LIVE: తిరుపతి ఘటనపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్
Breaking News
తెలంగాణలో 'గేమ్ ఛేంజర్' టికెట్ల పెంపుపై విమర్శలు
Published on Thu, 01/09/2025 - 14:15
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ వేడుకలో నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ (Desapati Srinivas) తప్పుబట్టారు. ఇలాంటి వేదికలపై తెలంగాణ కల్చర్‌ను తప్పుగా చూపుతూ చులకనగా మాట్లాడటమేంటి అంటూ ఆయన ప్రశ్నించారు. అలాంటప్పుడు తెలంగాణలో సినిమా వ్యాపారాన్ని మానుకోవాలని ఆయన కోరారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా తెలంగాణలో గేమ్ ఛేంజర్ సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు నిర్ణయాన్ని తప్పపట్టారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన ఉత్తదే అని తేలిపోయిందని రసమయి అన్నారు.
ఈ సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. రామ్ చరణ్ (గేమ్ ఛేంజర్), వెంకటేశ్ (సంక్రాంతికి వస్తున్నాం) చిత్రాలు రేసులో ఉన్నాయి. అయితే, ఈ రెండు సినిమాలలో జనవరి 14న విడుదలకానున్న కానున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ ఈవెంట్లో దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. 'మా నిజమాబాద్‌లో తెల్ల కల్లు ఫేమస్. పొద్దునపూట నీర తాగితే వేరే లెవెల్లో ఉంటుంది. మావోళ్లకు( తెలంగాణ) సినిమా అంటే అంత వైబ్ ఉండదు.. ఆంధ్రకు వెళ్తే సినిమాకు ఓ స్ఫెషల్ వైబ్ ఇస్తారు.. తెలంగాణలో మటన్, తెల్లకల్లుకే వైబ్ ఇస్తారు’ అని వెంకటేశ్‌తో దిల్ రాజు అన్నారు. ఇప్పుడు అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
కల్లు , మాంసం దుకాణాలు పెట్టుకోండి: ఎమ్మెల్సీ
'తెలంగాణ ఉద్యమంలో దిల్ రాజు ఎప్పుడూ కలిసిరాలేదు. ఒక్కరోజు కూడా ఇక్కడి ప్రజల కోసం ఆయన అండగా నిలబడలేదు. తన సినిమా ప్రమోషన్ కోసం తెలంగాణను తక్కువ చేస్తూ తాజాగా దిల్ రాజు మాట్లాడారు. తెలంగాణలో సినిమాలకు వైబ్ లేదంటూ ఇక్కడి కల్చర్‌ను చులకన చేశారు. అలాంటప్పుడు తెలంగాణలో సినిమాలు చేయడం మానుకోని.. కల్లు , మాంసం దుకాణాలు పెట్టుకోండి. ఇక్కడ మీ సినిమాలకు టికెట్ల ధరల పెంపు కోసం సీఎం రేవంత్‌ను అడిగి ప్రత్యేకంగా ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నారు.
సీఎం రేవంత్ రెండు నాల్కల ధోరణి కూడా మరోసారి బయట పడింది. సినిమా టికెట్ల ధరలు, బెనిఫిట్ షోల గురించి గతంలో వారు చెప్పిన మాట మీద నిలబడలేదు. ఈ విషయంలో మంత్రి కోమటి రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మాట మీద నిలబడని ఈ ప్రభుత్వ తీరును ప్రజలు గమనించాలి. దిల్ రాజు కోసం సినిమా టికెట్స్ ధరలు పెంచారు. దిల్ రాజు మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకి.' అని కామెంట్ చేశారు.
దిల్ రాజుకు ఎంతకు అమ్ముడు పోయారు: రసమయి
సీఎం రేవంత్‌రెడ్డి, దిల్ రాజులపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణలో సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు ,బెనిఫిట్ షో లపై అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ చేసిన ప్రకటన ఉత్తదే అని తేలిపోయింది. దిల్ రాజు నిర్మాతగా ఉన్న సినిమా గేమ్ ఛేంజర్‌కు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం వెనక మతలబు ఏమిటి అనేది ప్రజలకు చెప్పిండి. సీఎం రేవంత్ దిల్ రాజుకు ఎంతకు అమ్ముడు పోయారు..? ఆరు గ్యారంటీలపై మాట తప్పినట్టే సినిమా టిక్కెట్ల రేట్ల పెంపుపై సీఎం మాట తప్పారు.
దిల్ రాజు తెలంగాణ ప్రజలను తన మాటలతో అవమాన పరిచారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి బెనిఫిట్ షోలపై అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం తెలుసు కానీ, సీఎం రేవంత్‌కు పాలన చేత కావడం లేదు. ప్రతి అంశంపై సీఎం యూ టర్న్ తీసుకుంటున్నారు. రేవంత్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.' అని ఆయన అన్నారు.
Tags