ఫ్యాకల్టీయే లైంగికంగా వేధిస్తే ఇంకెవరికి చెప్పను నాన్నా..  | Sakshi
Sakshi News home page

ఫ్యాకల్టీయే లైంగికంగా వేధిస్తే ఇంకెవరికి చెప్పను నాన్నా.. 

Published Sat, Mar 30 2024 2:51 AM

Student Rupshree committed suicide - Sakshi

తండ్రి సెల్‌కు మెసేజ్‌ పెట్టి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని 

విశాఖ కొమ్మాదిలోని చైతన్య కాలేజీలో ఘటన.. 

4వ అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్మరణం 

ఫొటోలు తీసి ఫ్యాకల్టీ బెదిరించాడని తండ్రికి మెసేజ్‌.. కాలేజీలో లైంగిక వేధింపులు నిత్యకృత్యం  

పోలీసులకు చెప్తే ఫొటోలు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామని బెదిరిస్తున్నారు  

మధురవాడ (భీమిలి): కాలేజీల్లో కామ పిశాచాల వేధింపులు తాళలేక కొంతమంది అమ్మాయిలు చదువులు మధ్యలోనే మానివేస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలే శరణ్యమని భావించి చిన్నతనంలోనే తనువులు చాలిస్తున్నారు. ఫ్యాకల్టీయే బరితెగించి లైంగికంగా వేధింపులు పాల్పడగా.. తట్టుకోలేకపోయిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని కొమ్మాది చైతన్య ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగింది.

ఇక్కడ డిప్లమా మొదటి సంవత్సరం చదువుతున్న రూపశ్రీ (16) లైంగిక వే«ధింపులకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్యాకల్టీ లైంగిక వేధింపులు తాళలేక పోతున్నానంటూ తండ్రికి మెసేజ్‌ పెట్టి గురువారం అర్ధరాత్రి 1.05 నిమిషాలకు ప్రాంతంలో హాస్టల్‌ భవనం 4వ ఫ్లోర్‌ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.  
 
విద్యా సంస్థ నిర్లక్ష్యమే కారణం 
విద్యా సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తన కుమార్తె మృతి చెందిందని బాలిక తండ్రి గండికోట రమణ ఆవేదన వ్యక్తం చేశాడు. నర్సీపట్నం సమీపంలోని నాతవరం మండలం పద్మ­నాభపురానికి చెందిన రైతు కూలి గండికోట రమ­ణ, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు పెళ్లయి అగనంపూడిలో ఉంటోంది. ఆఖరి కుమార్తె తల్లిదండ్రుల వద్దే ఉండి చదువుకుంటోంది. రెండో కుమార్తె రూపశ్రీ కొమ్మాది కాలేజీ హాస్టల్లో ఉండి చదువుతోంది.

రూపశ్రీ కనిపించడం లేద­ని తండ్రికి కళాశాల సిబ్బంది ఫోన్‌ చేసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీ­సులు వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత రూపశ్రీ అర్ధరాత్రి 12.48 గంటలకు 3వ ఫ్లోర్‌ నుంచి 4వ ఫ్లోర్‌కి వెళ్లి, 1.05కి 4 ఫ్లోర్‌ నుంచి కిందకి దూకిందని తెలిసింది. దూకే క్రమంలో చెట్టుకు తగిలి కిందకి పడి తీవ్రంగా గాయపడింది. రూపశ్రీని తరలించిన ఆస్పత్రికి అల్లుడు హరికృష్ణతో కలసి రమణ చేరుకునే లోపు రూపశ్రీ మృతి చెందింది. 

తండ్రి సెల్‌కి పంపిన మెసేజ్‌ ఇలా.. 
హాయ్‌ అమ్మా, నాన్న, అక్కా, చెల్లి మరియు కుటుంబ సభ్యులకు.. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాను. నేను ఆత్మహత్య చేసుకోవడానికి  కారణం ఏమిటంటే ఈ కాలేజీలో లైంగిక వే«ధింపులు జరుగుతున్నాయి నాన్న. మరి ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఆ ఫ్యాకల్టీలో ఒకరు అని అంటే ఇంకేం చెప్పగలం నాన్న. చాలా చెండాలంగా ప్రవర్తిస్తున్నాడు. ఫొ­టో­లు కూడా తీసుకుని బెదిరిస్తున్నారు. స్టూడెంట్స్‌కి చెప్పాల్సిందిపోయి ఆ ఫ్యాకల్టీ ఇలా ప్రవర్తిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి నాన్న? నా ఫొటో­లు కూడా తీసి బెదిరిస్తున్నారు నాన్న.

ఇంకా నా­కు ఒక్కదానికే కాదు ఇంకా కాలేజీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఎవరికి చెప్పకోలేక. అలా అని కాలేజికి వెళ్లలేక మధ్యలో నలిగిపోతు­న్నాం నాన్న. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సోష­ల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తాం అని బెదిరిం­చా­రు. నాకే వేరే దారి కనిపించలేదు. ఎవ­రో ఒకరు చస్తేనే కానీ ఈ విషయం బయట ప్రప­ం­చానికి తెలియదు ఆ పని నేనే చేస్తున్నా. క్షమించండి నాన్నా.

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కళాశాల 
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజుకు చెం­దిన కళాశాల ఇది. ఇక్కడ యాజమాన్యం అ­త్యం­త బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మృతురాలు తండ్రి, సగర సామాజిక వర్గ కుల పెద్దలు ఆరోపిస్తున్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

పోక్సో, ర్యాగింగ్‌ కేసు నమోదు 
మృతురాలు రూపశ్రీతో పాటు ఇంకా ఎంత మంది విద్యార్థులు వేధింపులకు గురయ్యారనే అంశంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. పాఠశాల యాజమాన్య ప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.

నిందితులపై పోక్సో యాక్ట్, ఆత్మహత్యకు ప్రేరేపించడం, ర్యాగింగ్‌ తదితర కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పీఎం పాలెం సీఐ రామకృష్ణ తెలిపారు. ఇక విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలపై తక్షణం నివేదిక అందజేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు గొండి సీతారాం నగర పోలీసులను, సాంకేతిక విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement