Big Question: ప్రాణాలు తీసిన ప్రభుత్వ నిర్లక్ష్యం
Breaking News
పుట్టినింటికి ఆడబిడ్డలు
Published on Thu, 01/09/2025 - 00:35
ఊరు అంటే ఊరు కాదు. జ్ఞాపకాల తోట. ఖండాంతరాలు దాటినా ఆ పరిమళం మనసును వీడిపోదు. ఏదో ఒక సమయాన స్వరూపకు నాగమణి గుర్తుకు వస్తుంది. పక్కింటి నాగమణి, స్వరూప క్లోజ్‌ఫ్రెండ్స్. దగ్గరలో ఉన్న మండల కేంద్రానికి సినిమాకు వెళ్లడం నుంచి సీమచింతకాయల వేట వరకు వారి జ్ఞాపకాల్లో ఎన్నో ఉన్నాయి. పెళ్లి అయిన తరువాత నాగమణి అక్కడెక్కడో సూరత్‌లో ఉంటుంది. స్వరూప కూడా పెళ్లయిన తరువాత సొంతూరులో కాకుండా వేరే ఊళ్లో ఉంటుంది. ఆ దూరం అలా కొనసాగుతూనే ఉంది.
ఇక అంతేనా?
‘ఈ 5జీ జమానాలో కూడా అంతేనా... ఇంతేనా అంటూ నిట్టూరిస్తే ఎలా?’ అంటూ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజన్న గూడెం మహిళలు. పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న స్నేహితుల ‘పూర్వ విద్యార్థుల సమ్మేళనం’ మనకు తెలుసు. అయితే ఇది అలాంటి సమ్మేళనం కాదు... రాజన్న గూడెం ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం!
పెళ్లయిన తరువాత ఎక్కడెక్కడో వేరు వేరు ఊళ్లలో ఉంటున్న ఆడపడుచులు ఈ సమ్మేళనం పుణ్యమా అని ఎన్నో సంవత్సరాల తరువాత కలుసుకున్నారు. రోజంతా సంబరాలు చేసుకున్నారు! ‘నా బిడ్డలందరూ నా దగ్గరికి వచ్చారు’ అని ఊరు సంతోషంతో ఉప్పొంగి పోయిన రోజు అది....
బతుకమ్మ పండుగ రోజు...
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాజన్న గూడెం ఆడబిడ్డలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఉన్న ఊరిని వదిలి అత్తారింటికి వెళ్లిన ఆడపడుచులందరు ‘ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో ఒక చోటకు చేరారు. అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చే వారి సంఖ్య ప్రతి యేడూ తగ్గుతోంది. పోయిన బతుకమ్మ పండుగ రోజు ఇదే విషయం గురించి మాట్లాడుకున్నారు కొందరు మహిళలు. ‘అందరం ఒక రోజు కలుసుకొని మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది’ అనుకున్నారు. అది అసాధ్యమైన కోరికేమీ కాదనే విషయం కూడా వారికి తెలుసు. ‘ఎంత బాగుంటుంది అని ఒకటికి పదిసార్లు అనుకోవడం కాదు. కచ్చితంగా కలవాల్సిందే’ అంటూ నడుం బిగించారు.
సోషల్ మీడియా వేదికగా....
అనుకున్నదే తడవుగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. వివిధ రంగాల్లో ఉన్న తమ ఊరి ఆడబిడ్డలను ఒకదగ్గర చేర్చడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. పేరాల ఇందిర, సూదిని రజిని, యాట ఇందిరాదేవి, రావుల ఉమాదేవి, ఊట్కూరి లక్ష్మి నాలుగు నెలల పాటు ఎంతో శ్రమ తీసుకున్నారు. ఫోన్ నెంబర్‌లు సేకరించడం నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వరకు ఎన్నో చేశారు.
దాగుడుమూతలు... దస్తీబిస్తీలు
అనుకున్న రోజుకు దాదాపు అందరూ వచ్చారు. ఇరవై ఏళ్ల నుంచి తొంభై ఏళ్ల వయసు వరకు ఎంతోమంది మహిళలు వచ్చారు. వయసు తేడా లేకుండా చిన్నపిల్లలై పోయారు. దాగుడు మూతలు, దస్తీబిస్తీ, మ్యూజికల్ చైర్, బెలూన్ బ్లాస్టింగ్, ఒంటికాలి కుంటుడు ఆటలు, డీజే పాటలతో హోరెత్తించారు.
‘ఎవరి లోకం వారిదే’ అయిపోయిన ఈ కాలంలో, ఒకే ఇంటి కుటుంబ సభ్యులు కూడా వేరు వేరు ప్రపంచాలు అయిన ఈ ఉరుకులు పరుగుల కాలంలో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తాయి. పల్లె మోములో రోజూ పండగ కళను తీసుకువస్తాయి.
మరెన్నో ఊళ్లకు ‘రాజన్న గూడెం ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం’ స్ఫూర్తిని ఇవ్వాలని ఆశిద్దాం.
ఇక ప్రతి సంవత్సరం...ఆ రోజు పండగే!
మా ఊరి ఆడబిడ్డలం అందరం ఒకచోట చేరి చిన్న పిల్లలమయ్యాం. చిన్నప్పటి పండుగలను, ఆనాటి సంబరాలను గుర్తు చేసుకున్నాం. వయసు తేడా లేకుండా ఆటలాడుకున్నాం. మా ఊరి మీద మరింత ప్రేమ పెంచుకున్నాం. ప్రతి సంవత్సరం ‘ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం’ ఏర్పాటు చేయాలని, మరింత ఎక్కువమంది హాజరయ్యేలా చూడాలనుకుంటున్నాం.
– ఊట్కూరి లక్ష్మి, నల్లగొండ
కళ్లనీళ్లు పెట్టుకున్నారు
‘రాజన్న గూడెం ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో చేపట్టిన కార్యక్రమం మా జీవితంలో మరవలేనిది. ఎన్నోతరాల ఆడబిడ్డలను ఒకచోటికి రప్పించాం. రకరకాల కారణాలతో పుట్టిన ఊరికి ఇక రాలేమనుకున్న వారిని సైతం గుర్తించి రప్పించడం విశేషంగా భావిస్తున్నాం. ఆడబిడ్డలందరినీ ఒకచోట చూసి పెద్ద వయసు వారు కన్నీటి పర్యంతమయ్యారు.
– పేరాల ఇందిర, మోత్కూరు
మళ్లీ మళ్లీ రావాలని...
తల్లిదండ్రులు చనిపోయిన వారు, సింగిల్ పేరేంట్స్... మొదలైనవారు మా ఊరికి చాలా ఏళ్లుగా రావడం లేదు. అలాంటి వారందరినీ ‘ఆత్మీయ సమ్మేళనం’ ద్వారా రప్పించాం. వచ్చినవారంతా ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకున్నారు. నిక్‌నేమ్‌లను గుర్తు చేసుకున్నారు. మరోసారి ఇలాంటి కార్యక్రమం పెడితే మళ్లీ పుట్టింటికి వచ్చినట్లు వస్తామని సంతోషంగా చెప్పి వెళ్లారు.
– సూదిని రజిని, సిరిపురం
అంబరాన్ని అంటిన సంబరం
ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు కొద్దిమందిమి మాత్రమే పుట్టింటికి వస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఆత్మీయ సమ్మేళనం’కు రూపకల్పన చేశాం. ఊరు దాటగానే ఎవరి లోకం వారిదై పోతుంది. అలా కాకుండా పట్టుదలగా, ఇష్టంగా పనిచేశాం. రాలేమన్న వారిని ఒప్పించి రప్పించాం. మా ఊరి ఆడబిడ్డల ముఖాల్లో మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని చూశాం.
– యాట ఇందిరాదేవి, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్,
సీతాఫల్ మండి, సికింద్రాబాద్
– యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి
Tags