస్కార’ గొప్పది కాదని కానేకాదని అంతకంటే ఏ మాత్రం తక్కువ కాని కాళీపట్నం రామారావు ‘యజ్ఞం’ తెలుగు సీమను దాటి వెళ్లలేదని అన్నారు. వెంటనే ఇందుకు కారణం ఎవరు? అనే ప్రశ్న వచ్చింది. ‘సంస్కార’ వలె ‘యజ్ఞం’ ఇంగ్లిష్ పాఠకులకు చేరకపోవడం అనే సమాధానం మరికొన్ని ప్రశ్నలకు తావిచ్చింది. ‘యజ్ఞం’ ఇంగ్లిష్‌లోకి ఎందుకు అనువాదం కాలేదు? కాస్సేపు మౌనం!
  అనంతమూర్తి చనిపోయిన రెండు మూడు రోజుల తర్వాత తాము కర్ణాటకలోని ఒక పల్లెలో పర్యటిస్తున్నామని, ఒక సాయంత్రం స్థానిక యక్షగాన సమాజం అనంతమూర్తి జీవితాన్ని ప్రదర్శిస్తోందని ఇఫ్లూలో ఫిలిం స్టడీస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న నిఖిల అన్నారు. అనంతమూర్తి చనిపోయిన తర్వాత సైతం అక్కడ ఇంటి ముంగిట (ఇంగ్లిష్)కు పెరడు (దేశీ)కు కనెక్టివిటీ ఉందని అన్నారు. ఇంగ్లిష్ ఆచార్యుడైనప్పటికీ తాను రాస్తోన్న జీవితం కన్నడిగులది కాబట్టి కన్నడలోనే అనంతమూర్తి రచనలు చేశారని, ఆయన సంస్కారను ఇంగ్లిష్‌లోకి అనువదించిన ఎ.కె.రామానుజన్ వలె తెలుగులో యజ్ఞాన్ని ఎవరైనా అనువదిస్తే బావుండేద న్నారు.
 ఆయుర్వేద పరిశోధకురాలు డా.సత్యలక్ష్మి ఇటీవలి తన అనుభవాన్ని వెల్లడించారు. కొందరు స్త్రీవాద కవయిత్రులు తమ కవిత్వాన్ని ఇంగ్లిష్ చేసేవారి పేర్లను సూచించమన్నారని, కన్నడ లేదా మరోభాషల కవులు సరైన అనువాదం చేయలేరని తెలుగులో అటువంటి వారిని గుర్తించవలసినదిగా సూచించానని తెలిపారు.

సినిమా విమర్శకుడు, పర్యావరణ చైతన్యశీలి విజేంద్ర మాట్లాడుతూ- ఆర్.కె.నారాయణ్ అనగానే మాల్గుడీ డేస్, గైడ్, స్వామి అండ్ ఫ్రెండ్స్ గుర్తొస్తాయి. ముల్కరాజ్ ఆనంద్ అన్‌టచబుల్స్ గుర్తొస్తుంది. ఎ.కె.రామానుజన్,  సాల్మన్ష్డ్రీ, అరుంధతీరాయ్, జంపాలహరి వలె ఇంగ్లిష్ పాఠకులకు తెలిసిన ఇంగ్లిష్‌లో రాసే తెలుగు రచయితలెవరు? అని ప్రశ్నించారు. ఇంగ్లిష్‌లో డాక్టరేట్లు చేసిన వారు, హెడాఫ్ ద డిపార్ట్‌మెంట్స్ అనువదించిన రచనలను మినహాయించాలని చమత్కరించారు!

 - పున్నా కృష్ణమూర్తి
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement