PC: IPL
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను ఉద్దేశించి ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీఎస్‌కే సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని పట్ల వారి అభిమానం తనకు, రవీంద్ర జడేజాకు చిరాకు తెప్పించేందన్నాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై ఒకటి. దీనికి ముఖ్య కారణం టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది యువ ఆటగాళ్లు అతడి సారథ్యంలో మెరికల్లా తయారై జాతీయ జట్ల తరఫున అదరగొడుతున్నారు.
ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో జట్టుపై నిషేధం పడినా.. తిరిగి సీఎస్‌కేను నిలబెట్టిన ఘనత ధోని సొంతం. రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్) తర్వాత రికార్డు స్థాయిలో ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన కెప్టెన్‌గా ధోని మాత్రమే నిలవగలిగాడు.
తదుపరి తన వారసుడిగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగిస్తే.. ఒత్తిడి తట్టుకోలేక 2022 మధ్యలోనే బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో 42 ఏళ్ల ధోని 2023లో టైటిల్ సాధించిన తర్వాత.. ఈ ఏడాది రుతురాజ్ గైక్వాడ్‌కు తన బాధ్యతలను బదిలీ చేశాడు.
ఇక చాలా ఏళ్లుగా సీఎస్‌కే ముఖచిత్రమైన మిస్టర్ కూల్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తలా అని ముద్దుగా పిలుచుకునే తమ నాయకుడిని చూసేందుకు కేవలం చెన్నై ఫ్యాన్స్ మాత్రమే కాదు.. దేశంలో ఎక్కడున్నా అతడి అభిమానులు మ్యాచ్ చూసేందుకు మైదానానికి పోటెత్తుతారు.
ఈ క్రమంలో అతడు త్వరగా బ్యాటింగ్‌కు రావాలంటూ కోరుకునే అభిమానులు బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందున్న జడ్డూ లాంటి వాళ్లు త్వరగా అవుట్ కావాలంటూ గతంలో ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో జడ్డూ వాళ్లపై అసహనం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డాడు. దీంతో ఫ్యాన్స్ సైతం అతడికి ధీటుగానే బదులిచ్చారు.
ఈ నేపథ్యంలో అంబటి రాయుడు తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. "మనం సిక్స్, ఫోర్ కొట్టినా ప్రేక్షకులు సైలెంట్‌గా ఉంటారు. జడేజాకు, నాకు ఈ విషయం విసుగు తెప్పించేది.
నిజానికి సీఎస్‌కే ఫ్యాన్స్ ముందు జట్టుకు అభిమానులు కాదు.. వాళ్లు కేవలం ధోని అభిమానులు మాత్రమే. అందుకే జడ్డూకు కూడా చిరాకు వచ్చేది. కానీ అతడు మాత్రం ఏం చేయగలడు అని వ్యాఖ్యానించాడు.
కాగా 2018 నుంచి 2023 వరకు సీఎస్‌కే ఆడిన అంబటి రాయుడు గతేడాది ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో సీఎస్‌కే పదమూడింట ఏడు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment