మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
ఈపీఎఫ్‌వో రూ.2 లక్షల కోట్ల క్లెయిమ్‌లు
Published on Fri, 02/07/2025 - 06:23
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యుల క్లెయిమ్‌ల పరిష్కారంలో కొత్త రికార్డులకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సభ్యులకు సంబంధించి రూ.2,05,932 కోట్ల విలువైన క్లెయిమ్‌లను ఈపీఎఫ్‌వో ఆమోదించినట్టు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. మొత్తం పరిష్కరించిన క్లెయిమ్‌ల సంఖ్య 5.08 కోట్లను చేరుకున్నట్టు తెలిపింది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండు నెలలు మిగిలి ఉండగా, అప్పుడే గతేడాది క్లెయిమ్ గణాంకాలను ఈ ఏడాది అధిగమించడం గమనార్హం. 2023–24 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 4.45 కోట్ల క్లెయిమ్‌లకు గాను చేసిన చెల్లింపులు రూ.1,82,838 కోట్లుగా ఉన్నాయి.
క్లెయిమ్ పరిష్కారాల ప్రక్రియ పురోగతికి, ఫిర్యాదుల పరిష్కారం దిశగా ఈపీఎఫ్‌వో చేపట్టిన సంస్కరణల వల్లే ఈ ఘనత సాధించినట్టు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మనుసుఖ్ మాండవీయ తెలిపారు. క్లెయిమ్‌లను ఆటోమేటిగ్గా పరిష్కరించడం, సభ్యుల ప్రొఫైల్ మార్పులను సులభతరం చేయడం, పీఎఫ్ సాఫీ బదిలీకి వీలు కల్పించడం వంటి చర్యలను మంత్రి ప్రస్తావించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటో క్లెయిమ్ పరిష్కారాలు రెట్టింపై 1.87 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆటో క్లెయిమ్ పరిష్కారాలు 89.52 లక్షలుగా ఉన్నాయి.
Tags