సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కలల మెట్రో జర్నీలో మతిమరుపు రామన్నలు బయలుదేరుతున్నారు. వీరు తరచూ తమ వస్తువులను పోగొట్టుకుంటున్నారు. అయితేనేం..వారి వస్తువులను కంటికి రెప్పలా కాపాడుతూ... పువ్వుల్లో పెట్టిమరీ అప్పజెబుతున్నారు మన మెట్రో సిబ్బంది. ఇందుకోసమే మెట్రో లాస్ట్ అండ్ ప్రాపర్టీ ఆఫీస్ పనిచేస్తోంది. గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైలు ఇప్పుడు ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్– రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గాల్లో పరుగులు పెడుతోన్న విషయం విదితమే.
ఈ మార్గాల్లో నిత్యం ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. సుమారు మూడు లక్షల మంది జర్నీ చేస్తున్నారు. వీరిలో నెలకు రెండువందల మంది తమ వస్తువులను పోగొట్టుకుంటున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రయాణ హడావుడి..సమయానికి గమ్యస్థానాలకు చేరుకోవాలన్న తొందరలో చాలా మంది లగేజి స్కానింగ్ యంత్రాల వద్దనే తమ వస్తువులను మరచిపోతున్నట్లు అధికారులు సెలవిస్తున్నారు. అయినప్పటికీ ప్రయాణీకుల వస్తువులను అత్యంత జాగ్రత్తగా వారికి అప్పజెప్పేందుకు మెట్రో లాస్ట్ అండ్ ప్రాపర్టీ ఆఫీస్ చాలా చురుకుగా పనిచేస్తుండడం విశేషం.
మీ వస్తువులు భద్రంగా...
మెట్రోజర్నీలో ప్రయాణీకులు చాలావరకు లగేజి స్కానర్ల వద్దనే తమ వస్తువులను పోగొట్టుకుంటున్నారు. దీంతో స్టేషన్ కంట్రోలర్ మైక్‌లో అనౌన్స్‌మెంట్ వినిపిస్తున్నారు. అప్పటికీ సదరు ప్రయాణీకులు హడావుడిలో తమ వస్తువులను మర్చిపోయిన పక్షంలో ఆయా వస్తువులను జాగ్రత్తగా సేకరించి వాటికి ట్యాగ్ వేస్తున్నారు. మూడురోజులపాటు సదరు స్టేషన్‌లో స్టేషన్‌కంట్రోలర్ రూమ్‌లో భద్రపరుస్తున్నారు.
అప్పటికీ సదరు వినియోగదారులు తమ వస్తువుల కోసం స్టేషన్‌లో సంప్రదించని పక్షంలో వాటిని జాగ్రత్తగా లాస్ట్ అండ్ ప్రాపర్టీ ఆఫీస్(ఎల్‌పీఓ)కు బదిలీచేస్తున్నారు. అక్కడి భద్రతా సిబ్బంది ఈ వస్తువులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ప్రయాణీకులు మరచి పోయే వస్తువుల్లో ఆహార పదార్థాలు చెడిపోయే ప్రమాదం ఉండడంతో వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ఇతర వస్తువులను జాగ్రత్తగా భద్రపరుస్తుండడం విశేషం.
మరచిపోతున్నారివే..
వినియోగదారులు మరచిపోతున్న వస్తువుల్లో అత్యధికంగా పెన్నులు, టిఫిన్ బాక్స్‌లు, చిన్నబ్యాగ్‌లే అత్యధికంగా ఉంటున్నాయి. నెలకు సుమారు 200 మంది తమ వస్తువులను మరచిపోతున్నట్లు మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల శివ అనే వ్యక్తి మియాపూర్ మెట్రో స్టేషన్‌వద్ద ఒక బ్యాగ్ మరచిపోయారు. మెట్రో సిబ్బంది ఈ బ్యాగ్‌ను సురక్షితంగా భద్రపరిచారు. ఇందులో సుమారు మూడు లక్షల విలువైన బంగారు ఆభరణాలున్నాయి. ఈ బ్యాగును మెట్రో సిబ్బంది సురక్షితంగా సదరు ప్రయాణీకునికి అప్పజెప్పినట్లు మెట్రో అధికారులు తెలిపారు. మెట్రో లాస్ట్ అండ్ ఫౌండ్ సేవల పట్ల ప్రయాణికులు వందశాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.
అనుమానిత వస్తువులపై నజర్..
పర్సులో ఇమిడే కత్తులు, ఇతర మారణాయుధాలు, డ్రగ్స్ తదితర విషయాలను క్షుణ్ణంగా పరిశీలించే విషయంపై మెట్రో భద్రతా సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చినట్లు మెట్రో అధికారులు తెలిపారు. లగేజి స్కానింగ్ యంత్రాలు మారణాయుధాలను,అనుమానిత వస్తువులను స్టేషన్‌లోనికి తీసుకెళ్లకుండా ఎక్కడికక్కడే కట్టడిచేస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment