మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
ఆ... భరణం అచ్చం అలాగే!
Published on Fri, 02/07/2025 - 10:14
సినిమా తారలు ఏదైనా ఈవెంట్లో పాల్గొన్నప్పుడు వారు ధరించిన వస్త్రాలు, ఆభరణాలను అంతా ఆసక్తిగా పరిశీలిస్తుంటారు. అత్యంత ఖరీదైన ఆ డ్రెస్సులు, ఆభరణాలు వారిని మరింత ప్రత్యేకంగా చూపుతుంటాయి. యునిక్‌గా కనిపించే వాటిని అచ్చం అలాగే తయారు చేయించుకోవడమే కాదు మార్కెట్లోనూ ఆ రెప్లికా డిజైన్స్ లభిస్తుంటాయి. ఆభరణాలలో కనిపించే ఈ ట్రెండ్స్ వివాహ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గురువారం తన సోదరుడు సిద్ధార్థ్ మెహందీ వేడుకలో పది కోట్ల రూపాయలకు పైగా విలువైన బల్లారి నెక్లెస్‌ను ధరించి, అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆ మధ్య నీతా అంబానీ తన కుమారుడి పెళ్లిలో కోట్ల ఖరీదైన పచ్చల హారాన్ని ధరించింది.
వేడుకలలో స్టార్ సెలబ్రిటీలు ధరించే జ్యువెలరీ ధర కోట్లలో ఉంటుంది. అంత ఖరీదు మనం పెట్టలేం, అలాంటి డిజైన్ని పొందలేం అని ఈ రోజుల్లో వెనకంజ వేయనక్కర్లేదు. కొన్ని రోజులలోనే అలాంటి డిజైన్లు మార్కెట్లో కనిపిస్తుంటాయి. సెలబ్రిటీలు ధరించిన ఆభరణాల రెప్లికా డిజైన్స్ రూ.1500 నుంచి పది వేల రూపాయల వరకు లభిస్తున్నాయి.
మెరుపు తగ్గకుండా!
ఇమిటేషన్, వన్‌గ్రామ్ గోల్డ్, ఆర్టిఫిషియల్.. ఆభరణాలను కొత్తగా ఉంచడానికి వాటిని శుభ్రంగా ఉంచాలి.
ఆభరణాన్ని వాడిన ప్రతిసారి మృదువైన, పొడి కాటన్ వస్త్రంతో తుడవాలి. దీనివల్ల మురికి, చెమట తొలగిపోతాయి
ఆభరణాల నాణ్యతను కాపాడుకోవడానికి సరైన విధంగా భద్రపరచుకోవాలి. తక్కువ ఖరీదు అనో, టైమ్ లేదనో.. అన్నింటినీ ఒకే బాక్స్‌లో పెట్టేస్తుంటారు. బీడ్స్, స్టోన్స్‌పై గీతలు పడకుండా, పాడవకుండా ఉండాలంటే ప్రతి ఆభరణాన్ని ప్రత్యేక కంపార్ట్మెంట్లలో ఉంచాలి
ఏ కాస్త తేమ ఉన్నా ఆభరణాల రంగు మారుతుంది. ఆభరణాలను ఉంచే పెట్టెలో అదనపు తేమను గ్రహించడానికి మీరు సిలికా జెల్ ప్యాకెట్లను ఉపయోగించవచ్చు
పెర్ఫ్యూమ్లు, లోషన్లు ఉపయోగించిన తర్వాతనే ఆభరణాలను అలంకరించుకోవాలి. లేదంటే వాటిలోని రసాయనాలు ఆభరణాలను మసకబారిస్తాయి ∙
ఆర్టిఫిషియల్ ఆభరణాలలో ఒకేరకాన్ని తరచూ ధరించకూడదు. దీనివల్ల ఆ ఆభరణం త్వరగా రంగుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి
ఆభరణాలలో ఏదైనా నష్టం గమనించినట్లయితే, వెంటనే మరమ్మతు చేయించాలి. వదులుగా ఉన్న రాళ్ళు లేదా విరిగిన వాటిని సకాలంలో గమనించినట్లయితే సులభంగా మరమ్మతు చేయవచ్చు. ఈ ఆభరణాలను బాగు చేసే షాపులు కూడా ఉంటాయి. వాటి ద్వారా నగను మరో రూపంగా కూడా మార్చుకోవచ్చు.
బీడ్స్ .. చోకర్స్
ఇప్పుడు వివాహ వేడుకలలో ట్రెండ్‌లో ఉన్నవి బీడ్స్, చోకర్స్. అన్నిరకాల బీడ్స్ లేయర్లుగా ఉన్నవి బాగా ఇష్టపడుతున్నారు. శారీ, డ్రెస్ కలర్‌కు మ్యాచింగ్ బీడ్స్ హారాలు, చోకర్స్ బాగా నప్పుతుంటాయి.
వీటికి గోల్డెన్ బాల్స్, స్టోన్స్ లాకెట్స్ జత చేయడంతో గ్రాండ్‌గా కనిపిస్తుంటాయి. వేడుకలలో ఆకర్షణీయంగా కనిపించాలి, ఫొటో, వీడియోలలో అందంగా కనిపించాలనుకునేవారు వీటినే ఎక్కువ ఇష్టపడుతున్నారు. బంగారం ధరలు బాగా పెరిగిపోవడం, ప్రతీ వేడుకకు కొత్త హారం కావాలనుకోవడం వల్ల కూడా ఇలాంటివాటికి బాగా డిమాండ్ ఉంటోంది.
ఫోటో సెండ్ చేస్తే... ఆభరణం తయారీ..
ఎంత గ్రాండ్ డిజైన్ అయినా, సెలబ్రిటీలు వేసుకున్న ఆభరణాలైనా.. నచ్చిన డిజైన్ ఫోన్లో ఫోట్ సేవ్ చేసుకొని, మాకు ఇస్తే ఆర్డర్ మీద ఆ డిజైన్ని తయారుచేసి ఇస్తుంటాం. వివాహ వేడుకలలో హైలైట్‌గా నిలిచే రెప్లికా డిజైన్స్, బీడ్ జ్యువెలరీని మూడు దశాబ్దాలుగా తయారుచేస్తున్నాం.
స్టోన్స్, బీడ్స్, వడ్డాణం, చేతి పట్టీలూ.. పూర్తి సెట్ వారి పెళ్లి శారీ కలర్ కాంబినేషన్ బట్టి తయారుచేయించుకుంటున్నారు. సంప్రదాయ వేడుకలలో ఇప్పుడు ఫ్యాషన్ జ్యువెలరీ ఎంపికే ముందు వరసలో ఉంటుంది.
– ఎల్.పద్మ,
ఇమిటేషన్ జ్యువెలరీ మేకర్, హైదరాబాద్
(చదవండి: రూ. 75 కోట్లు విలువ చేసే హోటల్ని జస్ట్ రూ. 875లకే అమ్మకం..!)
Tags