ముంబై విజయంలో అదే హైలైట్‌.. సచిన్‌ ట్వీట్‌ వైరల్‌ | Sakshi
Sakshi News home page

ముంబై విజయంలో అదే హైలైట్‌.. సచిన్‌ ట్వీట్‌ వైరల్‌

Published Fri, Apr 12 2024 1:18 PM

Hardik Finishing Was Icing On Cake: Tendulkar Praise After MI Blistering Win - Sakshi

ఐపీఎల్‌-2024లో హ్యాట్రిక్‌ పరాజయాల అనంతరం ముంబై ఇండియన్స్‌ కోలుకున్న తీరుపై ఆ జట్టు మెంటార్‌ సచిన్‌ టెండుల్కర్‌ హర్షం వ్యక్తం చేశాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో గురువారం నాటి మ్యాచ్‌లో సమిష్టి రాణించి గెలుపొందిన తీరు అమోఘమని కొనియాడాడు.

ఆర్సీబీతో మ్యాచ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా సంచలన ప్రదర్శన కనబరిచాడన్న సచిన్‌..  ఓపెనర్లు రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ దూకుడైన షాట్లతో విరుచుకుపడ్డారని ప్రశంసించాడు. ఇక గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ బాల్‌ను హిట్‌ చేస్తున్న తీరు చూసి ముచ్చటేసిందని ఈ టీమిండియా దిగ్గజం ‘స్కై’ని ఆకాశానికెత్తాడు.

అదే విధంగా ఆఖర్లో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా సిక్సర్‌ బాది మ్యాచ్‌ను ముగించడం కన్నుల పండుగ చేసిందని సచిన్‌ టెండుల్కర్‌ ముంబై ఇండియన్స్‌ సారథిపై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు.. ‘‘వరుస ఓటముల తర్వాత.. వరుసగా రెండు విజయాలు..

జస్‌ప్రీత్‌ బుమ్రా మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ పవర్‌ ప్లేలో ఏమాత్రం భయపడకుండా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి గొప్ప ఆరంభం అందించారు.

ఇక సూర్యకుమార్‌ యాదవ్‌ గాయం తర్వాత తిరిగి వచ్చి ఈ విధంగా హిట్టింగ్‌ చేయడం సంతోషాన్నిచ్చింది. హార్దిక్‌ పాండ్యా మ్యాచ్‌ను ఫినిష్‌ చేసిన తీరు అన్నిటికంటే మరింత గొప్పగా అనిపించింది’’ అని సచిన్‌ టెండుల్కర్‌ ట్వీట్‌ చేయగా సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది.

కాగా వాంఖడే ఆర్సీబీతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ప్రధాన పేసర్‌,‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ బుమ్రా(5/21) ఐదు వికెట్లతో చెలరేగగా.. గెరాల్డ్‌ కోయెట్జీ, ఆకాశ్‌ మధ్వాల్‌, శ్రేయస్‌ గోపాల్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అయితే, మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించిన నేపథ్యంలో.. పరిస్థితులకు తగ్గట్లుగా ముంబై బ్యాటర్లు బ్యాట్‌ ఝులిపించారు.

ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ 34 బంతుల్లోనే 69, రోహిత్‌ శర్మ 24 బంతుల్లో 38 పరుగులతో దంచికొట్టారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తన బ్యాట్‌ పవరేంటో చూపించాడు.

కేవలం 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపాడు. ఇక హార్దిక్‌ పాండ్యా కేవలం ఆరు బంతుల్లోనే 21 పరుగులతో అదరగొట్టాడు. స్ట్రైక్‌రేటు 350గా నమోదు చేసిన ఈ ఆల్‌రౌండర్‌ సిక్స్‌ బాది ముంబైని విజయతీరాలకు చేర్చాడు. తిలక్‌ వర్మ 10 బంతుల్లో 16 రన్స్‌ చేసి పాండ్యాతో కలిసి ఆఖరి వరకు అజేయంగా ఉన్నాడు. 

ఫలితంగా 15.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి ముంబై లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా ఐపీఎల్‌-2024లో ముంబైకి ఇది రెండో గెలుపు. తొలి మూడు మ్యాచ్‌లలో ఓడిన పాండ్యా సేన.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో బోణీ కొట్టిన విషయం తెలిసిందే.

చదవండి: Jasprit Bumrah: కెనడా క్రికెట్‌ జట్టులో చేరాలనుకున్న బుమ్రా.. సంచలన విషయం వెల్లడి

Advertisement
Advertisement