పశ్చిమ కనుమలలో ప్రాణదాతలు | Sakshi
Sakshi News home page

పశ్చిమ కనుమలలో ప్రాణదాతలు

Published Thu, Mar 21 2024 6:03 AM

All-female force conserve Western Ghats - Sakshi

నేడు ప్రపంచ అటవీ దినోత్సవం

‘ప్రాణదాత’ అనే మాట మనుషులకు సంబంధించే ఎక్కువగా వినబడుతుంది. ‘ఆల్‌–ఫిమేల్‌ రెయిన్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌’లోని మహిళలు మాత్రం పశ్చిమ కనుమల అరణ్యాలలోని మొక్కల ప్రాణదాతలు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మొక్కలు, చెట్లను కాపాడడానికి ‘గురుకుల బొటానికల్‌ శాంక్చువరీ’ ద్వారా మొక్కవోని కృషి చేస్తున్నారు. పచ్చటి అడవి పెదవుల మీద చిరునవ్వు చెరిగిపోకుండా కష్టపడుతున్నారు...

పశ్చిమ కనుమల అడవులు అపూర్వమైన చెట్లజాతులు, జంతుజాలం, పక్షి, చేప జాతులకు ప్రసిద్ధి పొందాయి. అయితే ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ ది కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయుసిఎన్‌) పశ్చిమ కనుమల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. అటవీ నిర్మూలన, వాతావరణ మార్పుల వల్ల మన దేశంలోని పశ్చిమ కనుమలు ప్రమాదంలో పడ్డాయి. ఈ ప్రాంతంలోని అడవులను రక్షించుకోవడానికి, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి కేరⶠలోని పెరియాలో ఎన్నో సంవత్సరాల క్రితం ఏర్పాటైన ‘గురుకుల బొటానికల్‌ శాంక్చువరీ’ లోని ‘ఆల్‌–ఫిమేల్‌ రెయిన్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌’ కృషి చేస్తోంది.

27 మంది మహిళలు ఉన్న ‘ఆల్‌–ఫిమేల్‌ రెయిన్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌’ ‘గురుకుల బొటానికల్‌ శాంక్చువరీ’లో అరుదైన మొక్కలను సంరక్షిస్తోంది. ‘మొక్కలను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. ప్రమాదంలో ఉన్న మొక్కలకు ఈ గురుకులం శరణార్థి శిబిరంలాంటిది. ఆస్పత్రి కూడా అనుకోవచ్చు. మొక్కలకు సంబంధించిన ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ మట్టిపాత్రలతో ఉంటుంది’ అంటుంది ఎకోసిస్టమ్‌ గార్డెనర్‌ సుప్రభా శేషన్‌.

తొంభై శాతం అడవులు మాయమైన పరిస్థితిని ‘పర్యావరణ మారణహోమం’గా అభివర్ణిస్తుంది సుప్రభా శేషన్‌.
అడవులనే ఇల్లుగా భావిస్తున్న సుప్రభ శేషన్‌ ‘గ్రీన్‌ ఆస్కార్‌’గా గుర్తింపు పొందిన యూకేలోని టాప్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రైజ్‌ ‘విట్లీ’కి ఎంపికైంది.
గురుకుల బొటానికల్‌ శాంక్చువరీ (జీబిఎస్‌) అరుదైన మొక్కల ‘స్వర్గధామం’గా పేరు తెచ్చుకుంది పశ్చిమ కనుమల ప్రాంతాలలో 50 లక్షల మందికి పైగా నివసిస్తున్నందున అడవులు ప్రమాదం అంచున ఉన్నాయి. 28 ఏళ్లుగా ‘జీబిఎస్‌’లో పనిచేస్తున్న సుప్రభా శేషన్‌ అరణ్యాలకు సంబంధించిన పరిస్థితులు విషమించడాన్ని ప్రత్యక్షంగా చూసింది.

‘అరుదైన మొక్కలను కాపాడడంలోని ఆనందం అంతా ఇంతా కాదు’ అంటుంది సీనియర్‌ గార్డెనర్‌ లాలీ జోసెఫ్‌. పాతిక సంవత్సరాలుగా ఈ అభయారణ్యంలో పనిచేస్తున్న జోసెఫ్‌ ‘మొక్కలు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉండగలం’ అంటోంది.
‘నేను చూస్తుండగా అడవిలో ఒక చెట్టు నేల కూలిపోవడాన్ని మించిన విషాదం మరొకటి లేదు’ అంటుంది లాలీ జోసెఫ్‌.
కీటకాలు, పాముల నుంచి రక్షణగా పెద్ద బూట్లు ధరించిన ‘ఆల్‌–ఫిమేల్‌ రెయిన్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌’లోని మహిళలు అడవులలో తిరుగుతుంటారు. ప్రమాదంలో ఉన్న మొక్కలు, చెట్లను రక్షించడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. సహజ పదార్థాల నుంచి పురుగు మందులను తయారుచేస్తుంటారు.

అడవి గుండె చప్పుడు విని...
దిల్లీలో పెరిగిన సుప్రభా శేషన్‌... కృష్ణమూర్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని బ్రోక్‌వుడ్‌ పార్క్‌ సెంటర్‌ (యూకే)లో చదువుకుంది. అక్కడ ఉన్నప్పుడు తొలిసారిగా కేరళలోని ‘గురుకుల బొటానికల్‌ శాంక్చువరీ’ గురించి విన్నది. ల్యాండ్‌ స్కేప్‌ గార్డెన్స్, పార్క్‌ ల్యాండ్‌ల చరిత్రపై ప్రాజెక్ట్‌ చేస్తున్న సుప్రభ శేషన్‌ని కేరళలోని ‘గురుకుల’ ఆకర్షించింది. అమెరికాలోని ల్యాండ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఒక సంవత్సరం పాటు అధ్యయన కార్యక్రమాల్లో భాగం అయిన సుప్రభ ఆ తరువాత మన దేశంలోని ఆదివాసీ గూడేలలో మకాం వేసి అడవుల గుండె చప్పుడు విన్నది. తన ప్రయాణంలో భాగంగా ‘గురుకుల బొటానికల్‌ శాంక్చువరీ’ (జీబిఎస్‌) వ్యవస్థాపకుడు వోల్ఫ్‌ గాంగ్‌ను కలిసింది. ‘జీబీఎస్‌’ ద్వారా అడవులను రక్షించడానికి వారు చేస్తున్న ప్రయత్నాల గురించి తెలుసుకుంది. అలా లాలీ జోసెఫ్, సుమ కెలోత్‌లాంటి ఇతర ‘జీబియస్‌’ సభ్యులతో కలిసి అడవిబాట పట్టింది. పశ్చిమ కనుమలలోని పర్వతాలను అధిరోహించింది. అంతరించిపోతున్న మొక్కల జాతుల గురించి తెలుసుకోవడమే కాదు వాటి పరిరక్షణలో భాగంగా ‘జీబియస్‌’గా గార్డెనర్‌గా ప్రయాణాన్ని ప్రారంభించింది.
 
ఈ నల్లని రాళ్లలో..

‘గురుకుల బొటానికల్‌ శాంక్చువరీ’లోని సీనియర్‌ గార్డెనర్‌ అయిన లాలీ జోసెఫ్, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మొక్కల కోసం అన్వేషిస్తుంటుంది. గురుకులంలోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ ద్వారా వాటిని బతికించే ప్రయత్నం చేస్తుంది. కొండ, కోనలు తిరుగుతూ మొక్కల యోగక్షేమాలు తెలుసుకుంటుంది.

Advertisement
Advertisement