LIVE: తిరుపతి ఘటనపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్
Breaking News
ముక్కోటి ఏకాదశి విశిష్టత..! ఉత్తరద్వార దర్శనం అంటే..
Published on Thu, 01/09/2025 - 11:38
శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోడానికి వైకుంఠానికి తరలివెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadasi). పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుదర్శనం తర్వాత పూజచేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందంటారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ పర్వదినం గురించి..
ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సరిసమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.
ముక్కోటి ఏకాదశి నాడే పాలకడలి నుంచి అమృతం పుట్టిందంటారు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని కూడా భక్తుల విశ్వాసం. ముక్కోటి నాడు విష్ణుమూర్తిని నియమ నిష్ఠలతో పూజ చేసివారికి పుణ్యఫలముతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని, వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి.
ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణుపూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా.. ఓం నమోనారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు, వేంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. అటు తర్వాత జపం, ధ్యానం.
వైకుంఠ ఏకాదశి రోజున దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, ఆస్తికులు సముద్రాల్లోనూ, పుణ్యనదుల్లోనూ పవిత్ర స్నానం ఆచరించడమే కాకుండా, ఉపవాసాలు చేసి, జాగరణ ఉంటూ, నియమ నిష్ఠలతో పూజాదికాలు చేసి, తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 356 వైష్ణవ దేవాలయాల్లో దాదాపు ఒకే సమయంలో, ఒకే విధమైన పూజాదికాలు అత్యంత వైభవంగా జరగడం విశేషం.
తిరుమలలో వైకుంఠ ఏకాదశి
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర(Tirumala Venkateswara temples) స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠద్వారా ప్రవేశం, తదనంతరం దైవదర్శనం అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు.
పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఈ రెండు రోజులూ భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు.
శ్రీరంగంలో...
శ్రీరంగం లోని శ్రీ రంగనాథస్వామి దేవాలయం(Sri Ranganathaswamy)లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్ పట్టు (ఉదయం పూజ) అని రెండవ భాగాన్ని ఇర పట్టు (రాత్రి పూజ) అని పిలుస్తారు.
విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం.
(చదవండి: అనంతపద్మనాభ స్వామి ఆలయం..! కొండనే ఆలయాలుగా..)
Tags