మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
రతన్ టాటా ఆస్తిలో రూ.500 కోట్లు ఈయనకే.. వీలునామాలో ఊహించని వ్యక్తి..
Published on Fri, 02/07/2025 - 12:10
దేశ పారిశ్రామిక ప్రగతికి ఎనలేని కృషి చేసిన రతన్ టాటా (Ratan Tata) గతేడాది అక్టోబర్‌లో కన్ను మూశారు. కాగా ఇటీవల తెరిచిన రతన్ టాటా వీలునామా చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే అందులో జంషెడ్‌పూర్‌కు చెందిన ట్రావెల్ రంగ ఎంట్రాప్రెన్యూర్ మోహినీ మోహన్ దత్తా (Mohini Mohan Dutta) అనే వ్యక్తికి ఆస్తిలో రూ. 500 కోట్లు (రతన్ టాటా మిగిలిన ఆస్తులలో దాదాపు మూడో వంతు) కేటాయించాలనే నిబంధన ఉంది. ఇది టాటా కుటుంబాన్ని మాత్రమే కాకుండా ఆయన సన్నిహితులను కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే మోహినీ మోహన్ దత్తా అనే వ్యక్తి గురించి అంతర్గతంగా కూడా ఎవరికీ పెద్దగా తెలీదు.
ఎవరీ మోహినీ మోహన్ దత్తా?
మోహినీ మోహన్ దత్తా జంషెడ్‌పూర్‌లో బాగా స్థిరపడిన వ్యాపారమైన స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీని కలిగి ఉన్న కుటుంబం నుండి వచ్చారు. 2013లో స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీని టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన తాజ్ సర్వీసెస్‌తో విలీనం చేశారు. స్టాలియన్‌లో దత్తా కుటుంబానికి 80% వాటా ఉండగా, మిగిలిన 20% వాటా టాటా ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉంది. మరో విషయం ఏమిటంటే మోహినీ దత్తా థామస్ కుక్ మాజీ అసోసియేట్ కంపెనీ అయిన టీసీ ట్రావెల్ సర్వీసెస్‌కు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.
టాటా-దత్తా సంబంధం
మీడియా నివేదికల ప్రకారం.. మోహినీ మోహన్ దత్తా రతన్ టాటాతో దీర్ఘకాల అనుబంధాన్ని కొనసాగించారు. టాటా వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సంబంధాల గురించి బహిరంగ చర్చలలో ఆయన పేరు ప్రముఖంగా లేకపోయినా, టాటా కుటుంబంతోపాటు ప్రైవేట్ సర్కిల్‌లోని ఎంపికచేయదగ్గ వ్యక్తులలో మోహినీ మోహన్ దత్తా ఒకరుగా ఉన్నారు.
వీలునామా సందేహాస్పదం?
టాటా ట్రస్ట్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణం తర్వాత తాజాగా ఈ వీలునామా బయటకు వచ్చింది. ఊహించని విధంగా మోహన్ దత్తాకు రూ.500 కోట్లు కేటాయించడంతో పాటు, మిగిలిన సంపదను ప్రధానంగా దాతృత్వ కార్యక్రమాల కోసం వినియోగించాలని అందులో పేర్కొన్నారు. వీలునామాను అమలు చేసే నలుగురు వ్యక్తులలో (డారియస్ ఖంబటా, మెహ్లి మిస్త్రీతో పాటు) ఉన్న ఆయన సవతి సోదరీమణులు షిరిన్, దినా జస్జీభోయ్ కూడా తమ వాటాలను దాతృత్వ కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు.
కాగా ఈ పరిణామం గురించి వ్యాఖ్యానించడానికి మోహిన్ దత్తా నిరాకరించారు. అదేవిధంగా వీలునామా అమలు చేసేవారు వారు కూడా ఎటువంటి బహిరంగ ప్రకటనలూ జారీ చేయలేదు. ఆస్తి పంపిణీకి సంబంధించి ఆశ్చర్యకరమైన స్వభావం కారణంగా, ముఖ్యంగా బయటి వ్యక్తికి భారీ ఆస్తి కేటాయింపును పరిగణనలోకి తీసుకుంటే, వీలునామా పరిశీలనకు గురికావచ్చని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
Tags