Big Question: ప్రాణాలు తీసిన ప్రభుత్వ నిర్లక్ష్యం
Breaking News
మంచు పులులు
Published on Thu, 01/09/2025 - 04:43
గడ్డ కట్టే మంచు, కోత పెట్టే చలి
పరీక్ష పెట్టే వాతావరణం
కాని తప్పని బతుకుపోరు...
కశ్మీర్‌లో పురుషులతో పాటు స్త్రీలూ శ్రమ చేసి సంపాదిస్తేనే ఇళ్లు గడుస్తాయి. దాల్ లేక్ వెంబడి వందలాది స్త్రీలు చిల్లర వస్తువులు అమ్ముతూ బతుకు ఈడుస్తారు. ప్రస్తుతం దాల్ లేక్ గడ్డ కట్టింది. ఆగక మంచుకురుస్తోంది. బిడ్డల ఆకలి తీర్చడానికి సరస్సు వొడ్డున మంచుపులుల్లా తల్లులు తమ కొట్లు తెరిచి నిలుచున్నారు. వారి బతుకు చిత్రం.
కశ్మీరీలు గిరిజనులే అయినా వారికి జ్ఞానం మెండు. ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడవ వారం నుంచి జనవరి మొదటి వారం వరకూ వచ్చే ‘చిలాయి కలాన్’ (భారీ మంచు)కు వారు సిద్ధమయ్యే వుంటారు. కాని ఈసారి చిలాయి కలాన్ గత 30 ఏళ్లలో లేనంత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకూ పడిపోయాయి. దాల్ లేక్ రాత్రిళ్లు పూర్తిగా గడ్డకట్టి మధ్యాహ్నానికి గాని కొద్దిగా పలుచబడదు. ఈలోపు ఎలా జీవించాలి?
‘ఇంట్లో పండిన కూరగాయలను ఉదయాన్నే తీసుకొని షికారా (చిన్న పడవ)లో బయలుదేరి దాల్ లేక్ ఒడ్డు మీదకు వచ్చి అంగడి తెరుస్తాను. దాల్ లేక్ గడ్డ కడితే షికారా కదలదు. ట్రాలీలు వెతుక్కుని రోడ్డు మార్గాన రావాలి. అసలే మంచుతో కరువు... ఇదో ఖర్చు’ అంటుంది ఒక కశ్మీరీ దుకాణం దారు.
శ్రీనగర్‌లో జనం రెండు విధాలుగా జీవిస్తారు. ఒక విధం దాల్ లేక్ చుట్టుపక్కల... మరో విధం మైదాన, ఎత్తయిన ఏరియాల్లో. దాల్ లేక్‌లో జీవించే వారికి హౌస్‌బోట్లు, విహార బోట్లు, రోడ్డు మీద చిల్లర అంగళ్లు... ఇవే ఆధారం. ‘మేము చాలామంది స్త్రీలము రోడ్డు మీద కూరగాయలు, పూలు, చేపలు, చిన్న చిన్న వస్తువులు అమ్ముతాం. నిజానికి మా అందరికీ ఈ పని చాలా కష్టం. కాని మా పిల్లలైనా బాగుపడాలని వేణ్ణీళ్లకు చన్నీళ్లుగా ఈ ప్రయత్నం చేస్తాం. ఇలా మా పూర్వికులు కూడా చేశారు. కాని బాగుపడిన వారు తక్కువ’ అంటారు వారు.
8 నుంచి 13 గంటలు...
కశ్మీర్ అంటే టూరిస్టులు. టూరిస్టులు వచ్చే వేసవి కాలంలో బేరాలు ఒక రకంగా ఉంటాయి. మంచు తీవ్రంగా కురిసే సమయంలో టూరిస్ట్‌లకు బ్రేక్ పడుతుంది. ఆ సమయంలో కూడా బతకడానికి దాల్ లేక్ ఒడ్డున అంగళ్లు తెరవక తప్పదు. ‘రోజూ తెల్లవారు జామునే వచ్చి సాయంత్రం వరకూ నిలబడతాము. 8 నుంచి 13 గంటలు రోడ్డు మీద ఉంటాము’ అని చె΄్తారు వీళ్లు.
‘నా కూతురు డాక్టర్ కావాలనుకుంటోంది. బాగా చదువుతోంది. దాని చదువు కోసం ఈ కష్టాన్ని మునిపంట నొక్కి చేస్తున్నాను’ అని ఒకావిడ చెప్పింది. దట్టమైన మంచు కురిసే సమయంలో వీరికి ఆస్పత్రి సౌకర్యం ఉండదు. ప్రసూతి అవసరాలకు ఆస్పత్రికి వెళ్లడానికి వీలు కానంతగా దార్లు మూసుకుపోతాయి. దాల్ లేక్ ఒడ్డున అమ్ముకునే స్త్రీలకు అవసరమైన టాయిలెట్లు కూడా ఉండవు. అయినా సరే వారు తమ కుటుంబాలు గడవడానికి మంచులో తడుస్తూనే ఉంటారు.
టార్పాలిన్ కట్టకూడదు!
దాల్ లేక్ ఒడ్డున రోడ్డు మీద వెళుతూ ఉంటే స్త్రీలు ఏ టార్పాలిన్ కట్టకుండా ఆకాశం కింద నిలబడి వస్తువులు అమ్ముతుంటారు స్త్రీలు. ‘మేము చలికి ఆగలేక, మంచు నుంచి రక్షించుకుందామని టార్పాలిన్లు కట్టుకుంటాం. కాని భద్రత దృష్ట్యా మునిసిపాలిటీ వాళ్లు, రక్షణ దళాలు వాటిని పీకేస్తాయి.
ఏ ఉగ్రవాదులో ఈ టార్పాలిన్ల దగ్గర చాటు తీసుకుంటారని వీరి భయం. కాని మా ్రపాణాల సంగతి?’ అని మరో మహిళ ప్రశ్నించింది. మంచుకు తడిసి, నీటికి నాని ఈ స్త్రీలకు ఎన్నో ఆరోగ్య సమస్యలు. కాని చిరునవ్వు చెరగనివ్వరు. టూరిస్ట్‌లతో స్నేహంగా మాట్లాడుతూ సంధ్య చీకట్లలో ఇళ్ల వైపుకు వెళ్లిపోతారు. ఈ స్త్రీల శ్రమకు విలువ కట్టే షరాబు ఉన్నాడా?
Tags