మత్స్యకారులను జైలు నుంచి విడిపించిన రియల్ హీరో వైఎస్ జగన్: మత్స్యకారులు
Breaking News
పెళ్లి మంటపాల్లో ‘డబ్బు’ వాద్యాలు
Published on Wed, 02/05/2025 - 00:12
‘మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్’ అన్నమాట ఎంతవరకు నిజమో కానీ పెళ్లి వేడుకకు ఆకాశమే హద్దుగా మారిందన్నది మాత్రం వంద శాతం నిజం! కిందటేడు అంటే 2024లో ఒక్క నవంబర్, డిసెంబర్ నెలల్లోనే 4.8 లక్షల పెళ్లిళ్లయ్యాయి. అవి ఆరు లక్షల కోట్ల వ్యాపారం చేశాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ నివేదిక! దీని ప్రకారం ఈ మొత్తం 4.8 లక్షల్లో రూ. 3 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు పెట్టిన వివాహాలున్నాయి. ఈ లెక్క చూశాక తెలిసింది కదా.. పెళ్లి ఖర్చుకు ఆకాశమే హద్దు అని!
ఆచార సంప్రదాయాలు, వ్యవహారాలు, పెట్టుపోతలు ఇవన్నీ ఆడంబరాలుగా మారి పెళ్లిఖర్చును పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి అనేది ఒక పెద్ద పరిశ్రమగా మారిపోయింది. జనవరి 30 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలయ్యాయి. మార్చి 10 వరకు సందడే సందడి! ఆ సందర్భంగా మ్యారేజ్ ఇండస్ట్రీ, మధ్యతరగతి (Middle Class) మీద ప్రభావం వంటివి స్పృశిస్తూ ఒక కథనం..
మన దేశంలో సగటు వివాహ ఖర్చు.. ఒక ఇంటి ఏడాది ఆదాయం కంటే మూడు రెట్లు ఎక్కువ! అది మన దేశ వెడ్డింగ్ ఇండస్ట్రీని (Wedding Industry) దాదాపు రూ. లక్షాపదమూడు కోట్లతో ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటిగా చేర్చింది. ఇది అమెరికా వెడ్డింగ్ మార్కెట్ (US Wedding Market) కన్నా రెండింతలు పెద్దది. కోవిడ్ తర్వాత పెళ్లి వ్యయం మరింత ప్రియం అయింది. అతిథుల సంఖ్య తగ్గింది. కానీ ఖర్చు నయా పైసా కూడా తగ్గలేదు. ఇదివరకు ఆడపిల్ల పెళ్లంటే బంధువులు, స్నేహితులు అన్నిరకాలుగా అండగా నిలిచి ఉన్నదాంట్లో ఆ వేడుకను సంప్రదాయబద్ధంగా జరిపించి తల్లిదండ్రులు తేలికపడేలా చేసేవారు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారైతే ఇల్లు వాకిలి, పొలమూ పుట్రా అమ్మడమో, తాకట్టు పెట్టడమో చేసి పెళ్లి జరిపించేవారు.
అప్పుడు వరకట్నాలు లాంఛనాలు, బంగారం కిందే జమయ్యేవి. ఇప్పుడా సీన్ మారిపోయింది. అమ్మాయిలూ ఉద్యోగాలు చేస్తున్నారు. పర్ఫెక్ట్ ప్లాన్‌తో ఉంటున్నారు. ఆ ప్రణాళికలో పెళ్లికీ ప్రయారిటీ ఇస్తున్నారు. హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లి కూతురు– పెళ్లికొడుకు సహా పెళ్లిని అయిదు రోజుల ఈవెంట్స్‌తో ఘనంగా జరిపించుకోవాలనుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలే కాదు సోషల్ మీడియా షాట్స్, రీల్స్గానూ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు.
వీటన్నిటి ఖర్చు కోసం కొలువు తొలిరోజు నుంచే ఆదా చేయడం మొదలు పెడ్తున్నారు. అలా పెళ్లి ఖర్చును అమ్మాయిలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. కట్నకానుకలను మాత్రం తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావిస్తున్నారు. అవి స్థిర, చరాస్తులుగా రూపాంతరం చెందాయి. అమ్మాయి పేరు మీదే ఉంటున్నాయి. అవీ పెళ్లి ఖర్చులో భాగమయ్యి, తల్లిదండ్రులు పెట్టే ఖర్చుల జాబితాలో చేరుతున్నాయి. అయితే ఇవి మ్యారేజ్ ఇండస్ట్రీలో కలవని అదనపు ఖర్చన్నమాట.
బ్యాచిలర్.. బ్యాచిలరేట్ పార్టీలు కూడా..
దేశంలో సగటు మధ్యతరగతి కుటుంబం కూడా పెళ్లి మీద భారీగా ఖర్చుపెడుతోందంటోంది సీఏఐటీ సర్వే! తెలుగు రాష్ట్రాల్లో అయితే అది కనిష్టంగా రూ. 30 లక్షలు. పెళ్లి వేదిక, వచ్చే అతిథుల సంఖ్య, వంటకాల సంఖ్య, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సోషల్ మీడియా రీల్స్, షాట్స్ వగైరాలను బట్టి ఈ బడ్జెట్ పెరుగుతుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) అయితే అది రూ. కోటి దాటుతోంది. ఈ ΄్యాకేజ్లో బ్యాచ్‌లర్, బ్యాచ్లరెట్ ట్రిప్స్ కూడా ఉన్నాయి.
ఇప్పుడు పెళ్లి ఖర్చును వధూవరులిద్దరూ సమంగా పెట్టుకునే ఆనవాయితీ మొదలైంది. ఇది ఒకందుకు మంచి పరిణామంగానే భావించినా.. అసలు పెళ్లనేది వ్యక్తిగత లేదా రెండు కుటుంబాలకు చెందిన వ్యవహారం. దానికి అంతంత ఖర్చుపెట్టాల్సిన అవసరం ఏముందని అబీప్రాయపడుతున్నారు సోషల్ ఇంజినీర్స్. ఫలానా వాళ్ల పిల్లల పెళ్లి కన్నా గొప్పగా తమ పిల్లల పెళ్లి చేయాలని తల్లిదండ్రులు, తమ స్నేహితులు.. కొలీగ్స్ కన్నా ఘనమనిపించుకోవాలని వధూవరులు.. పోటీలకు పోతూ, ఉన్న సేవింగ్స్ అన్నీ ఊడ్చేసుకుని.. అప్పులు కూడా తెచ్చుకుని మరీ పెళ్లి చేస్తున్నారు.. చేసుకుంటున్నారు.
ఎస్బీఐ సహా పేరున్న ప్రైవేట్ బ్యాంకులన్నీ పెళ్లిళ్లకు లోన్స్ ఇస్తున్నాయి. పర్సనల్ లోన్ ఖాతాను పెంచడంలో వీటి పాత్ర గణనీయం. కస్టమ్ వెడ్డింగ్ లోన్ప్రోడక్ట్స్ బ్యాంకుల డిమాండ్‌నూ పెంచుతున్నాయి. ఈ అప్పులను తీర్చడానికి ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వోద్యోగులైతే ఆ అప్పులు తీర్చడానికి అవినీతికి పాల్పడిన దాఖలాలూ ఉన్నాయంటున్నారు సోషల్ ఇంజినీర్స్. ఈ అప్పులతో కొత్త పెళ్లిజంట మధ్యలో కూడా స్పర్థలు వచ్చి విడాకుల దాకా వెళ్లిన సంఘటనలూ ఉన్నాయని చెబుతున్నారు.
ఇవీ ఉన్నాయి..
ఈ ఘనమైన మాయకు ఇరుగు పొరుగు, బంధుగణం, తోటివాళ్లే కాదు సినిమాలు, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లూ బాధ్యులు. ‘మురారి’ సినిమా వచ్చిన కొత్తలో మాట.. ఒక ప్రోగ్రెసివ్ కుటుంబంలోని అమ్మాయి ‘మురారీ’ సినిమాలో పెళ్లి సీన్స్‌కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి.. తన పెళ్లి ఆ సినిమాలో చూపించినట్టే జరగాలని పట్టుబట్టి మరీ ఆ తరహాలోనే పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు తమ అమ్మాయి పెళ్లికోసం అప్పట్లోనే అయిదు లక్షల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. ఇందులో బాలీవుడ్ పాత్రా ఉంది. ఈ మెహందీ, హల్దీ, సంగీత్, డిజైనర్ వేర్ వంటివన్నీ దాని పుణ్యమే! వెడ్డింగ్ ప్లానర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ థింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్, రీల్స్, షాట్స్ లాంటి వాటన్నిటికీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఓటీటీ సిరీస్‌ల ప్రభావం కారణమంటున్నారు ట్రెండ్ ఎనలిస్ట్‌లు.
వృథా కూడా అదే స్థాయిలో!
ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.7 బిలియన్ టన్నులు అంటే మనిషి పండించే పంటలో మూడొంతులు వృథా అవుతోందట. ఈ వృథాలో అధిక వాటా పెళ్లిళ్లు లాంటి వేడుకలదే! అందులో మనమేం తక్కువలేం! ఈ వృథా వల్ల ఇంకొకరి ఆహారపు హక్కును మనం హరించినట్టే! అంతేకాదు.. ఈ ట్రెండ్ ధరలనూ ప్రభావితం చేసి నిత్యవసరాలను అందుకోలేనంత ఎత్తులో పెట్టేస్తోంది.
ఇకో ఫ్రెండ్లీ
యువత అంతా లగ్జరీ వైపే చూస్తోందని ఆందోళన చెందక్కర్లేదు. పెళ్లనేది పూర్తి వ్యక్తిగత వ్యవహారంగా భావించి రిజిస్టర్ మ్యారేజ్‌తో ఒక్కటవుతున్న జంటలూ ఉన్నాయి. తమ పెళ్లికి ఆత్మీయులు, సన్నిహితుల ఆశీస్సులు అవసరమనుకునేవారు దాన్ని కుటుంబ వేడుకకే పరిమితం చేసుకుంటున్నారు. అనవసర ఖర్చు లేకుండా, స్థానికంగా దొరికే వస్తువులతోనే పర్యావరణహితంగా మలచుకుంటున్నారు. ఈ జంటలే భవిష్యత్ జంటలకు మార్గదర్శకంగా నిలవాలని ఆశిద్దాం!
ఈ మెహందీ, హల్దీ, సంగీత్, డిజైనర్ వేర్ వంటివన్నీ సినిమాల పుణ్యమే! వెడ్డింగ్ ప్లానర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ థింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్, రీల్స్, షాట్స్ లాంటి వాటన్నిటికీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఓటీటీ సిరీస్‌ల ప్రభావం కారణమంటున్నారు ట్రెండ్ ఎనలిస్ట్‌లు.
– సరస్వతి రమ
⇒ పెరుగుతున్న పెళ్లి ఖర్చును అదుపు చేయాల్సిందిగా 2017లో రంజిత్ రంజన్ అనే కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్లో ‘ప్రివెన్షన్ ఆఫ్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఆన్ స్పెషల్ అకేషన్స్’ అనే ప్రైవేట్ బిల్‌ను ప్రవేశపెట్టాడు. దీనిప్రకారం పెళ్లికి అతిథుల సంఖ్య వందకు, పదిరకాల వంటకాలు, కానుకల విలువ రూ. 2,500కు మించరాదు. ఎవరైనా పెళ్లి మీద రూ. 5 లక్షలకు మించి ఖర్చు పెడితే పది శాతం డబ్బును ప్రభుత్వ సంక్షేమ నిధికి ఇవ్వాలి. అలా జమ అయిన మొత్తాన్ని ప్రభుత్వం ఏటా పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఖర్చుపెట్టాలి. కానీ ఈ బిల్లు ఆమోదం పొందలేదు.
చదవండి: పుస్తకాలు మా ఇంటి సభ్యులు
⇒ 1993లో నాటి ఒడిశా ముఖ్యమంత్రి బిజు పట్నాయక్.. పెళ్లికి ముందు పెళ్లిలో రూ. 25 వేలకు మించి ఖర్చు చేయకూడదంటూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాడు. కానీ అదీ పాస్ అవలేదు.
కన్‌స్ట్రక్టివ్‌గా ఇన్వెస్ట్ చేసుకోవాలి
సంపాదించుకుంటున్నాం కదాని ఉన్న సేవింగ్స్ అన్నిటినీ పెళ్లి అట్టహాసాలకే ఖర్చు చేయడం కరెక్ట్ కాదు. ఉన్న వాళ్లు ఎంత ఖర్చుపెట్టుకున్నా పర్లేదు. కాని వాళ్లను మిడిల్‌క్లాస్ పీపుల్ ఫాలో అయితేనే తర్వాత ఆర్థికంగా, ఎమోషనల్‌గా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పులు చేసి మరీ మన చుట్టూ ఉన్నవాళ్లను మెప్పించడం వల్ల మన ఇల్లు గుల్లవడం తప్ప పైసా ప్రయోజనం ఉండదు. పెళ్లి తర్వాత ఇల్లు, పిల్లలు .. వాళ్ల చదువులు లాంటి ఎన్నో బాధ్యతలుంటాయి. వాటి కోసం సేవింగ్స్‌ని ప్లాన్ చేసుకోవాలి. కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఆచితూచి మదుపు చేసుకోవాలి. దానివల్ల మనం సంతోషంగా ఉండటమే కాదు ప్రకృతి వనరులను, శ్రమను గౌరవించిన వాళ్లమవుతాం!
– డాక్టర్ కస్తూరి అలివేలు, అసోసియేట్ప్రోఫెసర్, డీన్, డీజీఎస్ సెస్, హైదరాబాద్.
డిమాండ్ పెరిగింది
పెళ్లి ఫొటో, వీడియోగ్రఫీలు తక్కువలో తక్కువ రెండు లక్షల నుంచి మొదలు ఈవెంట్స్ కవరేజ్‌ను బట్టి బడ్జెట్ పెరుగుతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం స్టూడియోస్ కూడా ఉన్నాయి. డబ్బుండి, టైమ్ లేని వాళ్లు ఆ స్టూడియోస్‌లో షూట్స్‌ని ప్రిఫర్ చేస్తుంటే.. డబ్బు, టైమ్ రెండూ ఉన్నవాళ్లు విదేశాలకూ వెళ్లి షూట్ చేయించుకుంటున్నారు. మొత్తం మీద ఫొటో, వీడియోగ్రాఫర్స్తోపాటు ఈ స్టూడియోస్కీ డిమాండ్ బాగా పెరిగింది.
– వీఎన్ రాజు, వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్
కాంప్రమైజ్ అవ్వట్లేదు
వెడ్డింగ్ సెలబ్రేషన్స్ విషయంలో ఎవరూ కాంప్రమైజ్ అవట్లేదు. కోవిడ్ తర్వాత ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది. పెళ్లికి వచ్చే అతిథులు తగ్గారు కానీ.. వేడుకల విషయంలో మాత్రం ఎవరూ వెనకడుగు వేయట్లేదు. మధ్యతరగతి వాళ్లు కూడా వెడ్డింగ్ ప్లానర్‌ని పెట్టుకుంటున్నారు. ఎంత తక్కువనుకున్నా 30 లక్షల నుంచి మొదలవుతోంది వెడ్డింగ్ బడ్జెట్. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అయితే 50.. 60 లక్షలు ఇంకా ఆపై కూడా ఉంటోంది. ఇదివరకు ఈవెంట్స్ అన్నీ ఫొటోలు, వీడియోలకే పరిమితమై ఉండేవి. ఇప్పుడు రీల్స్, షాట్స్‌లో సోషల్ మీడియాలోనూ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు.
బ్రైడ్ అండ్ గ్రూమ్ కొత్త కొత్త ఐడియాలతో వచ్చి వాటిని అమలు చేయడానికి ప్లాన్లు అడుగుతున్నారు. పీర్స్ కన్నా డిఫరెంట్‌గా ఉండాలనీ, తామే ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయాలనే ఆలోచనతో వస్తున్నారు. ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. దీంతో వెడ్డింగ్ ప్లానర్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. వాళ్లమధ్య పోటీ కూడా ఎక్కువే ఉంటోంది. కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు వెడ్డింగ్ ప్లానర్ అనే బోర్డ్ పెట్టేసుకుంటున్నారు.
– వర్ధమాన్ జైన్, వెడ్డింగ్ ప్లానర్
Tags