Global Economic Crisis
-
భారత్ ఎకానమీకి ఢోకాలేదు: అనంత నాగేశ్వరన్
ముంబై: అంతర్జాతీయ కారణాలతో చమురు ధరల్లో పెరుగుదలసహా ప్రపంచ ఆర్థిక మందగమనం, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు వచ్చే ఆర్థిక సంవత్సరం (2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి) భారత్ ఎకానమీపై ప్రభావం చూపుతాయని తాను భావించడం లేదని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఆర్బీఐ అంచనాల ప్రకారం, 7 శాతం వృద్ధి ఖాయమని అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ నిర్వహించిన ఒక ఎకనమిక్ కన్‌క్లేవ్‌లో ఆయన ప్రసంగిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా వడ్డీరేట్ల తగ్గుదలకు ముందు ఆర్థిక క్రియాశీలత నెమ్మదిస్తుందన్నది తన అభిప్రాయమని అన్నారు. -
రుణగ్రస్తుల ఆశలపై ఆర్బీఐ నీళ్లు?
రుణ గ్రస్తులు ఎంతో ఆతృగా ఎదురు చూస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్ష అక్టోబర్ 4- 6 తేదిల్లో జరగనుంది. సాధారణంగా ఆర్బీఐ ఎంపీసీ సమావేశం అంటే ప్రధానంగా వడ్డీ రేట్లు పెంపు, తగ్గింపుపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే మరో రెండ్రోజుల్లో జరిగే ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని సమాచారం. 2022 మే నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యకాలంలో వివిధ దశల్లో ఆర్బీఐ రెపోరేటును 2.5 శాతం పెంచింది. దీంతో రెపో రేటు 6.5 శాతానికి చేరింది. ఆ తర్వాత వరుసగా రెపో రేట్లను యథాతదంగా కొనసాగిస్తూ వచ్చింది. దీంతో రిటైల్, గృహ, వాహన రుణాలు ప్రియమయ్యాయి. రుణ గ్రహీతలపై భారం పడింది. ఈ తరుణంలో వచ్చే సమీక్షాలోనూ ఆర్బీఐ ఖాతాదారులకు ఉపశమనం కలిగించేలా వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని రుణగ్రస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా.. దీనిపై స్పష్టత వచ్చేందుకు మరి కొంత సమయం ఎదురు చూడాల్సి ఉంది. -
యాక్సెంచర్ సంచలనం: ఏకంగా 19వేలమందికి ఉద్వాసన
సాక్షి,ముంబై: ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఐటీ కంపెనీలను భారీగా ప్రభావితం చేస్తోంది. తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ కూడా తన ఉద్యోగులకు భారీ షాక్ ఇస్తోంది. కంపెనీ ఆదాయ క్షీణత నేపథ్యంలో 19వేల ఉద్యోగాలను తీసివేయనుంది. అటు వార్షిక రాబడి, లాభాల అంచనాలను కూడా తగ్గించింది. ఈ మేరకు కంపెనీ గురువారం అధికారికంగా ప్రకటించింది. అయితే ఇందులో ఎంతమంది భారతీయ ఉద్యోగులు ప్రభావితం కానున్నారనేదానిపై స్పష్టత లేదు. తమ సిబ్బందిలో 2.5 శాతం లేదా 19,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలిపింది. సగానికి పైగా తొలగింపులు నాన్ బిల్ కార్పొరేట్ ఫంక్షన్ల సిబ్బందిని ప్రభావితం చేస్తాయని వెల్లడించింది. మరోవైపు యాక్సెంచర్ తమ వార్షిక రాబడి వృద్ధిని కూడా కుదించుకుంది. గతంలో అంచనా వేసిన 8-11 శాతంతో పోలిస్తే 8-10శాతం మధ్య ఉంటుందని భావిస్తోంది. (ఇదీ చదవండి: ట్యాక్స్‌పేయర్ల కోసం స్పెషల్ యాప్, ఎలా పనిచేస్తుంది?) 2023 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో, ముఖ్యంగా వ్యూహాత్మక వృద్ధి ప్రాధాన్యతలకు మద్దతు నిమిత్తం నియామకాలను కొనసాగిస్తున్న క్రమంలో తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి , ఖర్చులను తగ్గించడానికి ఈ చర్యలను ప్రారంభించామని రాబోయే 18 నెలల్లో ఉద్యోగుల కోతలుంటాయని తెలిపింది. అంతేకాదు గతంలో 11.20 -11.52 డాలర్లతో పోలిస్తే ఒక్కో షేరుకు సంపాదన10.84-11.06 డాలర్ల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. (సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు) (రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 1,999కే) -
ఎకానమీ సవాళ్లను పరిష్కరించాలి!
బెంగళూరు: అంతర్జాతీయ ఆర్థిక అవుట్‌లుక్ ఇటీవలి నెలల్లో మెరుగుపడినప్పటికీ, అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. గ్లోబల్ ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంపై జీ20 దేశాలు దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న రుణ సమస్యలు, ఆర్థిక స్థిరత్వానికి ఎదురవుతున్న సవాళ్లను దృఢ సంకల్పంతో పరిష్కరించాలని కూడా జీ20 దేశాలకు పిలుపునిచ్చారు. జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీసీ) ప్రారంభ సమావేశంలో దాస్ చేసిన ప్రసంగ ముఖ్యాంశాలు.. ► ప్రపంచం తీవ్ర మాంద్యం నుండి తప్పించుకోవచ్చని, వృద్ధి మందగమనం లేదా అంతగా తీవ్రత లేని మాంద్యం పరిస్థితులే సంభవించవచ్చని ఇప్పుడు గొప్ప ఆశావాదం ఉంది. అయితే, ఇంకా అనిశ్చిత పరిస్థితులు మన ముందు ఉన్నాయి. ►మధ్యస్థంగా, దీర్ఘకాలికంగా మనం ఎదుర్కొంటున్న సవాళ్లను మనం కలిసికట్టుగా దృఢంగా పరిష్కరించాలి. ఆర్థిక స్థిరత్వానికి సవాళ్లు, రుణ ఇబ్బందులు, క్లైమాట్ ఫైనాన్స్, వాణిజ్య రంగంలో పరస్పర సహకారం లోపించడం, గ్లోబల్ సరఫరాల సమస్యలు ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. పటిష్ట ప్రపంచ ఆర్థిక సహకారంతో ప్రపంచ వృద్ధి విస్తృత స్థాయిలో మెరుగుపరచడం సాధ్యమవుతుంది. ► జీ20 గ్రూప్ ప్రస్తుతం పరివర్తన దిశలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి జీ20 ఒక బహుపాక్షిక ఫోరమ్‌గా అచంచలమైన విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది. -
పాకిస్తాన్ రూపాయి రికార్డు స్థాయిలో పతనం.. శ్రీలంక సీన్ రిపీట్!
ఇస్లామాబాద్: దాయాది దేశంలో పాకిస్తాన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్ కరెన్సీ(రూపాయి) విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. రూపాయి విలువ గురువారం డాలర్‌కు 255 రూపాయలకు పడిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కేవలం ఒక్కరోజులోనే 24 రూపాయలు పతనమైనట్లు తెలిపాయి. ఇక, బుధవారం పాక్ కరెన్సీ విలువ రూ. 230.89గా ఉండగా.. అది గురువారానికి రికార్డు స్థాయిలో పతనమైంది. అయితే, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కెందుకు పాక్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే కరెన్సీ మారకపు రేటు నిబంధనలను మరింత సరళతరం చేసింది. దీంతో, కరెన్సీ విలువ ఒక్కసారిగా పడిపోయింది. మరోవైపు.. కరెన్సీపై పాక్ ప్రభుత్వం నియంత్రణలను సరళీకరించాలని, రూపాయి మారకపు విలువను మార్కెట్ నిర్ణయించేలా చూడాలని ఐఎంఎఫ్(అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) పాకిస్తాన్‌ను కోరింది. ఈ క్రమంలోనే ఐఎంఎఫ్ వద్ద ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 6.5 బిలియన్ డాలర్ల నిధుల విడుదలకు ఆమోదం తెలుపుతుందనే ఉద్దేశంతో పాకిస్తాన్ వెంటనే ఈ నిబంధనకు అంగీకారం తెలిపింది. ఇదిలా ఉండగా.. 2019లోనే పాకిస్తాన్‌కు సాయం అందించేందుకు ఐఎంఎఫ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కానీ, 6.5 బిలియన్ డాలర్ల సాయం విషయంలో కొన్ని షరతులు విధించింది. పాక్‌కు నిధులు ఇవ్వాలంంటే కరెంట్స్ సబ్సిడీలను ఉపసహరించుకోవాలని ఐఎంఎఫ్ సూచించింది. అలాగే, పాక్ రూపాయి మారక విలువను మార్కెట్ ఆధారంగా నిర్ణయించాలనీ, లెటర్ ఆఫ్ క్రెడిట్లపై నిషేధం తొలగించాలని ఐఎంఎఫ్ కండీషన్స్ పెట్టింది. అయితే, ఈ షరతులకు అప్పటో పాకిస్తాన్ ఒప్పుకోలేదు. దీంతో, ఆర్థిక సాయం నిలిచింది. తాజా పరిస్థితుల్లో ఆర్థిక సాయం తప్పనిసరి కావడంతో పాక్ ఐఎంఎఫ్ షరతులకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో ఇప్పటికే విద్యుత్ సంక్షోభం నెలకొనగా, ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒక ప్యాకెట్ పిండి రూ.3వేల కంటే ఎక్కువ ధర పలుకుతోంది. అంతే కాకుండా పాకిస్తానీలు ఆహార ట్రక్కుల వెంట పరుగులు తీస్తున్న వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. విదేశీ మారక నిల్వల తగ్గిపోవడంతో ఇంధన కొరతకు దారి తీసింది. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద దారి పొడవునా వాహనదారులు బారులుతీరారు. పొదుపు చర్యలే శరణమంటున్న పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ పొదుపు చర్యలపై దృష్టి పెట్టింది. ఎంపీల వేతనాల్లో 15 శాతం కోత పెట్టింది. వారి విదేశీ పర్యటనలు, లగ్జరీ వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది. గ్యాస్, విద్యుత్ ధరలు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. నిఘా సంస్థలకు విచ్చలవిడిగా నిధులు విడుదల చేయరాదని తీర్మానించింది. చమురు దిగుమతులు గుదిబండగా మారిన నేపథ్యంలో అన్ని స్ధాయిల్లో పెట్రోల్ వాడకాన్ని 30 శాతం తగ్గించుకోవాలని నిర్ణయానికొచ్చింది. -
మందగమనంలోనూ మెరుగ్గానే భారత్
చెన్నై: అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం మధ్యలోనూ భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉండగలదని బహుళజాతి ఆటోమొబైల్ దిగ్గజం స్టెలాంటిస్ సీఈవో కార్లోస్ టవారెస్ చెప్పారు. గణనీయ వృద్ధి సాధించేందుకు, ’సూపర్‌పవర్’గా ఎదిగేందుకు భారత్‌కు పుష్కలమైన సామర్థ్యాలు ఉన్నాయని ఆయన తెలిపారు. పాశ్చాత్య దేశాలు (అమెరికా, యూరప్) – చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకోగలదని చెప్పారు. ‘2023లో అంతర్జాతీయ ఎకానమీ మందగించబోతోందని అందరూ భావిస్తున్నారు. ఇలాంటప్పుడు కూడా భారత్ 6–7 శాతం వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నారు. ఇది కచ్చితంగా చాలా అధిక వృద్ధిగానే భావించవచ్చు‘ అని కార్లోస్ వివరించారు. ఒకవేళ దేశీయంగా ఆటోమోటివ్ మార్కెట్ కొంత మందగించినా తాము సమర్ధమంతమైన వ్యయ నియంత్రణ చర్యలు పాటిస్తుండటం వల్ల తమ కార్యకలాపాలపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. తమ కాంపాక్ట్ కార్ సీ3 ఎలక్ట్రిక్ వెర్షన్‌ను భారత మార్కెట్లో వచ్చే ఏడాది తొలి నాళ్లలో ప్రవేశపెట్టనున్నట్లు కార్లోస్ చెప్పారు. నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలను చౌకగా అందించేందుకు వ్యయాల తగ్గింపుపై మరింతగా కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. -
Financial Crises: పేకమేడలు... ఆర్థిక సంక్షోభం అంచున దేశాలు
ఆర్థిక సంక్షోభం తాలూకు విశ్వరూపాన్ని శ్రీలంకలో కళ్లారా చూస్తున్నాం. కనీసం మరో డజనుకు పైగా దేశాలు ఈ తరహా ఆర్థిక సంక్షోభం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలు... ఇలా ఇందుకు కారణాలు అనేకం. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి... అర్జెంటీనా అధ్యక్షుని నిర్వాకం పెను ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. జూన్‌తో పోలిస్తే జులైలో ధరలు 6 శాతం పెరిగాయి. అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికం దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శ్రీలంక మాదిరిగానే ప్రజలు భారీగా రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. కరెన్సీ పెసో నల్ల బజారులో ఏకంగా 50 శాతం తక్కువ విలువకు ట్రెండవుతోంది. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోతున్నాయి. బాండ్లు డాలర్‌కి 20 సెంట్లు మాత్రమే పలుకుతున్నాయి. కాకుంటే విదేశీ అప్పులను 2024 వరకు తీర్చాల్సిన అవసరం లేకపోవడం ఒక్కటే ప్రస్తుతానికి ఊరట. ఉపాధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ సామర్థ్యం మీదే ప్రజలు ఆశతో ఉన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధిపై ఒత్తిడి తెచ్చయినా దేశాన్ని రుణభారం నుంచి ఆమె గట్టెక్కిస్తారన్న అంచనాలున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం చేసిన గాయం రష్యా దండయాత్రతో ఆర్థికంగా చితికిపోయింది. 20 వేల కోట్ల డాలర్ల పై చిలుకు అప్పుల్లో కూరుకుపోయింది. ఈ సెప్టెంబర్‌లోనే 120 కోట్ల డాలర్లు చెల్లించాల్సి ఉంది. అమెరికా, యూరప్ దేశాలు ఆర్థికంగా అండగా నిలుస్తూండటంతో అది పెద్ద కష్టం కాకపోవచ్చు. యుద్ధం ఇంకా కొనసాగేలా ఉండటంతో మరో రెండేళ్ల పాటు అప్పులు తీర్చకుండా వెసులుబాటు కల్పించాలని కోరే అవకాశముంది. ఉక్రెయిన్ కరెన్సీ హ్రిన్వియా విలువ దారుణంగా పడిపోయింది. పాకిస్తాన్ నిత్య సంక్షోభం మన దాయాది దేశం కూడా చాలా ఏళ్లుగా అప్పుల కుప్పగా మారిపోయింది. విదేశీ మారక నిల్వలు కేవలం 980 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఈ సొమ్ముతో ఐదు వారాలకు సరిపడా దిగుమతులు మాత్రమే సాధ్యం. గత వారమే అంతర్జాతీయ ద్రవ్య నిధితో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకున్నా చమురు దిగుమతుల భారం తడిసి మోపెడవడంతో గంప లాభం చిల్లి తీసిన చందంగా మారింది. కరెన్సీ విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. దేశ ఆదాయంలో ఏకంగా 40% తీసుకున్న వడ్డీలకే పోతోంది. విదేశీ నిల్వల్ని పెంచుకోవడానికి మరో 300 కోట్ల డాలర్లు అప్పు కోసం సిద్ధమైంది. ఇలా అప్పులపై అప్పులతో త్వరలో మరో లంకలా మారిపోతుందన్న అభిప్రాయముంది. ఈజిప్టు అన్నీ సమస్యలే ఈ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం ఆర్థికంగా కుంగదీసింది. గోధుమలు, నూనెలకు ఉక్రెయిన్‌పై ఆధారపడటంతో ధరలు విపరీతంగా పెరిగాయి. దేశ స్థూల జాతీయోత్పత్తి–రుణాల నిష్పత్తి 95 శాతానికి చేరింది! విదేశీ కంపెనీలెన్నో దేశం వీడుతున్నాయి. 1,100 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లినట్టు అంచనాలున్నాయి. ఐదేళ్లలో 10 వేల కోట్ల డాలర్ల రుణ చెల్లింపులు చేయాల్సి రావడం కలవరపెడుతోంది. కరెన్సీ విలువను 15 శాతం తగ్గించినా లాభంలేకపోవడంతో ఐఎంఎఫ్‌ను శరణు వేడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకానికి పెడుతోంది! దివాలా బాటన మరెన్నో దేశాలు ఈక్వడర్, బెలారస్, ఇథియోపియా, ఘనా, కెన్యా, ట్యునీషియా, నైజీరియా... ఇలా మరెన్నో దేశాలు ఆర్థిక సంక్షోభం ముంగిట్లో ఉన్నాయి. ఈక్వడర్ రెండేళ్లుగా రుణాలు చెల్లించే పరిస్థితిలో లేదు. ఘనా అప్పులకు వడ్డీలే కట్టలేకపోతోంది. నైజీరియా ఆదాయంలో 30 శాతం వడ్డీలకే పోతోంది. ట్యునీషియాది ప్రభుత్వోద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి! -
కరోనా.. టెర్రర్!
కోవిడ్–19(కరోనా) వైరస్ కల్లోలం కారణంగా ప్రపంచం మాంద్యంలోకి జారిపోతోందనే ఆందోళనతో ప్రపంచ మార్కెట్లు భారీగా పతనం కావడంతో శుక్రవారం మన మార్కెట్ కూడా భారీగా నష్టపోయింది. యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం 74 స్థాయికి చేరువ కావడం, ముడి చమురు ధరలు 2.5 శాతం మేర క్షీణించడం కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 1,459 పాయింట్ల మేర క్షీణించిన సెన్సెక్స్ చివరకు 894 పాయింట్ల నష్టంతో 37,577 పాయింట్ల వద్దకు చేరింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 280 పాయింట్లు పతనమై 10,989 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 1,014 పాయింట్లు కోల్పోయి 27,801 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్ 2.3 శాతం, నిఫ్టీ 2.4 శాతం, బ్యాంక్ నిఫ్టీ 3.5 శాతం చొప్పున నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు క్షీణించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఆరు నెలల కనిష్టానికి, బ్యాంక్ నిఫ్టీ ఐదు నెలల కనిష్టానికి పడిపోయాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 721 పాయింట్లు, నిఫ్టీ 212 పాయింట్లు నష్టపోయాయి. చివర్లో తగ్గిన నష్టాలు.... గురువారం అమెరికా మార్కెట్, శుక్రవారం ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోవడంతో మన మార్కెట్ కూడా భారీ నష్టాల్లో ఆరంభమైంది. సెన్సెక్స్ 857 పాయింట్లు, నిఫ్టీ 326 పాయింట్ల నష్టాలతో మొదలయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,460 పాయింట్లు, నిఫ్టీ 442 పాయింట్ల మేర క్షీణించాయి. చివర్లో నష్టాలు కొంత తగ్గాయి. యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ తీసుకున్న చర్యల నేపథ్యంలో బ్యాంక్ షేర్లు బేర్మన్నాయి. కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో విమానయాన, లోహ షేర్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు 1–3 శాతం, యూరప్ మార్కెట్లు 3–4 శాతం రేంజ్లో క్షీణించగా, అమెరికా సూచీలు 2–3 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయి. ► 30 సెన్సెక్స్ షేర్లలో మూడు షేర్లు–బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ మాత్రమే లాభపడ్డాయి. ► యస్ బ్యాంక్‌లో వాటాను ఎస్బీఐ కొనుగోలు చేయనున్నదన్న వార్తల నేపథ్యంలో ఎస్బీఐ షేర్ 6 శాతం నష్టంతో రూ.270 వద్దకు చేరింది. ► చైనాలో రిటైల్ అమ్మకాలు 85 శాతం తగ్గడంతో టాటా మోటార్స్ షేర్ 9% నష్టంతో రూ.114 వద్ద ముగిసింది. ► దాదాపు 600కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఓఎన్జీసీ, పీఎన్బీ, ఇండిగో, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► మొత్తం ఐదు షేర్లు సెన్సెక్స్‌ను 510 పాయింట్ల మేర పడగొట్టాయి. సెన్సెక్స్ నష్టాల్లో హెచ్డీఎఫ్సీ వాటా 140 పాయింట్లుగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 125 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 113 పాయింట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 68 పాయింట్లు, ఎస్బీఐ వాటా 64 పాయింట్లుగా ఉన్నాయి. ► దాదాపు 400 మేర షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. కార్పొరేషన్ బ్యాంక్, డీహెచ్ఎఫ్ఎల్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. రూ.3.30 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో రూ.3.30 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.29 లక్షల కోట్లు తగ్గి రూ.144.3 లక్షల కోట్లకు పడిపోయింది. -
భారత్‌పై ‘అంతర్జాతీయ మందగమనం’ ఎఫెక్ట్!
వాషింగ్టన్: అంతర్జాతీయ ఆర్థిక మందగమన ప్రభావం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఒక్కింత ఎక్కువగా ఉండనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తం దాదాపు ఒకేసారి మందగమనంలోకి జారిన పరిస్థితులను మనం చూస్తున్నామని పేర్కొన్నారు. అంటే ప్రపంచ ఆర్థిక వృద్ధి 90 శాతం ఈ ఏడాది మందగమనంలోకి జారిపోనుందని వివరించారు. ఇంకా చెప్పాలంటే, వృద్ధి రేటు ఈ దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయిలను చూడనుందని తెలిపారు. 2019, 2020 వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ వచ్చే వారంలో విడుదల కానుందని పేర్కొన్న ఆమె, ఈ అవుట్‌లుక్‌లో వృద్ధి రేట్ల అంచనాలకు కోత పడే అవకాశం ఉందనీ సూచించారు. వచ్చేవారం ఇక్కడ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశం జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఐఎంఎఫ్ చీఫ్ ఇక్కడ కీలక ముందస్తు ప్రసంగం ఒకటి చేశారు. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► అంతర్జాతీయంగా పలు దేశాల ఆర్థిక గణాంకాలను చూస్తే, క్లిష్టమైన పరిస్థితి కనిపిస్తోంది. ► మొత్తంగా వృద్ధి మందగమనం ఉన్నప్పటికీ, 40 వర్థమాన దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 5 శాతం పైనే ఉంది. ఆయా దేశాల్లో 19 సహారా ప్రాంత ఆఫ్రికా దేశాలూ ఉన్నాయి. ► పలు దేశాలు ఇప్పటికే ఆర్థిక తీవ్ర క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి దేశం ఆర్థిక స్థిరత్వం పటిష్టత లక్ష్యంగా ద్రవ్య, పరపతి విధానాలను అనుసరించాలి. తక్కువ వడ్డీరేట్ల ఆర్థిక వ్యవస్థల్లో అదనపు నిధలు వ్యయాలకు కొంత అవకాశం ఉంది. ► వ్యవస్థాగత సంస్కరణలతో ఉత్పాదకత పెంపు తద్వారా ఆర్థిక క్రియాశీలత మెరుగుదలకు అవకాశం ఉంది. తద్వారా అధిక వృద్ధి సాధించడం అవసరం. ఇందుకు తగిన మదింపు జరగాలి. -
అతిపెద్ద దేశీ బ్యాంక్‌గా ఎదుగుతాం
ముంబై: వ్యాపార పరిమాణం, పనితీరులో కూడా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా ఎదగనున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ విశ్వాసం వ్యక్తం చేశారు. లాభదాయక విధానంలో బ్యాంకును అగ్రస్థానానికి చేర్చాలనేది తమ లక్ష్యమని ఆమె చెప్పారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఐసీఐసీఐ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకుగా కొనసాగుతోంది. మొత్తం దేశీ బ్యాంకింగ్ పరిశ్రమ విషయానికొస్తే.. ప్రభుత్వ రంగ ఎస్బీఐ టాప్ స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో ఐసీఐసీఐ నిలుస్తోంది. 2009లో ఐసీఐసీఐ పగ్గాలు చేపట్టిన కొచర్.. ప్రఖ్యాత ‘4సీ’ వ్యూహాన్ని అమలుచేస్తూ బ్యాంకును ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. ఈ వ్యూహం బాగానే విజయవతంమైందని.. పరిశ్రమ వృద్ధి రేటు కంటే ముందుండేందుకు ఇది తగిన పునాది వేసిందని కూడా కొచర్ పేర్కొన్నారు. అయితే, లాభాలను ఏమాత్రం త్యాగం చేయకుండానే, అదేవిధంగా అధిక రిస్క్‌లు ఉండే వ్యాపార విధానంలో కాకుండా వృద్ధిని పరుగులు పెట్టించేందుకు కృషిచేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కరెంట్, సేవింగ్స్ ఖాతా(కాసా) డిపాజిట్లలో వృద్ధి, వ్యయ నియంత్రణ, మొండిబకాయిల మెరుగుదల, సరైన మూలధన నిర్వహణ.. ఈ నాలుగు అంశాల సమర్థవినియోగమే 4సీ వ్యూహంగా పేరొందింది. దేశీ బ్యాంకింగ్ పరిశ్రమ కంటే 2-3 శాతం అధిక వృద్ధి రేటును సాధించడంపై దృష్టిపెట్టినట్లు కొచర్ చెప్పారు. ఏదో నామమాత్రంగా అగ్రస్థానానికి చేరాలన్నది తన ధ్యేయం కాదని... నిలకడైన లాభాల వృద్ధితో క్రమంగా దేశంలో నంబర్ వన్ ర్యాంక్‌ను అందుకోవడానికి ప్రయత్నిస్తామని ఐసీఐసీఐ చీఫ్ వ్యాఖ్యానించారు. కేవలం బ్యాంకు పరిమాణం ప్రకారం కాకుండా మెరుగైన పనితీరు ఆధారంగా టాప్‌లోకి వెళ్లాలనేదే తమ లక్ష్యమన్నారు. అయితే, కచ్చితంగా ఈ స్థానాన్ని అందుకుంటామన్న నమ్మకం ఉందని ఆమె చెప్పారు.