మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
కొత్తగా మరో 2,835 విమానాలు
Published on Fri, 02/07/2025 - 06:12
న్యూఢిల్లీ: విమాన ప్రయాణానికి నానాటికీ పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి.. వచ్చే 20 ఏళ్లలో భారత్, దక్షిణాసియాలోని పౌర విమానయాన సంస్థలు కొత్తగా 2,835 విమానాలను సమకూర్చుకునే అవకాశం ఉందని యూఎస్‌కు చెందిన విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ వెల్లడించింది.
గురువారం విడుదల చేసిన కమర్షియల్ మార్కెట్ ఔట్‌లుక్ ప్రకారం.. భారత బలమైన ఆర్థిక వ్యవస్థ, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ మార్కెట్ మద్దతు, 2043 నాటికి ఏటా 7 శాతం కంటే వార్షిక ట్రాఫిక్ వృద్ధి ఇందుకు దోహదం చేయనుంది. అలాగే మెరుగైన కనెక్టివిటీ, విమాన రంగానికి మద్దతు ఇచ్చే విధానాలు వృద్ధికి ఆజ్యం పోస్తాయి. భారత ట్రావెల్ మార్కెట్‌లో అతిపెద్ద, అభివృద్ధి చెందుతున్న సెగ్మెంట్‌గా దేశీయ విమాన ట్రాఫిక్ ఉంటుంది.
లో–కాస్ట్ ఎయిర్‌లైన్స్ మరిన్ని కొత్త మార్గాలకు చేరుకోవడంతోపాటు, నూతన గమ్యస్థానాలను అనుసంధానిస్తాయి. అలాగే కార్గో విమానాల సంఖ్య అయిదింతలకు పెరుగుతుంది. అంతర్జాతీయంగా సరఫరా విస్తరణ, తయారీ, ఈ–కామర్స్ రంగం జోరు ఇందుకు కారణం.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా..
బలమైన ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య వృద్ధి, పెరుగుతున్న గృహ ఆదాయాలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధిలో పెట్టుబడులు.. వెరశి భారత్, దక్షిణాసియా ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాణిజ్య విమానయాన మార్కెట్‌గా కొనసాగుతోందని బోయింగ్ భారత్, దక్షిణాసియా కమర్షియల్ మార్కెటింగ్ ఎండీ అశ్విన్ నాయుడు తెలిపారు.
‘ప్రజలకు విమాన ప్రయాణం ఎక్కువ అందుబాటులో వస్తుంది. రాబోయే రెండు దశాబ్దాలలో పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి ఈ ప్రాంతంలోని విమానయాన సంస్థలకు ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించే ఆధునిక విమానాల అవసరం. వీటిలో న్యారో బాడీ విభాగంలో 2,445, వైడ్ బాడీ సెగ్మెంట్‌లో 370 విమానాలకు డిమాండ్ ఉండొచ్చు. పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, టెక్నీషియన్ల డిమాండ్ నాలుగు రెట్లు పెరిగి 1,29,000కి చేరుతుంది’ అని చెప్పారు.
Tags