peoples war
-
కూలిన విరాటపర్వం శంకరన్న ఇల్లు..
కరీంనగర్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అప్పటి పీపుల్స్‌వార్ కార్యదర్శిగా పనిచేసిన దొంత మార్కండేయ ఉరఫ్ శంకరన్న ఇల్లు గురువారం కూలిపోయింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శంకరన్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌లో 1993 జనవరి 25న రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఈ మధ్యనే శంకరన్న పాత్రతో కూడిన విరాటపర్వం సినిమా తెరకెక్కించారు. శంకరన్న పాత్రలో దగ్గుబాటి రాణా హీరో పాత్ర పోషించారు.మూడు దశాబ్దాల క్రితం ఉద్యమానికి ఆకర్షితుడై పార్టీలోచేరి ఉత్తర తెలంగాణ కార్యదర్శి స్థాయిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు. ఆయన జ్ఞాపకంగా ఉన్న ఒక్క ఇల్లు కూలిపోవడంపై గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. -
డాక్టర్ కొల్లూరి చిరంజీవి కన్నుమూత
ఖైరతాబాద్ (హైదరాబాద్): తెలంగాణ తొలి, మలి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ కొల్లూరి చిరంజీవి (74) కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొల్లూరి చిరంజీవి గత నెల 19న ఏఐజి ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యంతో ఆయన చికిత్స పొందుతున్న సమయంలోనే మంత్రి కేటీఆర్ రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. కాగా, పరిస్థితి విషమించడంతో ఆదివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం నారాయణగూడలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. 1947 ఫిబ్రవరిలో వరంగల్‌లో ఆయన జన్మించారు. తల్లి టీచర్, తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివే రోజుల్లోనే ఆయన విద్యార్థి సంఘం నేతగా చురుకుగా పనిచేశారు. మెడికల్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే డాక్టర్ చంద్రావతిని ప్రేమించి ఆదర్శ వివాహం చేసుకున్నారు. 1969 ఉద్యమకారుల సమాఖ్య ఏర్పాటుచేసి సమస్యలపై పోరాటం చేస్తూ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచారు. పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరి కొండపల్లి సీతారామయ్యకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. తర్వాత బీఎస్పీలో చేరి కీలక నేతగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఎంతో మంది విద్యార్థులు, ఉద్యమకారులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి కేటీఆర్ నివాళి కొల్లూరి భౌతికకాయం వద్ద మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బండా ప్రకాశ్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మందకృష్ణ మాదిగ, జై భీంటీవీ సీఈవో శ్రీధర్ తదితరులు కొల్లూరి భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు సంతాపం ప్రకటించారు. -
28 ఏళ్లకు మళ్లీ ‘అదృశ్యం’
► ఐలయ్య, రాయమల్లు జాబితాలో ఆర్కే..!? ► అగ్రనేత జాడపై కొనసాగుతున్న సస్పెన్స్ పెద్దపల్లి: తెలంగాణ ప్రాంతంలో 1988లో సంచలనం సృష్టించిన మావోయిస్టు నేతల అదృశ్యం 28 ఏళ్ల తర్వాత మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే ఉదంతంతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్ నాటి నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ ఇన్చార్జి రామకృష్ణ అలియాస్ ఆర్కే కనిపించకుండా పోవడంతో.. గతం అదృశ్యం జాబితాలోనే ఆర్కే చేరుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 28 ఏళ్ల క్రితం అంటే.. 1988 డిసెంబర్ 27న హైదరాబాద్‌లోని నవ్‌రంగ్ థియేటర్ వద్ద అప్పటి పీపుల్స్‌వార్ కార్యదర్శి గోపగాని ఐలయ్య, కొరియర్ బుర్ర రాయమల్లును పోలీసులు పట్టుకెళ్లారని తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో పెద్ద విధ్వంసం జరిగింది. ఐలయ్య, రాయమల్లుతో పాటు జనశక్తి సభ్యులు వసంత, సుజాతలను కరీంనగర్ కోర్టు వద్ద పోలీసులు మాయం చేశారని, అంతేకాకుండా మంథని నియోజకవర్గం రామయ్యపల్లికి చెందిన రమణారెడ్డి అనే అగ్రనేతను ముంబైలో పట్టుకొని జాడ తెలియకుండా చేశారని అప్పట్లో పీపుల్స్‌వార్ నేతలు ఆరోపించారు. అదృశ్యమైన తమ వాళ్ల జాడ చెప్పాలని డిమాండ్ చేస్తూ అప్పటి కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ టీడీపీ ఎంపీపీని కిడ్నాప్ చేశారు. రామగిరి ఖిలాలో నాలుగు రోజుల పాటు నిర్బంధించి తర్వాత వదిలిపెట్టారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో తాడిచెర్ల మండల అధ్యక్షుడు మల్హర్‌రావును కిడ్నాప్ చేసిన పీపుల్స్‌వార్ ఆయనను హతమార్చింది. ఆ తర్వాత వరంగల్ జిల్లాకు చెందిన మరో ఎంపీపీని కిడ్నాప్ చేయడంతో పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఐదుగురితోపాటు వివిధ జిల్లాలకు చెందిన మరో 11 మంది మిలిటెంట్లు కలిపి 16 మంది అదృశ్యంపై అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, కేఎల్ఎన్.రెడ్డి కమిషన్‌ను నియమించి విచారణ చేపట్టారు. మూడేళ్లు విచారణ చేపట్టిన కేఎల్ఎన్ రెడ్డి కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే, కేఎల్ఎన్.రెడ్డి కమిషన్ ఇచ్చిన నివేదికతోపాటు మాయమైన వారి జాడ ఇప్పటికీ బయటి ప్రపంచానికి తెలియరాలేదు. ఆ ఎన్కౌంటర్లో మరణించింది రాయమల్లు, ఐలయ్యలే! 1988 డిసెంబర్ 27న అదృశ్యమైన గోపగాని ఐలయ్య.. బుర్ర రాయమల్లును పోలీసులు వారం రోజుల తర్వాత కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి చంపినట్లు ఆరోపణలున్నాయి. ఆ ఎన్కౌంటర్లో ఇద్దరు గుర్తు తెలియని నక్సల్ మృతి చెందినట్లు ప్రకటించిన పోలీసులు వారి మృతదేహాల ఫొటోలను పత్రికలకు విడుదల చేయలేదు. వారే మృతదేహాలను ఖననం చేశారు. కానీ, తర్వాతి రోజుల్లో పార్టీ నాటి ఎన్కౌంటర్లో చనిపోయింది వీరిద్దరేనని ధ్రువీకరించింది. గోపగాని ఐలయ్య, బుర్ర రాములును పోలీసులు పట్టుకునేందుకు కోవర్టుగా వ్యవహరించాడనే అనుమానంతో చత్రపతి శివాజీ అనే వ్యక్తిని పార్టీ హైదరాబాద్‌లోని బోయిన్పల్లి వద్ద చంపేసింది. -
‘ఎర్ర’ బొడ్డులూరు
పలాస: మందస మండలంలోని నల్ల బొడ్డులూరు పేరు చెబితే చాలు ఎర్రజెండా పట్టుకున్న ఎందరో విప్లవ వీరులు గుర్తుకు వస్తారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటం తర్వాత రెండో తరం విప్లవకారులు ఆనాటి పీపుల్స్‌వార్ ఆధ్వర్యంలో ఏర్పడ్డారు. పీపుల్స్‌వార్ తర్వాత మావోయిస్టుగా ఏర్పడిన ఆ పార్టీకి మందస మండలంలో నల్లబొడ్డులూరు విప్లవ కేంద్రంగా ఏర్పడింది. బాహడపల్లి భూస్వామి వ్యతిరేక పోరాటంలో బాహడపల్లి ప్రజలతో పాటు నల్లబొడ్డులూరు పరిసర గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ పోరాట ప్రభావంతో ఆయా పరిసరాల్లోని యువకులు పెద్ద ఎత్తున దళాల్లోకి వెళ్లారు. అలా వెళ్లిన వారిలో 16 ఏళ్ల వయస్సులో బొడ్డు కుందనాలు విప్లవ బాట పట్టింది. కుందనాలు ఎన్కౌంటర్లో మృతి చెందారనే వార్త వినడంతో ఆ గ్రామానికి చెందిన అమరవీరుల బంధుమిత్రుల కమిటీ సభ్యురాలు దున్న కాములమ్మతో పాటు గ్రామస్తులు మల్కన్‌గిరి వెళ్లారు. నల్లబొడ్డులూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. కుందనాలకు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. పొట్ట కూటి కోసం అంతా వేరే ప్రాంతాల్లో ఉండగా కుందనాలు తల్లిదండ్రులు బొడ్డు సింహాద్రి, దమయంతిలు మాత్రమే ఇంటి వద్ద ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన మరో మావోయిస్టు నాయకుడు దున్న కేశవరావు అలియాస్ అజాద్ ఒడిశాలోని భువనేశ్వరం జైలులో గత కొన్నేళ్లుగా మగ్గుతున్నారు. బెయిల్ పెట్టుకొని బయటకు వచ్చి జైలు గోడలు దాటక ముందే మరోకేసు బనాయిస్తూ జైలుకు పంపిస్తున్నారు. ఆమె తల్లి దున్న కాములమ్మ పలుమార్లు పోలీసు అధికారులు, రాజకీయ నాయకులను సంప్రదించినా ఫలితం లేకపోయింది. -
ఎన్కౌంటర్లో నయీమ్ గురువు హతం
-ముగిసిన కిష్టయ్య ప్రస్థానం... -ఏఓబీలో జరిగిన ఎన్కౌంటర్లో హతం -ఆర్ఎస్యూ నుంచి కేంద్ర కమిటీ దాకా.. -రెండు దశాబ్దాలకు పైగా ఉద్యమ జీవనం -సాంబశివుడికి, నయీమ్‌కు ఇతడే గురువు..! యాదాద్రి: మిలిటెంట్‌గా ఉద్యమాన్ని ప్రారంభించి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన చామల కిష్టయ్య అలియాస్ దయా 26 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏఓబీ)లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. జిల్లాలో ఎందరినో ఉద్యమబాట పట్టించిన కిష్టయ్య అంచలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక మధిర గ్రామమైన దాసిరెడ్డిగూడేనికి చెందిన చామల చంద్రమ్మ, రామయ్యల ఆరవ సంతానం కిష్టయ్య. విద్యార్థి దశలోనే పీపుల్స్‌వార్ ఉద్యమంలోకి వెళ్లాడు. భువనగిరి ఎస్ఎల్ఎన్ఎస్ కళాశాలలో బీకాం చదువుతూ 1990లో ఆర్ఎస్యూ వైపు ఆకర్షితుడయ్యాడు. ఆలేరు, కృష్ణపట్టె దళాల్లో మిలిటెంట్‌గా పని చేస్తూ ఈ ప్రాంతం నుంచి ఎందరినో ఉద్యమంలోకి తీసుకెళ్లాడు. వలిగొండ, భువనగిరి, ఆలేరుతో పాటు జిల్లాలోని పలువురిని ఉద్యమ బాట పట్టించాడు. హైదరాబాద్‌లో పీపుల్స్‌వార్ ప్రచార దళాల్లో పని చేస్తూ ఉద్యమంలోకి పూర్తి స్థాయిగా వెళ్లాడు. పోలీసులు పలుమార్లు వచ్చి మీకుమారుడిని ఉద్యమంలోంచి బయటకు రమ్మని కోరమంటూ తల్లిదండ్రులకు చేసిన విజ్ఞప్తులు కిష్టయ్య లెక్క చేయలేదు. తనకంటే పెద్దవారైన ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు, తల్లిదండ్రులు ఉన్నా ఏనాడు ఇంటి వైపే చూడలేదు. అతనో నాయకుడు పీపుల్స్‌వార్ ఉద్యమంలో రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగిన సాంబశివుడు, గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీమ్‌తో పాటు మరెందరినో పార్టీలో చేర్పించాడు. ఎస్ఎల్ఎన్ఎస్ కళాశాలలో చదువుతుండగా అదే కాలేజీలో విద్యనభ్యసిస్తున్న భువనగిరికి చెందిన నయీమ్‌ను పీపుల్స్‌వార్‌లో చేర్పించాడు. అలాగే అతడి స్వగ్రామమైన దాసిరెడ్డిగూడెంలో సాంబశివుడు, అతడి సోదరుడు కొనపురి రాములు, రాపోలు స్వామిని ఉద్యమ బాట పట్టించాడు. ఒక విధంగా వలిగొండలో పీపుల్స్‌వార్‌కు ఎందరో ముఖ్య కార్యకర్తలను, నాయకులను, సానుభూతిపరులను తయారు చేసిన నాయకుడని కిష్టయ్య గురించి తెలిసినవారు చెబుతారు. 26 ఏళ్లుగా ఇంటి ముఖం చూడకుండా.. పీపుల్స్‌వార్‌లోకి వెళ్లిన కిష్టయ్య తన 26 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఒక్క రోజు కూడా ఇంటిముఖం చూడలేదు. నిరుపేదలైన అతడి తలిదండ్రులు అవస్థలు పడుతున్నా వారిని పట్టించుకోలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడు తమ కొడుకు ఎలా ఉంటాడోనని తల్లి చంద్రమ్మ అప్పుడప్పుడు ఆవేదన చెందుతుండేది. గ్రామస్తులు సైతం కిష్టయ్య పేరు తప్పా ఆయన ఉనికి తెలియని పరిస్థితి. 2008లో బుల్లెట్ గాయాలతో తప్పించుకుని.. మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరిన చామల కిష్టయ్యకు గన్‌మెన్‌గా దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు స్వామి ఉండేవాడు. ఉత్తరాంధ్ర(ఇప్పుడు ఏఓబీ)లో పనిచేస్తుండగా 2008లో పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో స్వామి మృతిచెందాడు. అప్పుడు కిష్టయ్య బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నాడు. ఉద్యమం కోసం జీవితాంతం తపించిన కిష్టయ్య ఎన్కౌంటర్లో మరణించడంతో అతడి సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానానికి తెరపడింది. -
వార్ పేరుతో రియల్ బెదిరింపులు
సిద్దిపేట క్రైం : సులువుగా డబ్బు సంపాదించేందుకు పీపుల్స్‌వార్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులను టార్గెట్ చేస్తున్న ముఠా గుట్టును సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు రట్టు చేశారు. ఘటన వివరాలను మంగళవారం వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. సిద్దిపేట పట్టణం భారత్‌నగర్‌కు చెందిన ఆరగొండ విఠల్, లక్ష్మీనారాయణ సోదరులు. వీరి మధ్య ఆస్తి తగదాలున్నాయి. ఈ క్రమంలో లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన అడెపు కృష్ణమూర్తిని కలిసి తమ వివాదం గురించి చెప్పాడు. దీంతో కృష్ణమూర్తి.. గతంలో పీపుల్స్‌వార్ అనుబంధ సంస్థ ఆర్ఎస్యూలో పని చేసిన వరంగల్ జిల్లా బొడ్లాడ మండలం నెల్లికుదురుకు చెందిన రాపాక శ్రీరాములు అలియాస్ ప్రసాద్‌ను లక్ష్మీనారాయణకు పరిచయం చేశాడు. ప్రసాద్‌తో పాటు కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు, కొమురయ్య, జెట్టి యాకయ్య, రావుల యాకయ్య, ఉడుగుల కృష్ణ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. విఠల్-లక్ష్మీనారాయణ మధ్య ఉన్న ఆస్తి తగదాను అనువుగా చేసుకుని ప్రజాప్రతిఘటన పార్టీ శ్యాం పేరున లేఖలు ముద్రించి, విఠల్‌కు బెదిరింపు లేఖ రాశారు. అందులో విఠల్ ఆస్తి వివరాలను పేర్కొంటూ తమకు రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుట్టు రట్టయిందిలా.. మొదట బెదిరింపు లేఖపై విఠల్ స్పందించలేదు. దీంతో ముఠా సభ్యులు ఫోన్‌చేసి కుటుంబసభ్యులందరిని చంపేస్తామని బెదిరించారు. విఠల్ భయపడి రూ.50 వేలు ప్రసాద్‌కు అందించాడు. మరో వారం తర్వాత ప్రసాద్ ఫోన్‌చేసి మిగతా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో విఠల్ వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల సూచనతో విఠల్.. సిద్దిపేటకు వచ్చి డబ్బులు తీసుకోవాలని ప్రసాద్ ముఠాకు చెప్పాడు. మంగళవారం ప్రసాద్, కృష్ణ, కొమురయ్య, జెట్టి యాకయ్య, రావుల యాకయ్య సిద్దిపేట వచ్చారు. మాటువేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, రూ. 40వేలు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరు బెదిరించి వసూలు చేసిన రూ. 98వేలు బ్యాంక్ ఖాతాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు వెంకటేశ్వర్రావు పరారీలో ఉన్నాడు. కేసును చేధించిన వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి, ఐడీ సిబ్బంది సంపత్, బాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌ను డీఎస్పీ అభినందించారు. ఏపీ, తెలంగాణలో 11 కేసులు వరంగల్ జిల్లాకు చెందిన రాపాక శ్రీరాములు అలియాస్ ప్రసాద్.. తన మిత్రుడైన సీతారాంరెడ్డితో కలిసి ప్రజాప్రతిఘటన పార్టీ శ్యాం పేరుతో లెటర్ ప్యాడ్‌ను కొట్టించి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బెదిరింపు లేఖలు రాసేవారు. బంజరాహిల్స్, జూబ్లీహిల్స్‌లో కొందరిని బెదిరించి డబ్బులు వసూలు చేయగా, అక్కడి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ప్రసాద్.. మరో స్నేహితుడైన వెంకటేశ్వర్రావుతో కలిసి ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్ ప్రాంతాల్లోని మరికొందరికి లేఖలు రాసి డబ్బులు డిమాండ్ చేయగా, ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొవ్వూరులోని స్టోన్‌క్రషర్ యజమాని, కాకినాడలోని స్వామిజీకి కూడా ఫోన్‌చేసి బెదిరించిన కేసుల్లో అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. ప్రసాద్ ముఠాపై వివిధ ప్రాంతాల్లో 11 కేసులు నమోదైనట్టు పోలీసులు వివరించారు. ఎవరికైనా బెదిరింపు ఫోన్లు, లేఖలు వస్తే పోలీసులను సంప్రదించాలని, సెటిల్మెంట్ల జోలికి పోవద్దని డీఎస్పీ శ్రీధర్ సూచించారు. -
‘వార్’ పోస్టర్ల కలకలం
చిట్యాల : సీపీఐ మావోరుుస్టు, సీపీఐం(ఎంఎల్) పీపుల్స్‌వార్ పేరిట మండలంలోని వివిధ గ్రామాల్లో వాల్‌పోస్టర్లు వెలవడం కలకలం సృష్టిస్తోంది. కేవలం నెల వ్యవధిలోనే రెండు గ్రామాల్లో పోస్టర్లు వేసిన అజ్ఞాత వ్యక్తులు పలువురిని హెచ్చరించడం చర్చనీయూంశమైంది. గత నెల 4న వెలిశాలలో పలు పార్టీల నాయకులను హెచ్చరిస్తూ మావోయిస్టు కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ పేర వాల్‌పోస్టర్లు వెలిశాయి. దీనిని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. పలువురు మాజీలను ఠాణాకు పిలిచి ఆరా తీశారు. కొందరు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేసి తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఈసంఘటనను మర్చిపోకముందే గురువారం రాత్రి చల్లగరిగె గ్రంథాలయం భవన గోడకు సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్, దామోదర్ పేరిట పలువురిని హెచ్చరిస్తూ వాల్‌పోస్టర్లు వెలిశారుు. నెల వ్యవధిలోనే అజ్ఞాత నక్సల్స్ పేరిట రెండు గ్రామాల్లో వాల్‌పోస్టర్లు వెలియడం, పలువురిని హెచ్చరించడంతో టార్గెట్ల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నారుు. ఇన్ఫార్మర్లు పద్ధతులు మార్చుకోవాలి..! చల్లగరిగలోని ఓ పార్టీ మండల అధ్యక్షుడు పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నారని, ముఠాలు తయారు చేసి ప్రజలను బెదిరిస్తున్నాడని వాల్‌పోస్టర్‌లో రాశారు. మరో వ్యక్తి పలు కుటుంబాల్లో చిచ్చుపెడుతూ పబ్బం గడుపుకుంటున్నాడని పేర్కొన్నారు. తాను ప్రజాప్రతినిధినంటూ ప్రజల్ని మోసం చేస్తున్నాడని తెలిపారు. మరో ఇద్దరు పంచారుుతీలు చేస్తూ బాధితుల నుంచి డిపాజిట్ల రూపంలో డబ్బు సేకరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారు తమ పద్ధతులు మార్చుకోవాలని, లేనిపక్షంలో శిక్ష తప్పదని వాల్‌పోస్టర్లలో హెచ్చరించారు. శుక్రవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వాల్‌పోస్టర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
శ్రీమన్నారాయణ అమరత్వానికి రెండు దశాబ్దాలు
విప్లవ వీరుడి యాదిలో జనగామ పోరు గడ్డ ఎర్రగొల్లపహాడ్‌లో 2005లో ఎత్తరుున స్థూప నిర్మాణం, ఆవిష్కరణ విద్యార్థి దశలోనే పీపుల్స్‌వార్‌లో చేరిక అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర స్థాయిలో బాధ్యతల నిర్వహణ జనగామ రూరల్ : ఓ విప్లవ వీరుడి చరిత్రను తరతరాలపాటు ప్రజలు గుర్తుంచుకోవాలంటే ఆయన వందేళ్లు జీవించాల్సిన పనిలేదు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అతను ఎంచుకున్న లక్ష్యం, నిర్ధేశించుకున్న మార్గంలో పయనిం చేందుకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన వారు చరిత్ర పుటల్లో ప్రజల హృదయాల్లో చిరకాలం చెరగని ముద్ర వేసుకుం టారు. ఆ స్థానాన్ని పదిలం చేసుకున్న వారిలో జనగామ మండలంలోని ఎర్రగొల్లపహాడ్ గ్రామానికి చెందిన కామ్రేడ్ బైరగోని శ్రీమన్నారాయణ అలియాస్ అంజన్న ఒకరు. మాములు రైతు కుటుంబంలో పుట్టి, ఉన్నత విద్య చదివి, భూస్వాముల, పెత్తందార్ల ఆగడాలకు వ్యతిరేకంగా, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సమసమాజ స్థాపనే లక్ష్యంగా స్థాపించిన పీపుల్స్‌వార్ ఉద్యమంలో చేరి అతితక్కువ కాలంలో జిల్లా నాయకుడిగా, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ అమరుడై నేటికి(మార్చి 2 నాటికి) సరిగ్గా 20 ఏళ్లు పూర్తయ్యాయి. నూనుగు మీసాల వయస్సులోనే పీపుల్స్‌వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన శ్రీమన్నారాయణ అలియాస్ అంజన్నది కీలక పాత్ర. ఆయన ఉద్యమంలో పని చేసిన కాలం లో భూస్వాముల గుండెల్లో రైళ్లు పరుగెత్తించా రు. పేదలకు భూపంపిణీ చేసేందుకు ఆయన చేసిన కృషిని జిల్లా ప్రజలు నేటికి మరిచి పోరు. 1986లో విద్యార్థి దశలోనే ఉద్యమబాట పట్టిన శ్రీమన్నారాయణ అంచెలంచెలుగా ఎదిగారు. పీపుల్స్‌వార్‌లో జిల్లా నాయకుడిగా, విప్లవ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేగాక నెక్కొండ, చేర్యాల, పాలకుర్తి దళ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహించారు. దివంగత ఎన్డీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పీపుల్స్‌వార్‌పై నిషేధం ఎత్తి వేయగా జనగామలోని ప్రెస్టన్ కళాశాలలో 1994లో శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సుకు లక్షలాదిగా ప్రజలు హాజరవడం అప్పటికీ ఇప్పటికీ ఓ పెద్ద సంచలనం. 1995 మే 2న జనగామ మండలం యశ్వాంతాపూర్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో శ్రీమాన్నారాయణ అసువులు బాసారు. స్థూపం నిర్మాణం.. ఆవిష్కరణ 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మావోయిస్టులపై నిషేధం సడలించిన క్రమంలో శ్రీమన్నారాయణ తల్లి రామక్క(ప్రస్తుతం ఆమె లేరు) తన సొంత ఖర్చులతో స్థూపం నిర్మించింది. ఈ స్థూపం ఆవిష్కరణకు విప్లవ కవులు, రచయితలు వరవరరావు, కళ్యాణరావు, మా భూమి సంధ్య హాజరయ్యూరు. -
మావోయిస్టుల మహాసభకు ఏర్పాట్లు?
అఖిల భారత సదస్సు నిర్వహణకు పార్టీ నిర్ణయం బీహార్-జార్ఖండ్ మధ్యనున్న దండకారణ్యమే వేదిక * అబూజ్మడ్ కోటలో 20 వేల మంది మావోయిస్టులు? * కేంద్ర నిఘా వర్గాలకు అందిన సమాచారం * దండకారణ్యంపై దాడికి 10 వేల మందితో బలగాలు సిద్ధం సాక్షి, ఖమ్మం: అఖిల భారత స్థాయి సమావేశానికి మావోయిస్టు పార్టీ సిద్ధమైందా? రెండేళ్ల క్రితం వాయిదా పడిన పార్టీ ఆలిండియా పదో కాంగ్రెస్‌ను ఈ ఏడాదిలోనే నిర్వహించాలని మావోయిస్టులు భావిస్తున్నారా? బీహార్-జార్ఖం డ్ మధ్యనున్న దండకారణ్యమే ఇందుకు వేదిక కానుందా? అవుననే అంటున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. అఖిల భారత సదస్సుకు మావోయిస్టు అగ్ర నేతలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఆ వర్గాల సమాచారం. గతంలోనూ దండకారణ్యంలోనే ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ రక్షణ బలగాల ఒత్తిడి అధికంగా ఉండడం, ఏదైనా దాడి జరిగితే ఊహించని నష్టం వాటిల్లుతుందన్న కారణాలతో మావోయిస్టులు దాన్ని విరమించుకున్నారు. పీపుల్స్‌వార్, ఎంసీసీఐలు విలీనమై మావోయిస్టు పార్టీగా ఏర్పడి ఆదివారం(ఈ నెల 21)తో పదేళ్లవుతోంది. ఈ సందర్భంగా వారోత్సవాలు నిర్వహించాలనుకున్నారు. దీనిలో భాగంగా ఇటీవల జరిగిన కీలక సమావేశాల్లో మళ్లీ అఖిల భారత సదస్సును నిర్వహించాలని పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే ఇటీవల ఒడిశాలోని మల్కన్‌గిరి, విశాఖపట్నం మధ్యలో కీలక సమావేశం కూడా జరిగినట్లు తెలుస్తోంది. దీనికి పార్టీ అగ్రనేతలు హాజరయ్యారని సమాచారం. వారోత్సవాల నిర్వహణ, జనతన సర్కార్ (మావోయిస్ట్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రజాప్రభుత్వం) పనితీరు, గిరిజన ప్రాంతాలపై పట్టు కొనసాగింపు, దుర్బేధ్యమైన అబూజ్‌మడ్‌లో సాయుధ బలగాల పెంపు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. సదస్సుకు రక్షణగా ఏడంచెల వ్యవస్థ ఆలిండియా కాంగ్రెస్‌ను మావోయిస్టు పార్టీ చాలా పకడ్బందీగా నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి ఏడంచెల భద్రతను ఏర్పాటు చేసుకుంటుంది. వీటిని దాటుకుని సదస్సు జరిగే చోటుకు చేరుకోవడం అసాధ్యమనే చెప్పాలి. మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్ కోటలో దాదాపు 20 వేల మంది సాయుధులు ఉన్నట్లు సమాచారం. కోట చుట్టూ ఉన్న దంతెవాడ, బీజాపూర్, బస్తర్, సుకుమా, కొండగావ్ ప్రాంతాల్లో జనతన సర్కార్లు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. బస్తర్ ప్రాంతంలో కొంత పట్టు తప్పినా మిగిలిన చోట్ల కమిటీలు చురుగ్గానే ఉన్నాయని మావోయిస్టు పార్టీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో మరింత పట్టు సాధించాలనే కోణం లో పావులు కదుపుతోంది. అందులో భాగంగా ఇప్పటివరకు విల్లంబులు ధరించి పోరాడుతోన్న భూంకాల్ మిలీషియా సభ్యులకు ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. అబూజ్‌మడ్‌లోని దళాలకు కిషన్‌జీ తమ్ముడు వేణుగోపాల్ సారథ్యం వహిస్తున్నారు. స్పెషల్ జోనల్ కమిటీలకు రామన్న నేతృత్వం వహిస్తున్నారు. సమీప గ్రామాల్లోని జనతన సర్కార్ కమిటీలను పరిపుష్టం చేసుకోవడం, గ్రామ కమిటీల ద్వారా శ్రమదానం, పాఠశాలల నిర్వహణ, మెడికల్ క్యాంపుల ఏర్పాటు వంటి కార్యక్రమాలను విస్తృతం చేయాలని మావోయిస్టు పార్టీ భావిస్తోంది. మరోవైపు మావోయిస్టులపై అదను చూసి దాడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ప్రత్యేక కంపెనీలను ఏర్పాటు చేస్తోంది. సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలకు చెందిన 10 వేల మందిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర కమిటీ కొత్త సభ్యులెవరు? సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు నాయకత్వం తమ కార్యకలాపాలతో పాటు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల వివరాలను కూడా అత్యంత గోప్యంగా ఉంచుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్రంలో ఎన్డీయే సర్కారు రావడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రంగా దెబ్బతిన్న అనుభవాల నేపథ్యంలో ఈ పంథాను ఎంచుకుంది. పార్టీలో కీలక బాధ్యతలను నిర్వహించే కేంద్ర కమిటీ సభ్యుల వివరాలను రహస్యంగా ఉంచడమే మేలని అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కొత్తగా కేంద్ర కమిటీలోకి తీసుకున్న ఎనిమిది మంది మావోయిస్టు నాయకుల వివరాలను బహిర్గతం చేయడం లేదు. మూడేళ్లుగా కేంద్ర కమిటీలో 17 మంది వరకు సభ్యులు ఉన్నారు. వీరిలో 14 మంది తెలుగు వారే. గత పదేళ్లలో జరిగిన ఎన్కౌంటర్లలో చాలా మంది పార్టీ అగ్రనేతలు మృతి చెందారు. ఏకంగా కొన్ని దళాలే కనుమరుగయ్యాయి. పశ్చిమబెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్‌జీ మరణం మావోయిస్టు పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు సాగించడమే గగనమైపోయింది. అయితే ఇక్కడ తిరిగి పట్టు సాధించడానికి మావోయిస్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో కేంద్ర కమిటీ సభ్యుల వివరాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. -
దశాబ్ది ఉత్సవాలు నిర్వహించండి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : పీపుల్స్‌వార్, ఎంసీసీఐ పార్టీలు విలీనమై మావోయిస్టు పార్టీగా ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను పెద్ద ఎత్తున జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దోపిడీ పాలనకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాలు ఏకం కావాలని, దళిత, ఆదివాసీ, మైనార్టీ, మహిళలు ఈ క్రమంలో పెద్ద ఎత్తున ముందుకు రావాలని ఆ పార్టీ కోరింది. ప్రజా ప్రభుత్వాల స్ఫూర్తితో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పూర్తి చేసే దిశలో మిలిటెంట్ పోరాటాలకు సిద్ధపడాలని, దోపిడీ పాలనను నలుమూలలా నిర్మూలించేంతవరకు విరామం లేకుండా గెరిల్లా పోరాటాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యదర్శి కిరణ్ పేరిట సోమవారం ‘సాక్షి’ కార్యాలయానికి బహిరంగ లేఖ వ చ్చింది. కిరణ్ లేఖ పూర్తి పాఠం ఇది..... ‘సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్, ఎంసీసీఐ పార్టీలు కలిసి ఒకే పార్టీగా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగుపెడుతోంది. ఈ తరుణంలో ఉజ్వలమైన మార్క్సిజం - లెనినిజం -మావో ఆలోచనా విధానం పతాకాన్ని ఎత్తి పట్టడాన్ని మనం కొనసాగించాం. దేశ నిర్దుష్ట పరిస్థితుల్లో సాగిన మన విప్లవ చిరునామాకు దానిని అన్వయించాం. దీర్ఘకాలిక యుద్ధాన్ని కొనసాగించడంలో, అభివృద్ధి పర్చడంలో పలు విజయాలు సాధించాం. భూస్వామ్య రైతాంగ ప్రజా బాహుళ్యాన్ని వ్యతిరేకించి పేద, భూమిలేని రైతులను సమీకరించి వారిపై ఆధారపడి గ్రామాల్లో, ప్రాంతాల్లో వ్యవసాయ విప్లవ గెరిల్లా పోరాటాన్ని అభివృద్ధి చేయడం ద్వారా విముక్తి ప్రాంతాల స్థాపన వైపు పురోగమిస్తున్నాం. ప్రతీఘాతక పాలక వర్గాలు చేపట్టిన నిరంతరాయమైన నిర్బంధాన్ని, అణచివేత, క్యాంపెయిన్లను ప్రతిఘటించి పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. పలు గెరిల్లా జోన్లలో గెరిల్లా సైన్యాన్ని, పీఎల్జీఏను అభివృద్ధి చేస్తూ విముక్తి ప్రాంతాల వైపు పురోగమిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కొంత దెబ్బతిన్నప్పటికీ దండకారణ్యం, బీహార్, జార్ఖండ్, ఒడిశా, మిగతా రాష్ట్రాల్లో విస్తరించాం. విశాల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రభుత్వాలను ఏర్పరుచుకుని పురోగమిస్తూ పట్టణాలు చుట్టుముట్టే వైపు పరుగెడుతూ నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పూర్తి చేసే దిశగా సాగుతున్నాం. ఈ కాలంలో మితవాద, అవకాశవాద ధోరణులకు వ్యతిరేకంగా పోరాడి విజయాలు సాధించాం. నేడు ప్రపంచంలో మునుపెన్నడూ ఎరుగని కల్లోల పరిస్థితి నెలకొని ఉంది. కోట్లాది ప్రజలు సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ వ్యతిరేక, ప్రత్యేకించి అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలోకి వస్తున్నారు. ఈ క్రమంలో సామ్రాజ్యవాద శక్తులకు ఊడిగం చేసే సకల ప్రతీఘాత శక్తులకు, వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాటంలోకి వస్తున్నాం. అన్ని మావోయిస్టు శక్తులు ఏకతాటిపైకి వచ్చేలా ఒక వేదిక ఏర్పరుచుకుని వివిధ సమస్యలపై ఉమ్మడి పోరాటాలు చేస్తున్నాం. మార్క్సిజం -లెనినిజం - మావోయిజం అనే సైద్ధాంతిక ఆయుధాన్ని ధరించిన మనం మన భావజాలాన్ని భారతదేశంలోని వర్తమాన ప్రపంచంలోని నిర్దుష్ట పరిస్థితులకు అన్వయించి దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని మరింత లోతుగా విస్తృతం చేసుకోగలమని, పురోగమింపజేయగలమని విశ్వసిస్తున్నాం. ఇలా మార్క్సిజం - లెనినిజం - మావోయిజాన్ని సృజనాత్మకంగా అన్వయించే క్రమంలో నుంచే దానిని విప్లవ అనుభవాలతో విశ్లేషించే క్రమంలో మనం ఈ కార్మిక విజ్ఞాన శాస్త్రాన్ని మరింత సుసంపన్నవంతం చేయగలగాలి. ప్రియమైన ప్రజలారా... ప్రజాస్వామిక వాదులారా... సీసీఐ మావోయిస్టు పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటూ ఈ మధ్యకాలంలో సాధించిన విజయాలను నెమరవేసుకుంటూ కొత్తగా నూతన ఒరవడిలోనికి మునుముందుకు పోవాలని పిలుపునిస్తున్నాం. మావోయిస్టు పార్టీ, దాని నాయకత్వంలో పీడితులందరూ సమీకృతులై సమష్టిగా నడుస్తూ దోపిడీ పీడనను, అవినీతి, కుంభకోణాలకు పాల్పడే అరాచక శక్తులను, ప్రభుత్వాలను కూల్చివేయాలని కోరుతున్నాం. శ్రామిక వర్గ సీపీఐ మావోయిస్టు నాయకత్వాన అందరూ కలిసి రావాలని, భూమి, భుక్తి, విముక్తి కావాలంటే ఈ దోపిడీ సమాజాన్ని నలుమూలలా నిర్మూలించకుండా మనం మనగలగడం అసాధ్యమని భావిస్తున్నాం. అందుకోసం సమస్త ప్రజానీకం కులమతాలకు అతీతంగా పీడితులందరూ ముక్తకంఠంతో ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. ’ -
కొయ్యూర్ టు ఢిల్లీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మరో రెండు రోజులు గడిస్తే.. కొయ్యూర్ ఎన్కౌంటర్ జరిగి పద్నాలుగేళ్లు. పీపుల్స్‌వార్ అగ్రనేతలు ముగ్గురు నేలకొరిగిన ఈ సంఘటన ఇప్పటికీ వివాదాస్పదంగానే మిగలడంతో పాటు నక్సలైట్ల ఉద్యమ చరిత్రలో నెత్తుటి అధ్యాయంగా నిలిచిపోయింది. అప్పటి తాడిచెర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో 1999 డిసెంబర్ 2 తెల్లారుజామున జరిగిన ఆ ఎన్కౌంటర్లో పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యామ్, ఎర్రం సంతోష్‌రెడ్డి అలియాస్ మహేశ్, శీలం నరేశ్ అలియాస్ మురళి మృతి చెందారు. ఎదురుకాల్పుల్లో ఆ ముగ్గురిని మట్టుబెట్టినట్లుగా పోలీసు అధికారులు ప్రకటించారు. తీవ్రవాదుల అణిచివేతలో విశేష కృషి చేసినందుకు గుర్తింపుగా... కొయ్యూర్ ఎన్కౌంటర్ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు చెప్పుకున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులకు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వం గ్యాలంటరీ శౌర్య పతకాలను బహుకరించింది. కానీ.. ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. బెంగళూరులో అగ్రనేతలను పట్టుకున్న పోలీసులు హెలి కాప్టర్లో తీసుకెళ్లి కొయ్యూర్ అడవుల్లో కాల్చి చంపినట్లుగా వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో 2008 అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వం ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. శౌర్య పతకాలను ఎందుకు వెనక్కి తీసుకోవద్దో తెలియజెప్పాలని వారి నుంచి వివరణ కోరింది. డిసెంబర్ 2న ఉదయం6.35 నుంచి 7.02 గంటల వ్యవధిలో ఈ ఎదురుకాల్పులు జరిగినట్లుగా రికార్డుల్లో నమోదైంది. కానీ.. ఆ సమయంలో ముగ్గు రు ఐపీఎస్ అధికారులు భౌతికంగా ఆ ఘటనా స్థలిలో లేరనేది ప్రధాన అభియో గం. ప్రభుత్వ నోటీసులకు ఐపీఎస్ అధికారులు వివరణ ఇచ్చినప్పటికీ.. తదుపరి ప్రత్యేక విచారణలతో ఈ వివాదం కోర్టుకెక్కింది. కానీ.. హెలికాప్టర్ పెలైట్ ఇచ్చిన సమాచారం కీలకంగా మారడంతో... ఒక దశలో ఈ కేసు పోలీసు ఉన్నతాధికార వర్గాలను సైతం కుదిపేసింది. తాజాగా ఈ కేసు కు సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైనట్లు తెలిసింది. సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుందా? తిరస్కరిస్తుం దా? అనేది వేచిచూడాల్సిందే. కొయ్యూరు ఘటనకు 14 ఏళ్లు నిండుతున్న నేపథ్యంలో ఈ కేసు మళ్లీ తెరపైకి రానుండడం చర్చనీయాంశంగా మారింది. పీపుల్స్‌వార్‌లో ఆదర్శనేతలుగా గుర్తింపుపొందిన ఆ ముగ్గు రు అగ్రనేతల మరణంతో ఉత్తర తెలంగాణలో విప్లవోద్యమ పతనం ఆరంభమైంది. అప్పటినుంచి పీపుల్స్‌వార్ సైతం తమ వ్యూహాన్ని మార్చుకుంది. ఏడాది తర్వాత అమరుల సంస్మరణ ఉత్సవాలను తలపెట్టడంతోపాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ)ని ఏర్పాటు చేసింది.