
జనసేన అభ్యర్థి సమక్షంలో ఆ పార్టీ కార్యకర్తల దౌర్జన్యం
వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడిని చంపుతామని బెదిరింపు
కాకినాడ రూరల్ వేములవాడలో ఘటన
కరప: “ఒక్కొక్కరి అంతు చూస్తాం. ఈ రోజు తలకాయలు లేచిపోతాయి. ఎవరొస్తారో చూస్తాం’ అంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులపై కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో ఆ పార్టీ కార్యకర్తలు దౌర్జన్యం, బెదిరింపులకు దిగారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కరప మండలం పెద కొత్తూరులో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు నానాజీ తన అనుచరులు, పొరుగూరు జనంతో కలసి ఆరు కార్లలో సాయంత్రం 5 గంటల సమయంలో వేములవాడ గ్రామానికి వచ్చారు. స్థానిక నాయకులను వెంట పెట్టుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
అంతమంది జనంతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడమేమిటని వారిని స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డగించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబునుద్దేశించి “వాడొస్తే బూత్‌లోకి పంపిస్తారా?’ అంటూ రాయలేని పదజాలంతో నానాజీ దూషణలకు దిగారు. ఆయన మాట తీరుపై వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలో వారితో జనసేన శ్రేణులు వాగ్వాదానికి, తోపులాటకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి, ఇరు వర్గాల వారినీ చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.
అనంతరం నానాజీ పెదకొత్తూరు గ్రామం వెళ్లారు. అదే సమయంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు చింతా ఈశ్వరరావు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్తూండగా, తన అనుచరులు 60 మందితో కలసి గేటు వద్ద నానాజీ అడ్డంగా నిలబడ్డారు. లోపలకు వెళ్లడానికి దారివ్వాలని ఈశ్వరరావు కోరగా.. “పక్క నుంచి వెళ్లు’ అని నానాజీ దురుసుగా మాట్లాడారు. ఇదే అదనుగా అక్కడే ఉన్న వైఎస్సార్ సీపీ కార్యకర్త తోటకూర శ్రీనుపై జనసేన కార్యకర్తలు దౌర్జన్యం చేసి మొబైల్ ఫోన్ లాగేసుకుని, ఒక్కొక్కరి అంతు చూస్తామంటూ బెదిరించారు. ఈ రోజు తలకాయలు లేచిపోతాయి, ఎవరొస్తారో చూస్తామంటూ బెదిరించారు. ఈ క్రమంలో ఇరువర్గాల వారూ వాగ్వాదానికి దిగి, తోసుకున్నారు.
పోలీసులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇదిలా ఉండగా మధ్యాహ్నం తమ ఇంటి మీదకు బీరు సీసా విసిరి, తల తీసేస్తామంటూ జనసేన పార్టీ కార్యకర్తలు తమను బెదిరించి, భయభ్రాంతులకు గురి చేశారని ఈశ్వరరావు భార్య, మాజీ సర్పంచ్ చింతా దుర్గాశ్రీ తెలిపారు. జనసేన కార్యకర్తల నుంచి రక్షణ కలి్పంచాలని కోరారు. కూరాడలో కూడా జనసేన కార్యకర్తలు రెచ్చిపోయి వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగడంతో రెండు గంటల పాటు పోలింగ్ నిలిచిపోయింది. రాత్రి 9 గంటలకు కూడా పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. కొరిపల్లి, గురజనాపల్లి గ్రామాల్లో కూడా జనసేన కార్యకర్తలు వీరంగం వేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.