మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
భాగ్యనగరంలో బెంగాలీ రుచులు.. లొట్టలేస్తున్న ఆహార ప్రియులు
Published on Fri, 02/07/2025 - 13:01
విభిన్న సంస్కృతుల సమ్మేళనం, విభిన్న రుచుల సంగమం హైదరాబాద్.. వారసత్వం పేర్చిన ఈ ఆహార సంస్కృతిలో దేశవ్యాప్తంగా అన్ని రుచులనూ నగరవాసులు ఆదరిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఈ కల్చరల్ డైవర్సిటీలో తన ప్రశస్తి సువాసనలు నలుదిశలా వెదజల్లుతున్నాయి. అందుకు చక్కని వేదికైంది బెంగాలీ రుచులు (Bengali Recipes) ప్రదర్శన. నగరంలో బెంగాలీలు ఉన్నప్పటికీ దాదాపు 40 శాతం వరకూ స్థానికులు కూడా ఆదరణ చూపిస్తున్నారని హైటెక్ సిటీలోని ‘ఓ కలకత్తా’ రెస్టారెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫిరోజ్ సాద్రి తెలిపారు. గత 25 సంవత్సరాలుగా బెంగాలీ రుచులను అందిస్తున్న ‘ఓ కలకత్తా’.. హైదరాబాద్ వేదికగా బెంగాలీ ఆహార సంస్కృతిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో నగరానికి బెంగాలీ ఫుడ్ కల్చర్ వచ్చిన తీరు, ఇక్కడ వినూత్నంగా అందుబాటులో ఉన్న వెరైటీ డిషెస్ గురించి ఫిరోజ్ సాద్రి వెల్లడించారు.
– సాక్షి, సిటీబ్యూరో
దేశాన్ని వందల ఏళ్లు పాలించిన బ్రిటిష్ వారు బెంగాల్ కేంద్రంగా ఎంచుకున్నారు.. ఎందరో ముస్లిం రాజవంశస్తులు పరిపాలించిన ప్రాంతం కూడా బెంగాల్. ఈ ఇద్దరికీ ప్రధాన కేంద్రం హైదరాబాద్ (Hyderabad). ఇలా సాంస్కృతిక పరిణామంలో నగరానికి బెంగాలీ ఆహారం వచ్చింది. బ్రిటిష్‌వారు స్పైసీ తక్కువ, తీపి ఎక్కువ ఇష్టపడతారు. ఇందులో భాగంగా వారు ప్రత్యేకంగా తయారుచేసుకున్న బెంగాలీ వెరైటీ అడాబ్ చిగిరీ. ఇది కొబ్బరి నీరు (Coconu Water), కొబ్బరి క్రీంతో తయారు చేసే అరుదైన వంటకం. ఈ వెరైటీ ‘ఓ కలకత్తా’లో లభిస్తుంది. దీనిని నగరవాసులు ఇష్టంగా ఆరగిస్తున్నారు.
ఇదీ చదవండి: Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి!
హిల్సా ఆఫ్ పాతూరి..
ఈ వెరైటీ మాన్సూన్ సీజన్లో మాత్రమే లభించే అరుదైన హిల్సా చేపతో తయారు చేస్తారు. దీనిలో మిలియన్ల సంఖ్యలో సన్నని ఎముకలుంటాయి. వీటన్నింటినీ సృజనాత్మకంగా తొలగించి, అరిటాకులో కొబ్బరిని కలిపి స్టీమ్ చేసి వడ్డించే వినూత్న వంటకం. ఇది కలకత్తా స్పెషల్, ఖరీదైనది కూడా. మాన్సూన్ సీజన్లో బ్రహ్మపుత్ర నదిలో బ్రీడింగ్ కోసం వలస వచ్చే అరుదైన చేప కావడమే దీని ప్రత్యేకత.
మోచా..
అరటి పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేసే కలకత్తా వంటకం. అరటి పువ్వులో పోషక విలువలుంటే చిన్న చిన్న పెటల్స్‌తో దీనిని తయారు చేస్తారు. ఆరోగ్యంతో పాటు రుచికరమైనదని చెఫ్ వెల్లడించారు.
గోబిందో బోగ్..
బెంగాల్లో గోబిందో బోగ్ రైస్‌ను దేవుని ఆహారంగా భావిస్తారు (ఫుడ్ ఫర్ ది గాడ్). ఇది బెంగాల్లో తప్ప మరెక్కడా దొరకదు. సాధారణ బియ్యం, బాస్మతి బియ్యానికీ భిన్నంగా, రుచికరంగా ఉంటుంది. అత్యంత సాధారణమైన బెంగాలీ వంటకం ఈ రైస్ వెరైటీ.
జర్నా ఘీ..
తెలుగువారి ఆహారంలో నెయ్యికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అలాగే బెంగాలీలు కూడా ఆహార పదార్థాల్లో నెయ్యికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఇందులో భాగంగానే ఫ్లేవర్ కోసం బెంగాలీలు జర్నా నెయ్యిని వాడతారు. ఇది ఒక్క స్పూన్‌తో మొత్తం రుచినే మార్చేస్తుంది. ఇవే కాకుండా ఇండియన్ చికెన్ కట్లెట్, రాయల్ మటన్ చాన్ప్,కోల్‌కతా బిర్యానీ, రాధూనీ మసాలా, రాధా తిలక్ రైస్, చానా పాతూరి, జాక్ ఫ్రూట్ టిక్కీ (స్పైసీ.. సూపర్ ఫుడ్), పెఫెటా చీజ్, మలాయీ కర్రీ, పెటాయ్ పరోటా, ఆమ్ఆచావో ఇలా.. విభిన్న రకాల బెంగాలీ రుచులతో ఓ కలకత్తాలో నోరూరిస్తుందని చెఫ్‌లు పేర్కొన్నారు. 1992లో ముంబై వేదికగా నాలుగు టేబుళ్లతో ‘ఓన్లీ ఫిష్’ పేరుతో అంజన్ ఛటర్జీ ప్రారంభించిన హోటల్ క్రమంగా హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా వంటి 8 ప్రాంతాలతో పాటు యూఏఈ, లండన్‌లో వండి వడ్డిస్తున్నారు.
ఆమ్ అదా అల్లం
నగరవాసులకు సరికొత్త బెంగాలీ రుచులను అందించడానికి కలకత్తా పరిసర ప్రాంతాల నుంచి ఆమ్ ఆదా అల్లంను పరిచయం చేశారని ఫిరోజ్ సాద్రి తెలిపారు. దీనిని మామిడి అల్లం అని పిలుస్తారు. దీంతో చేసే ఆమ్ ఆదా మాచ్‌కు నగరంలో ఆదరణ పెరుగుతోంది.
మిస్టీ దహీ(దోయి)
బెంగాల్ నుంచి ఎవరైనా హైదరాబాద్ వస్తున్నారంటే విమానంలో కూడా ఓ బాక్స్‌లో పార్సిల్ తెచ్చుకునే ప్రియమైన వెరైటీ ఈ మిస్టీ దహీ(దోయి). ఇది కూడా బెంగాలీ సిగ్నేచర్ వెరైటీ.
మటన్ టిక్యా
ముస్లింలు ఎక్కువగా ఉండే కలకత్తాలో వారి ప్రత్యేక వంటకం ఇది. షాఫ్రాన్, రోజ్ వాటర్ సమ్మిళితంగా సంప్రదాయ వంటగా దీనిని చేస్తారు. దీనిని నగరవాసులు సైతం ఇష్టంగా తింటున్నారు.
చదవండి: Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట
Tags