( ఫైల్ ఫోటో )
టీ20 వరల్డ్ కప్ 2024తో రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెచ్ కోచ్ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆయన మరోసారి దరఖాస్తు చేసుకుంటారా? లేదంటే ఆ అవకాశం మరొకరిని వరిస్తుందా?.. టీమిండియాకు కాబోయే హెడ్ కోచ్ ఎవరు? అనే చర్చ నడుస్తోంది. ఈ లోపే హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది.
కొత్త కోచ్ పదవీకాలం ఈ ఏడాది జులై 1 నుంచి 2027 డిసెంబర్ 31వ తేదీ వరకు ఉంటుందని బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. అంటే కొత్తగా కోచ్ పదవికి ఎంపికయిన వ్యక్తి 2027 వన్డే ప్రపంచకప్ వరకు భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా కొనసాగుతారన్నమాట. అలాగే.. కొత్త కోచ్‌కు దరఖాస్తు చేసుకునేవాళ్ల వయసు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. పారితోషికం అనుభవాన్ని బట్టి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. వీటితో పాటు..
మూడు ఫార్మాట్లలో జట్టుకు హెడ్ కోచ్ గా కొనసాగుతాడు. కోచ్‌కు 14-16 మంది సహాయక సిబ్బంది ఉంటారు.
టీమ్ ప్రదర్శన, నిర్వహణకు ప్రధాన కోచ్ పూర్తి బాధ్యత వహిస్తాడు.
అలాగే స్పెషలిస్ట్ కోచ్‌లు, సహాయక సిబ్బంది బృందానికి నాయకత్వం వహిస్తాడు.
భారత జట్టులోని క్రమశిక్షణా కోడ్‌లను సమీక్షించడం, నిర్వహించడం, అమలు చేయడం ప్రధాన కోచ్ బాధ్యత
అర్హతలు
కనీసం 30 టెస్ట్ మ్యాచ్‌లు లేదా 50 వన్డేలు ఆడి ఉండాలి.
లేదంటే.. టెస్టు క్రికెట్ ఆడే దేశానికి ప్రధాన కోచ్‌గా కనీసం 2 సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
ఐపీఎల్ జట్టు లేదా సమానమైన ఇంటర్నేషనల్ లీగ్/ఫస్ట్ క్లాస్ జట్లకు/ జాతీయ అ జట్లకు ప్రధాన కోచ్‌గా కనీసం మూడేళ్లు పనిచేసి ఉండాలి.
బీసీసీఐ లెవల్ 3 సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.
పై కండిషన్లలో ఏది ఉన్నా సరే.. దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్లేయర్
టీమిండియా హెడ్ కోచ్ దరఖాస్తుల నేపథ్యంలో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఈ ఐపీఎల్ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ గా ఉన్నాడు
‘‘టీమిండియా హెచ్ కోచ్ పదవిపై నేను ఆసక్తిగా ఉన్నాను. దీని గురించి ఎప్పుడూ నేను ఆలోచించలేదు. ప్రతి అంతర్జాతీయ కోచ్ పై నాకు అమితమైన గౌరవం ఉంది. ఎందుకంటే అందులో ఉండే ఒత్తిడి నాకు తెలుసు. కానీ ఇండియన్ టీమ్ కోచింగ్ అద్భుతమైన జాబ్. ఈ దేశంలో ఉన్న టాలెంట్ చూసిన తర్వాత కోచ్ పదవి అనేది ఆకర్షణీయంగా కనిపిస్తోంది’’ అని లాంగర్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
లాంగర్ కెరీర్
జస్టిన్ లాంగర్ ఆస్ట్రేలియా తరఫున 105 టెస్టులు ఆడాడు. 45 సగటుతో 7696 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టీమ్ కోచ్ గా ఉన్నాడు. అతని కోచింగ్ లోనే 2021లో ఆస్ట్రేలియా తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ కు కూడా కోచ్ గా ఉన్నాడు. గత రెండు సీజన్లలోనూ ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరుకుంది.
ఫారినర్‌కు ఛాన్స్ దక్కేనా?
డంకన్ ఫ్లెచర్ తర్వాత గత పదేళ్లలో మరో విదేశీ కోచ్ ను నియమించలేదు. కుంబ్లే, రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ ఈ బాధ్యతను చేపట్టారు. దీంతో.. బీసీసీఐ మరోసారి విదేశీ కోచ్ ను నియమిస్తుందా లేదా అన్నది చూడాలి. అయితే ఈసారి ఓ విదేశీ కోచ్ ను నియమించే అవకావాలను కూడా కొట్టిపారేయలేం అన్నట్లుగా బీసీసీఐ సెక్రటరీ జై షా మాటలను బట్టి అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment