సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు వెళ్లిన నగర వాసులు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మంగళవారం తెల్లారేసరికి నగరానికి చేరుకున్నారు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతున్నది.
చాలాచోట్ల కిలోమీటర్ల కొద్దీ వాహనాల బారులు కనిపించాయి. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బీజేఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లలో రద్దీ నెలకొంది. హైదరాబాద్ శివారుకు చేరుకున్న ప్రజలు అక్కడి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తుండడంతో మెట్రో రైళ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి.
మెట్రో ప్రాంగణాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ముఖ్యంగా విజయవాడ వైపు నుంచి వచ్చే ప్రయాణికులు ఎల్బీనగర్ వద్ద దిగి మెట్రో ఎక్కేస్తుండడంతో ఎల్బీనగర్-మియాపూర్ రూట్ ఒక్కసారిగా రద్దీగా మారింది. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ లో టికెట్ల కోసం పెద్ద క్యూ ఉంది
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఉదయం అరగంట ముందే అంటే 5.30 గంటలకే మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నేడు అదనపు ట్రిప్పులు నడిపాలని మెట్రో నిర్ణయించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment