మోగిన నగారా
పాంచ్ పటాకా...
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
♦ ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు.. వివిధ దశల్లో
♦ జనవరి 11న తొలి నోటిఫికేషన్ విడుదల.. మార్చి 11న ఫలితాలు
♦ యూపీలో ఏడు విడతల్లో పోలింగ్.. గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో ఒకే విడత.. మణిపూర్‌లో రెండు విడతలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు వివిధ దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాల్లో ఒకే విడతలో, మణిపూర్‌లో రెండు విడతల్లో, ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల ఈవీఎంల కౌంటింగ్, ఫలితాలు మార్చి 11న జరుగుతాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో ఫిబ్రవరి 11 (73 నియోజకవర్గాలు), ఫిబ్రవరి 15 (67 ప్రాంతాలు), ఫిబ్రవరి 19 (69 ప్రాంతాలు), ఫిబ్రవరి 23 (52 ప్రాంతాలు), మార్చి 3 (49 ప్రాంతాలు), మార్చి 8 (40నియోజకవర్గాల్లో) ఎన్నికలు జరగనున్నాయి.
పంజాబ్, గోవాల్లో ఫిబ్రవరి 4న, ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 15న, మణిపూర్‌లో మార్చి 4, 8 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 11న పంజాబ్, గోవా ఎన్నికలకు నోటిఫికేషన్ రావటంతో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. నోట్లరద్దు వల్లనల్లదనం భారీగా తగ్గుతుందని భావిస్తున్నప్పటికీ ఎన్నికల అక్రమాలపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్లు సీఈసీ నసీం జైదీ తెలిపారు. ఎన్నికల కమిషనర్లు ఎ.కె.జోతి, ఓం ప్రకాష్ రావత్‌లతో కలిసి బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో జైదీ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల్లో కలిపి 1.85 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 690 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఇందులో 16 కోట్ల 80 లక్షలకు పైగా మందికి ఓటుహక్కు ఉందన్నారు.
షెడ్యూలు ప్రకటనతో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఓటర్లను ప్రభావితం చేసే విధానపరమైన ప్రకటనలు చేయరాదని పేర్కొంది. అయితే కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ఉండబోతుందన్న వార్తలపై.. ఒక రాజకీయ పార్టీ ద్వారా ఫిర్యాదు అందిందని, దీనిని పరిశీలిస్తామని పేర్కొన్నారు. మహిళా ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా వారికోసమే కొన్ని పోలింగ్ స్టేషన్లు, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులకు అనుకూలంగా ఏర్పాట్లు చేయనున్నట్లు జైదీ వెల్లడించారు.
ఎవరికి ఓటేశారు?
ఓటర్లు తామేసిన ఓటు ఎవరికి వెళ్లిందో తెలుసుకునేందుకు వీలుగా ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) యంత్రాలను ఈవీఎంలకు అమర్చుతున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. సాధ్యమైనన్ని చోట్ల వీటిని అమర్చుతామని పేర్కొంది. గతంలో పుదుచ్చేరి ఎన్నికల్లో వీటిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినట్టు తెలిపింది. అలాగే అభ్యర్థుల ఫోటో కూడా ఈవీఎం యంత్రాలపై ప్రదర్శించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.
‘నో డిమాండ్’ తప్పనిసరి
అభ్యర్థులు నామినేషన్ పత్రాలతోపాటు నో డిమాండ్ సర్టిఫికెట్‌ను, అదనపు అఫిడవిట్‌ను జతపర్చాలని ఈసీ స్పష్టం చేసింది. విద్యుత్తు చార్జీలు, నీటి వినియోగ చార్జీలు, టెలిఫోన్ చార్జీలు, అలాగే ప్రభుత్వ వసతి గృహాల్లో నివాసం ఉంటే అద్దె బకాయిలు లేవని నో డిమాండ్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
స్వాగతించిన రాజకీయ పక్షాలు
న్యూఢిల్లీ: యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయటాన్ని రాజకీయ పార్టీలన్నీ స్వాగతించాయి. నోట్లరద్దు తర్వాత ప్రజల్లో సానుకూలత కనబడుతోందని, అదే కలిసొస్తుందని బీజేపీ చెబుతుండగా.. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరగాలని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఐదు రాష్ట్రాల్లో తామే గెలుస్తామని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు అన్నారు. అధికారం, డబ్బుల దుర్వినియోగాలపై ఈసీ కఠినంగా ఉండాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా అన్నారు. పంజాబ్, గోవాల్లో బీజేపీపై వ్యతిరేకత ఉందని, అది మాకు అనుకూలంగా మారుతుందని ఢిల్లీ సీఎం, అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఆపాలని, దీని కారణంగా ఓటర్లు ప్రభావితం అవుతారని అఖిలేశ్ వర్గం ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ అన్నారు.