ఆరోగ్య ఉత్సవాలను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
Breaking News
Martin Luther King Movie Review:‘మార్టిన్ లూథర్ కింగ్’ మూవీ రివ్యూ
Published on Fri, 10/27/2023 - 08:50
టైటిల్:మార్టిన్ లూథర్ కింగ్
నటీనటులు:సంపూర్ణేష్ బాబు, వీకే నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్ తదితరులు
నిర్మాతలు: ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర
క్రియేటివ్ ప్రొడ్యూసర్: వెంకటేష్ మహా
దర్శకత్వం:పూజ కొల్లూరు
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: వెంకటేష్ మహా
సంగీతం:స్మరణ్ సాయి
సినిమాటోగ్రఫీ:దీపక్ యరగెరా
విడుదల తేది: అక్టోబర్ 27, 2023
‘మార్టిన్ లూథర్ కింగ్’ కథేంటంటే..
గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ డ్రామా చిత్రమిది. పడమరపాడు అనే గ్రామంలో ఉత్తరం వైపు ఒక కులం వాళ్లు.. దక్షిణం వైపు ఇంకో కులం వాళ్లు ఉంటారు. ఇరు కులాలకు అస్సలు పడదు. ఎప్పుడూ గొడవలు పడుతుంటారు. దీంతో ఆ ఊరి ప్రెసిడెంట్ రెండు కూలాల నుంచి ఒక్కొక్కరిని పెళ్లి చేసుకొని..ఉత్తరం, దక్షిణం వాళ్లకు సమ ప్రాధాన్యత ఇస్తుంటాడు. కానీ పెద్ద భార్య కొడుకు జగ్గు(వీకే నరేశ్), చిన్న భార్య కొడుకు లోకి(వెంకట్ మహా) మాత్రం ఎప్పుడూ గొడవపడుతుంటారు. వారిద్దరి గొడవల కారణంగా ఊరి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ఊర్లో మరుగుదొండ్లు ఉండవు..రోడ్లు సరిగా ఉండదు.
ఇలా పలు సమస్యలతో బాధపడుతున్న ఆ ఊరికి ఓ పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది. కోట్లల్లో కమీషన్ వస్తుందని తెలిసి.. జగ్గు, లోకి ఇద్దరూ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడతారు. ఉత్తరం వాళ్లు, దక్షిణం వాళ్లు సమానంగా ఉండడంతో..ఒక్క ఓటు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క ఓటే స్మైల్ అలియాస్ మార్టిన్ లూథర్ కింగ్(సంపూర్ణేష్ బాబు). అతనొక అనాథ. ఊర్లో ఉన్న ఓ పెద్ద చెట్టుకింద చెప్పులు కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తాడు. అతనికి తోడుగా మరో అనాథ బాటా ఉంటాడు. వీరిద్దరికి ఎలాంటి గుర్తింపు కార్డులు ఉండవు.ఆ ఊరికి కొత్తగా వచ్చిన పోస్టాఫీస్ ఉద్యోగిణి వసంత(శరణ్య) స్మైల్ పెరుని మార్టిన్ లూథర్ కింగ్‌గా మార్చి ఓటర్ కార్డుతో పాటు పోస్టాఫీస్‌లో ఖాతాని తెరిపిస్తుంది. అతని ఓటే కీలకం కావడంతో.. ఒకవైపు జగ్గు, మరోవైపు లోకి.. కింగ్‌కి కావాల్సినవన్నీ ఇస్తారు. మరి తన ఓటుని అడ్డుపెట్టుకొని కింగ్ ఎలాంటి కోరికలు తీర్చుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు తన ఓటు హక్కుతో ఊరి సమస్యలను ఎలా తీర్చాడు అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
ఓటు ప్రాధాన్యతని తెలియజేస్తూ గతంలో అనేక సినిమాలు వచ్చాయి. మార్టిన్ లూథర్ కింగ్ కూడా అలాంటి చిత్రమే. గ్రామాల్లో జరిగే అసలైన రాజకీయాలను తెరపై ఆవిష్కరించడం ఈ చిత్రం స్పెషాలిటీ. ప్రజాస్వామ్యం పవర్ ఏంటి? ఓటు హక్కు విలువ ఏంటి? అనేది ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశారు దర్శకురాలు పూజా కొల్లూరు. వాస్తవానికి ఈ చిత్రం రెండేళ్ల క్రితం తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘మండేలా’కి తెలుగు రీమేక్. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు దగ్గరగా కథలో చిన్న చిన్న మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా మొత్తం పొలిటికల్ సెటైరికల్‌గానే సాగుతుంది.
పడమరపాడు గ్రామంలో మరుగుదొడ్డి ప్రారంభోత్సవం సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ ఒక్క సీన్‌తోనే జగ్గు, లోకి పాత్రల స్వభావంతో పాటు కథకు కీలకమైన స్మైల్ పాత్రని కూడా పరిచయం చేసి నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లారు దర్శకురాలు. పోస్టాఫీస్ ఉద్యోగి వసంత పాత్రతో కథను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. స్మైల్‌కి మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరు పెట్టే క్రమంలో సాగే సన్నివేశాలు.. గ్రామాల్లో ఆధార్, ఓటర్ కార్డు లేని వారి దుస్థితిని చూపిస్తాయి.
రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం కులాల పేర్లతో ప్రజలను ఎలా విడదీస్తారనేది చూపించారు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తికి పెంచుతుంది. అయితే ద్వితియార్థం మాత్రం మొత్తం సీరియస్ సైడ్ తీసుకుంటుంది. ‘మండేలా’ లో వర్కౌట్ అయిన ఎమోషనల్ ఈ చిత్రంలో వర్కౌట్ కాలేదు. కామెడీ సీన్స్ కూడా ఆశించిన స్థాయిలో పేలలేదు. ముఖ్యంగా నరేశ్ పాత్ర కొన్ని చోట్ల చేసే కామెడీ కథకి అతికించినట్లుగా అనిపిస్తుంది. అలాగే కింగ్ ఓటు కోసం జగ్గు, లోకి ఇద్దరు పడే తంటాలు సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఊహించినట్టే రొటీన్‌గా ఉంటుంది. స్క్రిప్టుని మరింత బలంగా రాసుకొని, ఎమోషన్స్‌పై ఇంకాస్త దృష్టి పెడితే సినిమా ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
ఇప్పటివరకు సంపూర్షేష్ బాబు అంటే మనకు కామెడీ హీరోగానే తెలుసు. అతను చేసిన స్పూఫ్ కామెడీని బాగా ఎంజాయ్ చేశాం. కానీ అతనిలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. టైటిల్ పాత్రలో సంపూ ఒదిగిపోయాడు. తనదైన అమాయకపు ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. తెరపై కొత్త సంపూని చూస్తాం. ఈ సినిమా సంపూకి ఓ కొత్త ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు.
ఇక ప్రెసెడెంట్ పదవి పోటీదారులు జగ్గుగా వీకే నరేష్.. లోకిగా వెంకట్ మహా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక సంపూ పాత్రకి అసిస్టెంట్ బాటా పాత్రను పోషించిన చిన్నోడి నటన బాగుంది.పోస్టాఫీసు ఉద్యోగి వసంత పాత్రకి శరణ్య న్యాయం చేసింది. ఊరి ప్రెసిడెంట్, లోకి, జగ్గుల తండ్రి పాత్రను పోషించిన రాఘవన్ కూడా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. స్మరణ్ సాయి నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగానే వస్తూ.. సినిమాలను ఎలివేట్ చేసేలా ఉంటాయి. దీపక్ యరగెరా సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పూజ కొల్లూరు.. ఎడిటర్‌గానూ వ్యవహరించడం విశేషం. కానీ ఎడిటర్‌గా తన కత్తెరకు మాత్రం సరిగా పని చెప్పలేకపోయింది. సినిమాలో చాలా చోట్ల సాగదీత సన్నివేశాలు కనిపిస్తాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
Tags