మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
గెట్... సెట్... గో
Published on Fri, 02/07/2025 - 02:25
స్పోర్ట్స్ మూవీస్‌కి ఆడియన్స్‌లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ తరహా సినిమాలు ఏమాత్రం ఆడియన్స్‌కి కనెక్ట్ అయినా బాక్సాఫీస్ స్కోర్స్ (కలెక్షన్స్) కొత్త రికార్డులు సృష్టిస్తాయి. దీంతో వీలైనప్పుడల్లా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ చేస్తుంటారు యాక్టర్స్. ఇలా ప్రస్తుతం సెట్స్‌లో ‘గెట్..సెట్..గో’ అంటూ సిల్వర్ స్క్రీన్ కోసం స్పోర్ట్స్ ఆడుతున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం.
పెద్ది... ప్లే స్టార్ట్
‘రచ్చ, ఆరెంజ్’... ఇలా కొన్ని సినిమాల్లో రామ్‌చరణ్ క్రికెట్ ఆడిన సన్నివేశాలు చాలా తక్కువ నిడివిలో కనిపిస్తాయి. కానీ ‘పెద్ది’ సినిమాలో మాత్రం ఫుల్ మ్యాచ్ ఆడనున్నారట రామ్‌చరణ్. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్‌చరణ్ క్రికెటర్‌గా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. చివరి రోజు తన కుమార్తె క్లీంకారని సెట్స్‌కి తీసుకొచ్చారు రామ్‌చరణ్.
అలాగే ఈ సినిమాలో క్రికెట్‌తోపాటు కబడ్డీ వంటి ఇతర స్పోర్ట్స్‌ల ప్రస్తావన కూడా ఉంటుందట. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీలో దివ్యేందు, జగపతిబాబు, శివరాజ్‌కుమార్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్స్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీని ఈ దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
ఒక మ్యాచ్.... మూడు జీవితాలు!
మాధవన్ , నయనతార, సిద్ధార్థ్ లీడ్ రోల్స్‌లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘టెస్ట్’. ఈ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్‌కి శశికాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో క్రికెటర్‌గా నటించారు సిద్ధార్థ్. చక్రవర్తి రామచంద్రన్, శశి కాంత్ నిర్మించిన ఈ మూవీ త్వరలోనే డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని కోలీవుడ్ సమాచారం. ఇక 2006లో వచ్చిన హిందీ చిత్రం ‘రంగ్ దే బసంతి’ తర్వాత మళ్లీ 18 సంవత్సరాల అనంతరం మాధవన్ , సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ఇదే.
జల్లికట్టు నేపథ్యంలో...
తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు. ఈ క్రీడ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. కాగా సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్’ అనే పీరియాడికల్ యాక్షన్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నాలుగు సంవత్సరాల క్రితమే ప్రకటించారు. కానీ వివిధ కారణాల వల్ల సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో ఈ ఏడాది ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని సూర్య, వెట్రిమారన్ ప్లాన్ చేశారు. జనవరిలో సూర్య, వెట్రిమారన్, ఈ చిత్రనిర్మాత కలైపులి .ఎస్ థానుల మధ్య ‘వాడి వాసల్’ గురించిన చర్చలు కూడా జరిగాయి. ఇక ఎప్పట్నుంచో ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ‘వాడి వాసల్’ రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది.
మరోసారి బాక్సింగ్
ధనుష్ మెయిన్ లీడ్ రోల్‌లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ మూవీలో అరుణ్ విజయ్ మరో లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ ఓ బాక్సర్ రోల్ చేస్తున్నారు. కాగా అరుణ్ విజయ్ బాక్సర్‌గా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాక్సర్’ అనే మూవీలో అరుణ్ విజయ్ బాక్సర్‌గా నటించారు. అయితే ‘బాక్సర్’ కంప్లీట్ స్పోర్ట్స్ ఫిల్మ్ కాగా, ‘ఇడ్లీ కడై’ మాత్రం స్పోర్ట్స్‌తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్న మూవీ. ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కా నుంది. నిత్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో షాలినీపాండే, సత్యరాజ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
కె–ర్యాంప్
‘క’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘కె–ర్యాంప్’. ఈ చిత్రం టైటిల్ లోగోలో ఓ వ్యక్తి ఫుట్‌బాల్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది స్పోర్ట్స్ డ్రామా మూవీ అని ఊహించవచ్చు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. యుక్తీ తరేజా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వీకే నరేశ్, ‘వెన్నెల’ కిశోర్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.
రేస్ రాజా
హీరో శర్వానంద్ బైక్ రేసింగ్‌తో బిజీగా ఉన్నారు. శర్వా నంద్ హీరోగా అభిలాష్ కంకర్ డైరెక్షన్‌లో ‘రేజ్ రాజా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో మోటారు బైకు రేసర్‌గా శర్వానంద్ నటిస్తున్నారు. 1990 నుంచి 2000ల మధ్య కాలంలో జరిగే ఈ స్పోర్ట్స్ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... స్పోర్ట్స్ డ్రామా జానర్‌లో సినిమాలు చేసిన అనుభవం శర్వానంద్‌కు ఉంది. ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు (2015)’ మూవీలో రన్నింగ్ రేసర్‌గా, ‘పడి పడి లేచే మనసు (2018)’ మూవీలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా శర్వానంద్ నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే.
బాక్సింగ్ రౌండ్ 2
హీరో ఆర్య, దర్శకుడుపా. రంజిత్ కాంబినేషన్‌లో వచ్చిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘సార్పట్టై పరంబర’. ఈ మూవీ 2021లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర రౌండ్ 2’ అంటూ సీక్వెల్‌ను ప్రకటించారు. అయితే తొలి భాగం మాదిరి, రెండో భాగాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా థియేటర్స్‌లో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు మేకర్స్.
కబడ్డీ... కబడ్డీ..
ధృవ్ విక్రమ్ హీరోగా చేస్తున్న మూవీ ‘బైసన్: కాలమాడన్’. మారి సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ధృవ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అలాగే కబడ్డీ ప్లేయర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి, రాజకీయ నాయకుడిగా మారిన మనత్తి పి. గణేశన్ జీవితం ఆధారంగా ‘బైసన్’ మూవీ రూపొందుతోంని కోలీవుడ్ సమాచారం. అ΄్లాజ్ ఎంటర్‌టైన్మెంట్, నీలంప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.
- ముసిమి శివాంజనేయులు
Tags