LIVE: తిరుపతి ఘటనపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్
Breaking News
సినిమాలు మానేయాలనుంది, గతేడాదే ఈ పని చేయాలనుకున్నా!
Published on Thu, 01/09/2025 - 15:53
మసాలా సినిమాల్లో నటించేదే లేదన్న నిత్యామీనన్ (Nithya Menen) ఇకమీదట అసలు సినిమాలే చేయనంటోంది. మొన్నటివరకు మంచి పాత్ర అయితే చాలు చిన్న సినిమా అయినా అంగీకరిస్తాన్న ఆమె ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేశాక సినీ ఇండస్ట్రీని శాశ్వతంగా వదిలేస్తానంటోంది.
అమ్మ వల్లే ఇదంతా..
ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం కాదలిక్క నెరమిళ్లై (Kadhalikka Neramillai Movie) సంక్రాంతికి విడుదలవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాడటం, డ్యాన్స్ చేయడం, యాక్ట్ చేయడం.. ఇవన్నీ కూడా మా అమ్మే చిన్నప్పటి నుంచి నాతో చేయించింది. నిజం చెప్పాలంటే నాకు సినిమా అంటే ఇష్టం లేదు. అయినా ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే ఉన్నాను.
సినిమా నన్ను వదిలేలా లేదు!
సినిమాలు మానేయాలని ఆలోచించిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. ఈసారి గప్‌చుప్‌గా పక్కకు వెళ్లిపోదామని ఆలోచిస్తున్నప్పుడే తిరుచిత్రంపళం మూవీకి జాతీయ అవార్డు వచ్చింది. అప్పుడు నాకో విషయం అర్థమైంది. నేను సినిమాలు మానేసినా.. సినిమా నన్ను వదిలేలా లేదు అని! ఇప్పటికిప్పుడు నాకు వేరే ఇండస్ట్రీలో ఏదైనా అవకాశం వస్తే కచ్చితంగా దాంట్లోకి వెళ్లిపోతాను.
(చదవండి: తెలంగాణలో 'గేమ్ ఛేంజర్' టికెట్ల పెంపుపై విమర్శలు )
అలాంటి జీవితం కావాలి
నాకు సాధారణ జీవితం గడపాలని ఉంది. నటిగా ఉన్నప్పుడు బయట స్వేచ్ఛగా జీవించలేం. నాకు పార్క్‌కు వెళ్లి వాకింగ్ చేయాలనుంటుంది. కానీ అది సాధ్యపడదు. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. పైలట్ అవ్వాలని కోరిక.. ఇలా ఎన్నో ఉంటాయి అని చెప్పుకొచ్చింది. నిత్య సినిమాలు మానేయాలనుకోవడం కొత్తేమీ కాదు..
ఉత్తమ నటిగా జాతీయ అవార్డు
కాగా తిరు సినిమాకుగానూ నిత్యామీనన్‌కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. ఈ మూవీలో ధనుష్ హీరోగా నటించగా రాశీ ఖన్నా హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. హీరో స్నేహితురాలిగా నిత్య ఆకట్టుకుంది. మిత్రన్ జవహర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇది 2022లో విడుదలైంది. నిత్య లేటెస్ట్ మూవీ కాదలిక్క నెరమిళ్లై విషయానికి వస్తే.. ఇందులో జయం రవి, వినయ్, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. రెడ్ జియాంట్ సినిమా నిర్మిస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.
తెలుగులో..
అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యా మీనన్. అలా మొదటి చిత్రంతోనే జనాలకు బాగా నచ్చేసింది. 180, ఇష్క్, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, అ, నిన్నిలా నిన్నిలా, భీమ్లా నాయక్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడాయ్, డియర్ ఎక్సెస్ సహా మరో సినిమా చేస్తోంది.
చదవండి: తిరుపతి తొక్కిసలాట: హృదయాన్ని కలిచివేసిందన్న మోహన్‌బాబు
Tags